భారత్-చైనా సరిహద్దు వివాదం: చైనా ప్రకటనలో ఏముంది? భారత్‌పై విపక్షాలు ఎందుకు ప్రశ్నలు సంధిస్తున్నాయి

ఫొటో సోర్స్, AFP
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల అనంతరం రెండు వైపుల నుంచి శాంతి స్థాపనకు చర్యలు మొదలయ్యాయి.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీల ఫోన్ సంభాషణ అనంతరం ఈ దిశగా తొలి అడుగులు పడ్డాయి.
శాంతి స్థాపనకు సంబంధించి రెండు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి. భారత్ జారీచేసిన ప్రకటనలో మూడు ప్రధాన అంశాలున్నాయి.
భారత ప్రభుత్వ ప్రకటన
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు ఆదివారం టెలిఫోన్‌లో సంభాషించుకున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
తూర్పువైపు సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రెండు దేశాల ప్రతినిధులు చర్చించారు. అనంతరం రెండు దేశాల సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు సరిహద్దుల్లో శాంతి స్థాపన ముఖ్యమని తీర్మానించారు.
ఆదివారం చర్చల అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను వీలైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని రెండు దేశాల ప్రతినిధులు నిర్ణయించినట్లు ప్రకటనలోని రెండో పేరాలో పేర్కొన్నారు.
సరిహద్దుల్లో శాంతి స్థాపనతోపాటు ఉద్రిక్తతలను తగ్గించేందుకు దశల వారీగా బలగాల ఉపసంహరణ చర్యలు తీసుకుంటామని తీర్మానించినట్లు పేర్కొంది. వాస్తవాధీన రేఖను పూర్తిగా గౌరవిస్తామని, ప్రస్తుత పరిస్థితులు మారేలా ఎలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోబోమని భారత్, చైనా నిర్ణయించినట్లు ప్రకటనలో నొక్కిచెప్పారు.

ఫొటో సోర్స్, MEA
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదని రెండు దేశాలూ తీర్మానించినట్లు వివరించింది. మరోవైపు దౌత్య, సైనిక స్థాయిల్లో తదుపరి చర్చలు కొనసాగుతాయని మూడో పేరాలో భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
అయితే, చైనా విడుదలచేసిన ప్రకటనలో స్వరం కాస్త భిన్నంగా కనిపించింది.

ఫొటో సోర్స్, MFA/China
చైనా ప్రకటనలో ఏముంది?
భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టార్‌లో గాల్వన్ లోయలో జరిగిన పరిణామాల్లో ఏది తప్పో ఏది ఒప్పో స్పష్టంగా తెలుస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
"చైనా తమ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడంతోపాటు శాంతి స్థాపనకూ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ దిశగా చైనాతో కలిసి భారత్ పనిచేస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడే రెండు దేశాల బంధాలపై ప్రజలకు మంచి అభిప్రాయం కలుగుతుంది. విభేదాలు మరింత పెరగకుండా, పరిస్థితులను మరింత క్లిష్టతరం చేయకుండా రెండు దేశాలూ ఉమ్మడి సహకారంతో ముందుకు వెళ్తూ... సంబంధాలను విస్తృత కోణంలో చూడాలి" అని చైనా పేర్కొంది.
ప్రకటనలో నాలుగు ప్రధాన అంశాలపై అంగీకారం కుదిరినట్లు ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చలు కొనసాగుతాయనీ వివరించారు.
అయితే చైనా ప్రభుత్వ ప్రకటనలో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు అనే పదాలు కనిపించలేదు.
ఈ కోణంలో రెండు దేశాల సంబంధాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చైనా ప్రకటనపై భారత్ ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాంగ్రెస్ ఏమంటోంది?
ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా వరుస ప్రశ్నలు సంధించారు.
మూడు ప్రశ్నలను అడుగుతూనే.. రెండు దేశాల ప్రకటనల స్క్రీన్‌షాట్‌లనూ ఆయన ట్వీట్‌చేశారు.
- సరిహద్దుల్లో ఇదివరకటి యథాస్థితి కోసం భారత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయలేదు?
- మన భూభాగంలో ఎలాంటి ఆయుధాలూ చేతిలోలేని 20 మంది జవాన్ల హత్యలను చైనా ఎలా సమర్థించుకోగలుగుతోంది.
- ప్రకటనలో గాల్వన్ లోయ సార్వభౌమత్వం గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు భారత్-చైనా సంబంధాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ కూడా ఇలాంటి ప్రశ్నలతోనే ఓ ట్వీట్‌చేశారు.
ఆయన రెండు దేశాల ప్రకటనలనూ వేర్వేరుగా ట్వీట్‌చేశారు. ఐదు అంశాల గురించి భారత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
"చైనా జారీచేసిన ప్రకటనలో వాస్తవాధీన రేఖను గౌరవిస్తున్నట్లు గానీ, యథాస్థితిని పాటిస్తామని గానీ లేదా ఉద్రిక్తతలను తగ్గించేలా త్వరగా చర్యలు తీసుకుంటామని గానీ లేదు. ఎందుకు?" అని ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ అంశంపై మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావ్‌తో బీబీసీ మాట్లాడింది.
రెండు దేశాల ప్రకటనల్లో విభేదాలేమీలేవని నిరుపమ వ్యాఖ్యానించారు. ఆమె భారత్-చైనా సంబంధాలపై ఓ పుస్తకం కూడా రాస్తున్నారు.
"నిజమే, రెండు దేశాల ప్రతినిధులూ సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత కూడా ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. అయితే రెండు దేశాలు విడివిడిగా జారీచేసిన ప్రకటనల్లో తప్పులు ఎంచడానికి ఇది సరైన సమయం కాదు. ముఖ్యంగా రెండు దేశాలు ఇప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులపై దృష్టిపెట్టాలి. ఉద్రిక్త పరిస్థితులు చల్లారాలి" అని ఆమె అన్నారు.
రెండు దేశాల ప్రకటనలను ఉన్నది ఉన్నట్లుగా చదవాల్సిన పనిలేదని ఆమె అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇలాంటివి జరగవని అన్నారు.
"రెండు దేశాల బంధాలను విస్తృత కోణంలో చూడాలని చైనా చెప్పిన అంశాన్ని భారత్ మరచిపోకూడదు. ఆసియాలోనే కాదు ప్రపంచం మొత్తం రెండు దేశాల సంబంధాలను గమనిస్తోందని చెప్పడానికి ఇది సంకేతం"
"ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా మొగ్గు చూపుతోందని చెప్పడానికి ఇది సంకేతమే. ఉద్రిక్తతలు కొనసాగితే ఎవరికీ మంచిది కాదని చైనా విశ్వసిస్తోంది. రెండు దేశాల మధ్య కుదరిన పాత ఒప్పందాలను గౌరవిస్తామని చైనా కూడా స్పష్టంచేసింది."
1993 నుంచి ఇప్పటివరకు భారత్, చైనాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయని నిరుపమ చెప్పారు. వీటి గురించి ప్రకటనలో ప్రస్తావించడం ద్వారా... వీటిని చైనా గౌరవిస్తోందని చెప్పకనే చెప్పిందని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, TWITTER/ANURAGTHAKU
జూన్ 15 అర్ధరాత్రిన భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. ఆ సమయంలో భారత సైన్యం చేతిలో ఆయుధాలు ఎందుకు లేవని విపక్షాలు అడిగాయి.
మేకులు కలిగిన ఇనుప రాడ్లతో భారత సైన్యంపై చైనా సైనికులు దాడిచేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. గాల్వన్ లోయలో గస్తీ కాస్తున్న సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని.. అయితే చైనాతో కుదిరిన ఒప్పందం వల్లే ఆయుధాలు వాడలేదని ఆయన వివరించారు.
"సరిహద్దుల్లో విధి నిర్వర్తిస్తున్న సైనికులందరి దగ్గరా ఆయుధాలు ఉంటాయి. శిబిరం నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా వారి దగ్గర ఆయుధాలుంటాయి. అలాగే జూన్ 15న గాల్వన్ లోయలో పనిచేస్తున్న సైనికులందరి దగ్గరా ఆయుధాలు ఉన్నాయి. అయితే 1996, 2005లో భారత్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల వారు ఎలాంటి కాల్పులూ జరపలేదు"అని జయశంకర్ వివరించారు.
ఈ ఒప్పందాల గురించి నిరుపమ కూడా ప్రస్తావించారు. "ఘటన స్థలం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం... అక్కడ బలగాల ఉపసంహరణ జరుగుతోంది. అందరూ కొంచెం ఓపిక పట్టాలి. ఈ విషయంతో రాజకీయాలు చేయకూడదు" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
అయితే తమ బలగాలు వెనక్కి తీసుకుంటున్నారా? లేదా అనే అంశంపై చైనా ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఈ విషయంపై రాయిటర్స్ వార్తా సంస్థ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను ప్రశ్నించింది. "ఇండియా మీడియా ప్రకారం.. గాల్వన్ లోయలో టెంట్లు, సామగ్రిని చైనా వెనక్కి తీసుకుంది. ఇది నిజమేనా? దీనిపై మీరేమంటారు?" అని ప్రశ్నించింది.
"జూన్ 30న మూడోసారి చైనా, భారత్ కమాండర్-స్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా సమర్థమైన చర్యలు తీసుకునేందుకు ముందు రెండు దశల్లో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి"అని ఆయన సమాధానం ఇచ్చారు.
"భారత్ కూడా అంతే దూరం వెనక్కి వెళ్తుందని ఆశిస్తున్నాం. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను పాటిస్తుందని భావిస్తున్నాం. సైనిక, దౌత్య స్థాయిల్లో చర్చలను కొనసాగిస్తారని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కలసి పనిచేస్తారని ఆశిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























