కరోనావైరస్ ట్రీట్‌మెంట్: ఇంట్లోనే ఐసీయూ.. సాయంగా నర్సు.. డాక్టర్ పర్యవేక్షణ - ప్రైవేటు చికిత్సకు పెరుగుతున్న డిమాండ్

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

జనసాంద్రత ఎక్కువగా ఉండే ఉన్న పశ్చిమ దిల్లీలోని ఒక కాలనీలో ఒక కుటుంబం ఆస్పత్రిలో పడక సంపాదించాలని పరుగులు తీస్తోంది.

“లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నాకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దాంతో, మేం ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని చూశాం” అని 67 ఏళ్ల రాజ్‌కుమార్ మెహతా ఆ రోజును గుర్తుచేసుకున్నారు.

పడకల కోసం వెతికిన ఆ కుటుంబం నగరంలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసి ఉండడంతో నిరాశపడ్డారు. ఎక్కడ చూసినా రోగులు భారీ సంఖ్యలో ఉన్నారు.

ఒక కామన్ ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో, సొంత ఇంట్లోనే ఆక్సిజన్ సపోర్టు సహా, ఆస్పత్రి బెడ్ ఏర్పాటుచేస్తామని, రోగులను పూర్తిగా పర్యవేక్షిస్తామని చెప్పిన ఒక కంపెనీ నుంచి వివరాలు తెలుసుకోడానికి మెహతా కొడుకు మనీష్ ఫోన్ అందుకున్నారు.

కొన్ని గంటల్లోనే వారి మధ్య ఒప్పందం జరిగింది. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఆక్సీమీటర్‌తో కనెక్ట్ అయిన కార్డియాక్ మానిటర్, ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్, ఒక పోర్టబుల్ వెంటిలేటర్‌ను ఇంటికి చేర్చారు. వాటితోపాటూ ఒక శిక్షణ పొందిన నర్స్ కూడా ఉంటారు.

“ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఏమేం అవసరం, మెహతాకు హోం కేర్ సౌకర్యం అందించడానికి మొత్తం ఎంత ఖర్చవుతుందో మేం వివరంగా చెప్పాం. తర్వాత రోజు నుంచే ఆయన మా పర్యవేక్షణలో ఉన్నారు. తన ఇంట్లోనే ఐసొలేషన్‌లో గడిపారు. బాగా కోలుకోగలిగారు” అని ఐసొలేషన్ సౌకర్యం అందించిన హెచ్‌డీవై హెల్త్ కేర్ కంపెనీని నిర్వాహకుడు అంబరీష్ మిశ్రా చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

బెడ్లు లేవంటూ తిప్పిపంపుతున్న ఆస్పత్రులు

భారత్‌లో ఇప్పటికే 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 21 వేల మందికి పైగా చనిపోయారు. దేశంలో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో అత్యధిక కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరింది.

చెన్నైలో మాథమెటికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు జూన్ ఆఖర్లో కరోనా గణాంకాలను విశ్లేషించారు. భారత్‌లో జులై చివరినాటికి, లేదా ఆలోపే పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చేరుతాయని చెప్పారు.

ప్రభుత్వం మాత్రం బాధితులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని చెబుతోంది. ఆస్పత్రిలో పడకలు లేకపోవడంతో తమను తిప్పి పంపించేశారని వందలాది కరోనా రోగులు చెబుతున్నారు.

ఇప్పుడు ఇలాంటి సౌకర్యాలను భరించగలిగే స్థోమత ఉన్న వారు ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. అంటే సొంత ఇళ్లలోనే ప్రైవేటుగా కరోనా చికిత్సలు పొందటానికి సిద్ధం అవుతున్నారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆస్పత్రులపై కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీంతో లక్షణాలు ఉన్నా, లేకున్నా కోవిడ్ రోగులు వీలైనంత త్వరగా క్వారంటైన్లో ఉండాలని కేంద్రం ఆదేశించింది.

ఐసొలేషన్ వార్డుల సంఖ్యను పెంచడానికి హోటళ్లు, స్టేడియంలు, రైల్వే బోగీలను కూడా ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. కానీ, ఒకటి రెండు పాజిటివ్ కేసులు ఉన్న కుటుంబాలు హోం క్వారంటైన్ సౌకర్యాల కోసం చూస్తున్నాయి.

“ఆస్పత్రిలో చేర్చడం వల్ల కొత్త ఇబ్బందులు రాకుండా, ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు చేసి మా నాన్న ఆరోగ్యాన్ని దగ్గరగా ఉండి చూసుకోవాలని మేం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని అర్థమైంది” అని 56 ఏళ్ల కరోనా రోగి కుమార్తె భారతి సింగ్ చెప్పారు.

“ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లకు వందలాది కోవిడ్-19 రోగులను చూసుకోడానికి సమయం, ఓపిక ఉండదు. అలా అక్కడ ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉండచ్చు. ఇప్పుడు మా ఇంట్లోనే అత్యసవర సేవల నిపుణుడు లేదా పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో ఒక నర్సు మా నాన్నను చూసుకుంటున్నారు” అని చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

‘‘ఇది చాలా పెద్ద బాధ్యత...’’

అక్కడ కోవిడ్ 19 రోగులకు సేవలు అందించే పారామెడిక్స్ లేదా నర్సులకు కొత్త రోగి దగ్గర ఉండే ముందు, తర్వాతా కరోనా పరీక్షలు చేస్తారు. రోగి కుటుంబం కూడా ఐసొలేషన్ సూచనలు పాటించేలా చూసుకుంటారు.

కోవిడ్ కేర్ అందించే ఒక ప్రైవేటు హెల్త్ కేర్ కంపెనీ కోసం కేఏ వొర్సెమ్లా నర్సుగా పనిచేస్తున్నారు. కరోనా రోగి గదిలో ఒక్కరే ఉండి వారికి చికిత్స అందించడాన్ని ఆమె చాలా పెద్ద బాధ్యతగా చూస్తున్నారు.

“ఆస్పత్రిలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అన్ని పరికరాలతో పాటూ, డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న సమయంలో డాక్టర్లు భౌతికంగా అందుబాటులో ఉండరు. దాంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోగలిగేలా నర్సులకు తగిన సామర్థ్యం ఉండాలి. డాక్టర్లను ఎలాంటి సమయంలో, ఎలా సంప్రదించాలి అనేది తెలిసుండాలి” అని ఆమె చెప్పారు.

రోగి తీసుకునే ఆక్సిజన్ స్థాయి, అతడి శరీర ఉష్ణోగ్రత, మిగతా లక్షణాల గురించి నర్సులు లేదా పారామెడిక్స్ ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేక వైద్య నిపుణుడికి అప్‌డేట్ చేస్తూ ఉంటారు.

“డాక్టర్లు సరిగ్గా సమయానికి జోక్యం చేసుకోవడం చాలా కీలకం” అని హోంకేర్ సేవలు అందిస్తున్న ఒక కంపెనీలో అత్యవసర సేవల నిపుణుడుగా పనిచేస్తున్న దీక్షిత్ ఠాకూర్ చెబుతున్నారు.

“కోవిడ్-19కు మనకు ఇప్పటికీ ఒక నిర్ధారిత చికిత్స అంటూ ఏదీ లేకపోవడంతో ఇంట్లో అయినా, ఆస్పత్రిలో అయినా రోగులను సపోర్టివ్ థెరపీలోనే ఉంచుతారు. ఒక కరోనా రోగిని ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు ఉన్న ఐసీయూకు ఎప్పుడు మార్చాలి, అతడికి ఆ అవసరం ఉందా, లేదా అని ఒక డాక్టర్ నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం” అని ఆయన చెప్పారు.

భారత్‌లో మన ఇళ్లలోనే ఈ సేవలు పొందడానికి రోజుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ మినీ ఐసీయూలను భరించే స్థోమత దేశంలో చాలామందికి లేదు. కానీ వాటి డిమాండ్ మాత్రం పెరుగుతోంది.

ఆక్సిజన్

ఫొటో సోర్స్, Getty Images

సొంత ఇంట్లోనే కరోనా క్రిటికల్ కేర్

ఇక ఈ వ్యాపారంలో ఉన్న హెచ్‌డీయూ హెల్త్ కేర్, హెల్త్ కేర్ అట్ హోం లాంటి పెద్ద కంపెనీలు రోగుల ఇళ్లలోనే క్రిటికల్ కేర్ సపోర్ట్ కూడా అందిస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత కూడా వీటి డిమాండ్ అంత ఎక్కువగా ఏం లేదు.

“ప్రతిరోజూ మమ్మల్ని ఐదు కుటుంబాలు సంప్రదిస్తాయి. అంటే రోజుకు 20 నుంచి 25 మంది కోవిడ్ రోగులు ఉంటారు” అని ధర గురించి, అడ్వాన్స్ గురించి నాతో ఫోన్లో మాట్లాడిన అంబరీష్ మిశ్రా చెప్పారు.

భారత్‌లో పెద్ద నగరాల్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్స్ కూడా ఇలాంటి సౌకర్యాలు అందించడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను, గ్రూప్ హౌసింగ్ సొసైటీలను సంప్రదిస్తున్నాయి. కరోనా లక్షణాలు స్వల్పంగా, అసలు కనిపించని రోగులు తమ ఇళ్లలోనే ఐసొలేట్ కావాలని, వారి ఆక్సిజన్ లెవల్స్ గమనించేందుకు ఆక్సీమీటర్లను ఉచితంగా ఇంటికే పంపిస్తామని దిల్లీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.

శ్వాస ఇబ్బందులు, ఇతర సమస్యలు వచ్చినపుడు మాత్రమే నిర్ధారిత ఆస్పత్రులకు వెళ్లాలని ప్రభుత్వాలు సూచించాయి.

ఇటీవల వరకూ భారత ‘కరోనా రాజధాని’గా వర్ణించిన ముంబయి నగరంలోని ఆస్పత్రులు కూడా కరోనా రోగులతో నిండిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, స్టేడియంలను తాత్కాలిక కోవిడ్ కేంద్రాలుగా మార్చేసింది.

జనసాంద్రత ఎక్కువగా ఉండే నగర శివార్లలో రెసిడెన్షియల్ అపార్టుమెంట్లలో ఉన్నవారు తమ క్లబ్ హౌసులు, క్రీడా మైదానాలను కూడా ఐసొలేషన్ జోన్లుగా మార్చేయాలని నిర్ణయించారు. ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీలే కాదు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా వీరికి సాయం అందిస్తున్నారు.

“ఆస్పత్రిలో రోగులకు పడకలు దొరక్కపోవడంతో మాకు వేరే దారి లేకుండా పోయింది. కేసుల పెరుగుదల రేటు ముంబయిలో చాలా ఎక్కువగా ఉంది. 8 నుంచి 10 మంది కరోనా రోగులు ఐసొలేషన్ ఉండగలిగేలా మేం మా అపార్టుమెంటులోనే ఒక ప్రాంతాన్ని ఎంచుకుని శానిటైజ్ చేసి సిద్ధం చేశాం’’ అని ఆ ఆపార్ట్ మెంట్ వాసి, రేడియాలజిస్ట్ డాక్టర్ వివేక్ దేశాయ్ చెప్పారు. హెల్త్ కేర్ అట్ హోం సంస్థ దీనికి వారికి సాయం చేసింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఏదైనా జరగరానిది జరిగితే?

కానీ ఒక కరోనా రోగిని ఇంట్లో గానీ, ప్రైవేట్ అపార్టుమెంటు భవనంలోగానీ ఉంచి చూసుకోవడం అనేది, చాలా ప్రమాదకరం అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్-19 రోగుల ఆక్సిజన్ లెవల్స్ హఠాత్తుగా, దారుణంగా పడిపోతుంటాయి. అందుకే వారికి అత్యాధునిక వెంటిలేటర్‌తో పూర్తిస్థాయిలో పనిచేసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌, ఒక అత్యవసర సేవల నిపుణుడి పర్యవేక్షణ చాలా కీలకం అని చాలా మంది భావించారు.

“నేను మా కమ్యూనిటీ సెంటర్‌ను లేదా జిమ్‌ను మెడికల్ సెంటరుగా, కోవిడ్ కేర్ సెంటరుగా లేదంటే ఐసీయూగా మార్చేశానని చెబితే, అక్కడ ఉన్న ఒకే ఒక సమస్య వారిని పర్యవేక్షించడానికి వైద్య నిపుణులు లేకపోవడమే. ఆ కేంద్రంలో 10 మంది రోగులు ఉన్నప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే, దానికి ఎవరు బాధ్యులు?” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ సందీప్ శర్మ నాతో అన్నారు.

మరోవైపు “అందరిలో పరువు పోతుందని, చుట్టూ పెద్ద సంఖ్యల రోగులు ఉంటారని, మీ కుటుంబానికి దూరంగా ఉంటారనే భయం ఉన్నప్పుడు కరోనా వచ్చిన వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ, ఎవరైనా డైనమిక్ మెడికేషన్, జోక్యం అవసరం అయిన పది శాతం జోన్లోకి వచ్చినపుడు వారిని ఆస్పత్రి ఐసీయూలో చేర్చడం తప్ప వేరే దారి లేదు” అని దిల్లీ మాక్స్ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు అనస్తీషియన్, అత్యవసర సేవల నిపుణుడుగా పనిచేస్తున్న డాక్టర్ మనోజ్ సిన్హా చెప్పారు.

భారత్‌లోని ఉన్నతాదాయ వర్గాల్లో హోం ఐసీయూలు, ఐసొలేషన్ పడకల ప్రాధాన్యం పెరుగుతున్నా దేశంలోని ఎక్కువ మంది కరోనా రోగులకు అలాంటి ప్రత్యామ్నాయం లేదు.

వీటికి బదులు చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులలో చేరి కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రుల్లో కాస్త పడకలు, సిబ్బంది, పరికరాల కొరత కూడా ఉంది.

కానీ ‘‘సొంత ఇళ్లలోనే కరోనా నుంచి కోలుకున్న కొంతమందిని చూసినవారికి వాటి అవసరం రాలేదు. నేను దీన్ని మరోలా చేసుండను” అంటారు భారతీసింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)