వ్యవసాయ సంస్కరణ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం.. డిప్యూటీ చైర్మన్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం - BBC Newsreel

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్‌
ప్రచురణ

తీవ్ర వ్యతిరేకతల మధ్య వ్యవసాయ సంస్కరణలకు సంభందించిన రెండు బిల్లులు ఆదివారం సాయంత్రం రాజ్యసభలో ఆమోదం పొందాయి. మూజు వాణి ఓటు ద్వారా వీటిని ఆమోదించారు.

దీనిపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చారు. డిప్యూటీ చైర్మన్ వైఖరి ప్రజాస్వామ్య విధానాలను దెబ్బతీసేదిగా ఉందని వారు ఆరోపించారు.

''రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ ప్రజాస్వామ్య విధానాలను పరిరక్షించక పోగా వాటికి వ్యతిరేకంగా నడుచుకున్నారు'' అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ ఆరోపించారు.

ఈ వ్యవసాయ బిల్లులు రైతులకు హాని చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి.

దీనిపై కేంద్ర మంత్రులు సాయంత్రం 7.30 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "రాజ్యసభలో జరిగిన విషయం విచారకరం, దురదృష్టకరం" అంటూ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్‌కు రాజ్‌నాథ్ సింగ్ మద్దతు తెలిపారు.

టిక్‌టాక్: ట్రంప్ ఓకే చెబుతున్న కొత్త ఒప్పందంలో ఏముంది.. ఎవరెవరు ఉన్నారు.. ఎవరికెంత లాభం?

ట్రంప్

ఫొటో సోర్స్, EPA

అమెరికాలో టిక్‌టాక్ తన కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు వీలుగా పట్టాలెక్కుతున్న ఒప్పందానికి డోనల్డ్ ట్రంప్ తన అంగీకారం తెలిపారు.

టిక్‌టాక్, అమెరికా సంస్థలు ఒరాకిల్, వాల్‌మార్ట్ మధ్య ప్రతిపాదిత భాగస్వామ్య ఒప్పందానికి తాను ఆశీస్సులు అందించానని ట్రంప్ చెప్పారు.

అంతకుముందు ట్రంప్ జాతీయ భద్రతను కారణంగా చూపుతూ టిక్‌టాక్‌ను నిషేధించాలని ఆదేశించారు.

టిక్‌టాక్ సేకరించిన డాటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తుందని అమెరికా భద్రతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.

అయితే, టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. చైనాలోని పాలక కమ్యూనిస్టు పార్టీకి తాము ఎలాంటి డాటానూ అందివ్వడం లేదని చెబుతోంది.

కొత్త ఒప్పందంపై ట్రంప్ శనివారం మాట్లాడుతూ.. టిక్ టాక్ వాడుతున్న 10 కోట్ల మంది అమెరికన్ల డాటా భద్రంగా ఉండేలా ఈ ఒప్పందం భరోసా ఇస్తుందని అన్నారు. ''ఇది 100 శాతం భద్రం'' అన్నారు ట్రంప్.

నార్త్ కరోనాలినాలో ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తూ ఆయన ''ఈ ఒప్పందానికి నా ఆశీస్సులున్నాయి. దీన్ని నేను ఆమోదిస్తున్నాను'' అన్నారు.

కాగా చైనా ప్రభుత్వ అనుమతులూ అవసరమైన ఈ ఒప్పందానికి సంబంధించి బైట్ డ్యాన్స్ ఇంకా ఏమీ నిర్ధరించలేదు.

టిక్ టాక్

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం నుంచి అమెరికాలో ఏ యాప్ స్టోర్‌లో కూడా టిక్‌టాక్ లేకుండా చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత మళ్లీ ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది.

దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో యాప్ లభ్యత ముగింపు గడువు మరోవారం రోజులు పెంచుతున్నామని.. సెప్టెంబరు 27 వరకు టిక్ టాక్ యాప్ స్టోర్లలో ఉంటుందని.. అప్పటికీ ఒప్పందం కుదరకపోతే యాప్ స్టోర్ల నుంచి తొలగిస్తారని అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ సమస్య, కరోనావైరస్‌కు కారకులెవరన్న చర్చ నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో టిక్‌టాక్‌పై ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహించింది.

ఇంతకీ కొత్త ఒప్పందంలో ఏముంది?

ఈ ఒప్పందం ప్రకారం టిక్‌టాక్ గ్లోబల్ అనే కొత్త సంస్థ ఏర్పడుతుందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఈ కంపెనీలో అమెరికాకు చెందిన డైరెక్టర్లే ఎక్కువగా ఉంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా కూడా అమెరికన్లే ఉంటారు.

ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు ఇందులో చెప్పుకోదగ్గ స్థాయిలో వాటాదారులుగా ఉంటారని రాయిటర్స్ తెలిపింది. అమెరికా కోరుతున్న అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించడానికి టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ అంగీకరించింది.

టిక్ టాక్ డాటాను ఒరాకిల్ స్టోర్ చేస్తుంది.. అలాగే సోర్స్ కోడ్‌ను తనిఖీ చేసే అధికారమూ ఒరాకిల్‌కు ఉంటుంది.

ఈ కొత్త కంపెనీ పూర్తిగా ఒరాకిల్, వాల్ మార్ట్‌ల నియంత్రణలో ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు.

ఈ ఒప్పందం అమెరికాలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని.. దేశానికి పన్ను ఆదాయం కూడా అందిస్తుందని ట్రంప్ చెబుతున్నారు.

జేమ్స్ క్లేటన్ విశ్లేషణ

‘‘డోనల్డ్ ట్రంప్ కోరుకున్న ఒప్పందం ఇది కాదు. కంపెనీకి చెందిన యూఎస్ విభాగాన్ని విక్రయించాలని ఆయన కోరుకున్నారు.

ఇప్పుడు జరుగుతున్నది వేరు.

ఇది మూడు కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ వంటిది. ఒరాకిల్, వాల్‌మార్ట్‌లు అమెరికా వినియోగదారుల డాటాను భద్రంగా చూసుకునే నమ్మకస్థులైన భాగస్వాములుగా ఉంటారు.

అయితే, ఈ ప్రతిపాదిత కొత్త కంపెనీలో ఇప్పటికీ టిక్ టాక్ యాజమాన్య సంస్థయిన చైనా కంపెనీ బైట్ డాన్సే అతి పెద్ద వాటాదారుగా ఉంటుంది.

మరి, ఈ ఒప్పందాన్ని ట్రంప్ ఆమోదించడానికి కారణమేంటి?

కొత్త భద్రతా ఏర్పాట్లతో ట్రంప్ సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ కొత్త ఒప్పందం 500 కోట్ల డాలర్ల విద్యానిధిని అందిస్తుండడమే కాకుండా దేశంలో 25 వేల కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని చెబుతున్నారు.

అయితే, ఇదంతా ఇంకా ప్రతిపాదనల్లోనే ఉంది. చైనా ప్రభుత్వం దీనికి ఇంకా అంగీకరించలేదు. అంగీకరిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)