చైనాలో ఈ-మెయిల్‌ కన్నా ఇతర యాప్‌లే ఎక్కువగా వాడతారు... ఎందుకు?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లు హాయ్ లియాంగ్
    • హోదా, బీబీసీ వర్క్ లైఫ్
  • ప్రచురణ

దక్షిణ చైనాలో నెలకొన్న యాంగ్ షౌ అనే ఒక చిన్న పట్టణంలో, 2008లో నేనొక ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తుండేదానిని. సున్నపు రాయి కొండలతో అందంగా ఉండే ఆ ప్రదేశం చదువుకోవడానికి చాలా ఆహ్లాదంగా ఉండేది. నా దగ్గర చదువుకునే విద్యార్థులు వారి కోర్స్ పూర్తయిన తర్వాత నేను వారితో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ఎంఎస్ఎన్ మెసెంజర్ తరహాలో ఉండే చైనా యాప్ క్యూక్యూని డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు.

నేను వాళ్ళని ఫేస్‌బుక్‌లో అకౌంట్లు తెరిచి నన్ను ఫ్రెండ్‌గా చేర్చుకుని వాళ్ళ ఈమెయిల్ ఐడీలు పంపించండని చెప్పాను. కొంతమంది ఐడీలు పంపినప్పటికీ, వాటి శైలి వలన వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండేది. ఈమెయిల్ ఐడీలు సాధారణంగా ఇలా ఉండేవి: zwpzjg59826@126.com. వీటిని చూస్తే విచిత్రంగా అనిపించేవి కానీ, బ్రిటన్‌లో కూడా అప్పట్లో ఇలాంటి ఈ మెయిల్ ఐడీలే ఉండేవి.

కొన్ని సంవత్సరాల తర్వాత నేను బీజింగ్’లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేయడం ప్రారంభించాను. నేను నా చైనా క్లయింట్‌లతో సాధారణంగా ఈమెయిల్‌లో సంప్రదింపులు జరిపేదానిని కాదు. నా స్మార్ట్ ఫోన్ లోనే 'వి చాట్’ యాప్ ద్వారా నాకు కాపీ రాసే పని వచ్చేది. పూర్తయిన పనిని అదే యాప్‌లో తిరిగి వెనక్కి పంపేదానిని. దానికి డబ్బులు కూడా ‘వి చాట్’ ద్వారానే చెల్లించేవారు. ఈ ప్రక్రియ అంతా విచిత్రంగా అనిపించేది.

2000 దశకంలో చైనాలో ఇంటర్నెట్ కేఫ్ లు మొదలయ్యాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2000 దశకంలో చైనాలో ఇంటర్నెట్ కేఫ్ లు మొదలయ్యాయి

పాశ్చాత్య దేశాలలో పని స్థలాలలో ఈ-మెయిల్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అమెరికా లో 90.9 శాతం , యు కె లో 86 శాతం ఇంటర్నెట్ యూజర్లు ఈ-మెయిల్ వాడతారు. ఈ దేశాలలో వస్తువుల కోసం వెతకడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వీడియోలు, సోషల్ మీడియా చూడటం కంటే ఈ-మెయిల్ వాడకమే ఎక్కువ.

కానీ, చైనాలో ఈ చిత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. చైనా ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల కంటే 22 శాతం తక్కువగా ఈ-మెయిల్ వాడతారని డెలాయిట్ సంస్థ 2018 లో నిర్వహించిన చైనా మొబైల్ కన్స్యూమర్ సర్వే లో తేలింది. చైనాలో వి చాట్ ఎక్కువగా వాడతారు. స్మార్ట్ ఫోన్ వాడేవారిలో 79. 1 శాతం మంది వి చాట్ ని ఎక్కువగా వాడతారు. చైనా లో మెసేజింగ్ యాప్లను వాడే వారిలో 84 .5 శాతం మంది వి చాట్ నే వాడతారు.

సర్వే చేసిన 20000 మందిలో 88 శాతం మంది ఇదే యాప్ ని ఆఫీస్ పనిలో కూడా వాడతారని, పెంగ్విన్ ఇంటలిజెన్స్ 2017 లో సేకరించిన సమాచారం వెల్లడించింది. ఈ-మెయిల్ వాడేవారి శాతం 22. 6 మాత్రమే.

తైవాన్ కి చెందిన ఈవ సు డిజిటల్ బ్రాండింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఆమె కొంత కాలం పాటు అమెరికాలో ఉన్నారు. ఆమె గత ఆరు సంవత్సరాల నుంచి షాంఘై లో పని చేస్తున్నారు. ఆమె విదేశీ క్లయింట్ లతో ఈ-మెయిల్ లో కానీ, లింకెడ్ ఇన్ లో కానీ సంప్రదింపులు జరుపుతారు.

కానీ, చైనా క్లయింట్లు అయితే వి చాట్‌లో ఫైళ్లు పంపాల్సిందే అని చెప్పారు.

చైనా

ఫొటో సోర్స్, Alamy

ఆలస్యంగా అలవాటు చేసుకున్నారు

చైనా లో వి చాట్ యాప్ కి 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. చైనా లో ప్రజలు ఈ యాప్ నే ఎందుకు వాడతారనడానికి వారికి ఇదొక అలవాటుగా మారిపోయిందని చెప్పవచ్చు. 1999 లో టెన్సన్ట్ అనే చైనీస్ సంస్థ, డెస్క్ టాప్ మెసేజింగ్ ప్రోగ్రాం ఐసిక్యూ తరహాలో క్యూ క్యూ అనే ప్రొడక్ట్ ని విడుదల చేసింది.

ఆ సమయంలో, ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం చైనాలో ప్రతి 100 మందికి 1. 2 కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. అమెరికాలో ప్రతి ఇద్దరికీ ఒక కంప్యూటర్ ఉండేది. 2000 దశకంలో చైనాలో ఇంటర్నెట్ కేఫ్ లు మొదలయ్యాయి. యువత వీటికి ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.

ఆ సమయంలో క్యూ క్యూ లో మెసేజింగ్ తో పాటు, యువతను ఆకర్షించే గేములు, మ్యూజిక్ కూడా ఉండటంతో ఈ యాప్ బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. చైనాకి మాత్రమే పరిమితమైన సోషల్ నెట్వర్క్ కూడా ఉండేది. ఈ- మెయిల్ తో పోలిస్తే క్యూ క్యూ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సౌలభ్యం ఎక్కువగా ఉండేది.

2008 లో జేమ్స్ యు ఆన్, జాసన్ ఇన్క్ రాసిన సూపర్ ట్రెండ్స్ అఫ్ ఫ్యూచర్ చైనా అనే పుస్తకంలో, చైనాలో యువతరం క్యూ క్యూ గాని, ఎం ఎస్ ఎన్ అకౌంట్ గానీ లేకుండా ఉండటమనేది అసాధ్యమని రాశారు.

"పాశ్చాత్త్యులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ ఉండరని ఎలా అనుకుంటారో అలా". కొంత మంది సీనియర్ అధికారులు వారి బిజినెస్ కార్డుల మీద కూడా క్యూ క్యూ నంబర్లను ప్రింట్ చేయించుకునేవారు. అలాగే, సంస్థలకు కూడా తమ సొంత క్యూ క్యూ అకౌంట్లు ఉండేవి.

2012 నాటికి క్యూ క్యూ కి నెలకి 79.8 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు. కానీ, టెన్సన్ట్ సంస్థ 2011 లో విడుదల చేసిన వి చాట్ యాప్ చైనాలో ప్రముఖ కమ్యూనికేషన్ సాధనంగా మారింది.

బ్రిటన్ లో ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవాలంటే ఈ-మెయిల్ కచ్చితంగా ఉండాలని.. 2004 సంవత్సరం నుంచి చైనా డిజిటల్ ఇన్నోవేషన్ రంగంలో కన్సల్టెంట్ గా పని చేస్తున్న బ్రిటన్ జాతీయుడు మాథ్యూ బ్రెన్నన్ చెప్పారు. కానీ, చైనాలో మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా చాలా సేవలను వాడుకోవచ్చని అన్నారు. వి చాట్, అలీ పే లాంటి యాప్లతో ఆన్లైన్ లోనే ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం గాని, షాపింగ్ కి చెల్లింపులు చేయడం గాని, స్నేహితులకి మెసేజ్ చేయడం గాని చేసే సౌకర్యం ఉంటుందని చెప్పారు.

చైనాలో ఈ-మెయిల్ కంటే ఇతర యాప్ల వాడకం ఎందుకు ఎక్కువ?

ఫొటో సోర్స్, ALAMY

ఫొటో క్యాప్షన్, చైనాలో ఈ-మెయిల్ కంటే ఇతర యాప్ల వాడకం ఎందుకు ఎక్కువ?

ఇన్స్టంట్ మెసేజింగ్

చైనా లో ప్రజల పని తీరుకి వి చాట్ సరిగ్గా సరిపోతుందని చియోంగ్ కాంగ్ బిజినెస్ స్కూల్ లో అర్ధ శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న జోన్గ్ లింగ్ చెప్పారు.

ఈ-మెయిల్ కన్నా తక్కువ సమయంలో సులభంగా పనైపోతుంది. దాని వలన ప్రజలు కూడా వెంటనే స్పందిస్తారని ఆమె చెప్పారు.

“ఏ పనికైనా సత్వరమే స్పందించాలనే లక్షణం చైనా వ్యాపార సంస్కృతిలో భాగమైపోయింది”. చైనా లో ప్రజల వ్యక్తిగత జీవితాలకు పని జీవితానికి మధ్య ఉండే సరిహద్దులు చాలా బలహీనంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

"దాంతో, చాలా మంది యజమానులు పనికి సంబంధించిన ప్రశ్నలను ఉద్యోగులకు పంపించి సమాధానం కోసం మరుసటి రోజు వరకు వేచి ఉండరు. ఏదైనా అంశం మీద పలు మార్లు సంభాషించాల్సిన అవసరం ఉంటే వి చాట్ వాడటం చాలా సులభంగా ఉంటుందని” ఆమె అన్నారు.

అయితే, దీని వలన ఉద్యోగులు 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు. చిన్న చిన్న సందేశాలకి వి చాట్ బాగుంటే, ఈ-మెయిల్ చికాకుగా ఉంటుందని బ్రెన్నన్ అన్నారు. మనం సంభాషించే విధానాన్ని కొన్ని ప్లాట్ఫారం లు ప్రభావితం చేస్తాయని అన్నారు. ఇన్స్టంట్ మెసేజ్ చేసినప్పుడు సత్వరమే సమాధానం ఆశిస్తారని ఆయన అన్నారు. వారాంతంలో సందేశం వచ్చినా వెంటనే స్పందించాల్సి ఉంటుందని అన్నారు.

యు కె , అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్ లాంటి దేశాల్లో ఈ-మెయిల్ వాడకమే ఎక్కువగా కనిపిస్తుంది.

కానీ, చాలా ఆసియా దేశాలలో ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఆసియా దేశాలలో చాట్ చేసుకునే యాప్ లు బాగా వాడతారని ప్రోఫెట్ కన్సల్టెన్సీ సంస్థ భాగస్వామి అలన్ కేసి అన్నారు.

"చైనా లాంటి చాలా దేశాలు కంప్యూటర్ యుగాన్ని దాటి మొబైల్ కనెక్టివిటీ కి దగ్గరగా వచ్చేశాయని ఆయన అన్నారు.

అందువలనే ఫేస్ బుక్, వి చాట్, లైన్, కకావ్ టాక్, జాలో లాంటి అప్లికేషన్లకి డిమాండ్ పెరిగిందని అన్నారు.

చైనాలో చాలా మంది ఉద్యోగులు 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు

ఫొటో సోర్స్, ALAMY

ఫొటో క్యాప్షన్, చైనాలో చాలా మంది ఉద్యోగులు 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు

వ్యాపారంలో కూడా

చైనా లో వి చాట్ కాకుండా డింగ్ టాక్ , బైట్ డాన్స్ లార్క్ లాంటి యాప్ లు పెద్ద పెద్ద సంస్థల వ్యాపార అవసరాలకు కూడా ఉపయోగపడతాయి. ఈ యాప్ల ద్వారా డాక్యుమెంట్లను షేర్ చేసుకోవడం, ఆన్లైన్ లోనే ఎడిటింగ్ చేసుకోగల్గడం. గోప్యత పాటించగలగడం కూడా వీలవుతుంది. ఒక సందేశాన్ని ఎవరైనా చదివారో లేదో కూడా తెలుసుకునే అవకాశం డింగ్ టాక్ లో ఉంటుంది.

30 సంవత్సరాల హైలన్ జియా చైనా క్రిప్టో కరెన్సీ కంపెనీ లో పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆమె తన స్వస్థలమైన బీజింగ్ నుంచి 2018 లో ఇంగ్లాండ్ లోని ప్లై మౌత్ కి వెళ్లారు. "యు కె లో ఆన్లైన్ సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని”, ఆమె అన్నారు.

"అమెజాన్ లో కొన్ని సరుకులు మాత్రమే కొనుక్కోగలం, కొన్ని అపాయింట్మెంట్ లు బుక్ చేసుకోవాలంటే మళ్ళీ వెబ్ సైట్ కి వెళ్ళాలి. అందుకోసం ఈ మెయిల్ గాని, ఫేస్ బుక్ గాని ఉండాలి. అదే చైనా లో వి చాట్ అకౌంట్ ఉంటే అన్ని పనులు ఒకే చోట చేసుకోవచ్చని” ఆమె అన్నారు.

చైనా లో నేనెప్పుడూ ఈ-మెయిల్ చూసుకునే దానిని కాదు. నాకు ఎవరైనా ఈ- మెయిల్ లో నే సమాధానం చెప్పాలని ఎదురు చూడనని అన్నారు.

దీనర్ధం చైనాలో ప్రజలెవరూ ఈ -మెయిల్ వాడటం లేదని కాదు. చాలా మందికి ఈ-మెయిల్ ఐ డి కూడా ఉంటుంది. కానీ, అమెరికా, యూరోప్ ప్రజలతో పోల్చి చూస్తే చైనా లో ఈ-మెయిల్ వాడకం తక్కువ. చైనాలో పెద్ద నగరాలైన బీజింగ్, షాంఘై లలో ఈ మెయిల్ వాడే వారు ఎక్కువగా ఉంటారని బ్రెన్నన్ అన్నారు.

నాతో కొంత కాలం పాటు వాంగ్ అనే ఒక విద్యార్థి ఒకరు ఈ-మెయిల్ లో మాట్లాడేవారు. ఈ మధ్య నేను తనని ఆ మెయిల్ ఐ డి ఇంకా ఉందా అని అడిగినప్పుడు, ఏ ఈ-మెయిల్ అని నవ్వుతూ ప్రశ్నించారు. నాకు చాలా ఈ-మెయిల్ ఐ డి లు ఉన్నాయి. నేను అరుదుగా ఈ-మెయిల్ చెక్ చేస్తాను. వి చాట్ ఎక్కువగా వాడతానని చెప్పారు.

వాంగ్ లాగే చైనాలో చాలా మందికి వి చాట్ వారి దైనందిన జీవితాలలో భాగమైపోయింది. ఈ-మెయిల్ అనేది గత కాలం మిగిల్చిన జ్ఞాపకంలా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)