You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరాచీ: పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజిపై దాడి.. ‘భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి’
కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి భవనంపై నలుగురు మిలిటెంట్లు దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గార్డులు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. అనంతరం కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లనూ భద్రతా బలగాలు హతమార్చాయి.
భవనం ప్రధాన ప్రవేశ మార్గం గేటుపై గ్రెనేడ్‌తో తొలుత దాడి చేశారు. అనంతరం కాల్పులు మొదలుపెట్టారు. అయితే.. భవనం లోపలకు మిలిటెంట్లు ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని పోలీసులు చెబుతున్నారు.
స్టాక్ ఎక్స్‌చేంజ్ సిబ్బంది భయంతో లోపలున్న గదుల్లో దాక్కుని తలుపులకు తాళాలు వేసుకున్నారు. కొందరిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇంకా భవనం పరిసరాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.
దాడి చేపట్టింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ప్రకటించారు.
తమకు ప్రత్యేక దేశం కావాలని ఇక్కడి బలూచ్ గ్రూప్‌లు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ వనరుల్లో మరింత ఎక్కువగా తమ వాటా దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పాక్ ఏళ్ల నుంచీ ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులతో సతమతం అవుతోంది. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుతం జరిగిన దాడిని పోలిన మిలిటెంట్ దాడులు ఎక్కువయ్యాయి.
"అందరిపైనా కాల్పులు జరిపారు"
ఆటోమేటిక్ రైఫిళ్లతో వచ్చిన మిలిటెంట్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ వెలుపలి భద్రతా చెక్‌పోస్ట్‌పై గ్రెనేడ్ విసరడంతో తాజా దాడి మొదలైంది. గ్రెనేడ్ విసిరిన అనంతరం మిలిటెంట్లు కాల్పులు జరిపారు.
"సిల్వర్ రంగు కరోలా కార్‌లో దుండగులు వచ్చారు. వారిని గేట్ వెలుపల భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కాల్పులు మొదలయ్యాయి" అని సింధ్ పోలీసు విభాగం అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ నబీ మెమన్ బీబీసీ ఉర్దూతో చెప్పారు.
భారీ ఆయుధాలతో వచ్చిన నలుగురు మిలిటెంట్లను హతమార్చామని అధికారులు చెబుతున్నారు. అయితే మరణించిన వారిలో భద్రతా సిబ్బంది ఉండొచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
దుండగులు ఎవ్వరూ భవనం లోనికి వెళ్లలేదని మెమన్ చెప్పారు. వారి నుంచి గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించాయని వెల్లడించారు. మరోవైపు దుండగులు ఎవరూ లోపలికి రాలేదని స్టాక్ ఎక్స్‌చేంజ్ కూడా వెల్లడించింది.
కారు పార్కింగ్ ప్రదేశం నుంచి భవనంవైపు వచ్చిన గన్‌మెన్ ఒకరు కనిపించిన ప్రతి ఒక్కరిపైనా కాల్పులకు దిగారని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి డైరెక్టర్ అబిద్ అలీ హబీబ్ చెప్పారు.
భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల పక్కన కొందరి మృతదేహాలు పడివున్నట్లుగా ఘటన స్థలంలో తీసిన ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ కాల్పులకు సంబంధించి ఇంకా ఎవరైనా మిలిటెంట్లు మిగిలివున్నారేమోనని తెలుసుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
చాలా మంది స్టాక్ ఎక్స్‌చేంజ్ సిబ్బంది లాకర్ రూమ్‌లలో దాగున్నారని, కిందరు వెనక మార్గం నుంచి తప్పించుకున్నారని జీయో టీవీ వెల్లడించింది.
అయితే, ట్రేడింగ్ కార్యకలాపాలు మాత్రం ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగాయి.
ఇక్కడి భవనంలో వందల సంఖ్యలో ఆర్థిక రంగ సంస్థలకు చెందిన నిపుణులు పనిచేస్తారు. ఇతర బ్యాంకులు, వాణిజ్య కార్యకలాపాల నడుమ ఇది హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది.
రోజూ ఇక్కడ 8,000 మంది పనిచేస్తుంటారని సంస్థ తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రస్తుతం తక్కువ మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొంది.
బలూచ్ సంస్థలు ఎందుకు దాడులు చేపడుతున్నాయి?
పాక్‌లో తరచూ దాడులు చేపట్టే బలూచ్ గ్రూపుల్లో ద బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒకటి.
2018లో ఈ సంస్థకు చెందిన మిలిటెంట్లు కరాచీలోని చైనా కాన్సులేట్‌పై దాడి చేసి నలుగుర్ని హతమార్చారు. అయితే లోపలున్న సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు.
గత ఏడాది బలూచిస్తాన్‌లో గ్వాదర్ నగరంలో ఓ లగ్జరీ హోటల్‌ఫై బీఎల్ఏ దాడి చేసింది. మిలియన్ల డాలర్ల చైనా వాణిజ్యానికి ఈ హోటల్ కేంద్రమని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో చైనాతోపాటు ఇతర పెట్టుబడిదారులు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు.. చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ లభించడంలేదని వారు చెబుతున్నారు.
మొదట్లో బలూచ్ ప్రాంతానికి రాజకీయంగా స్వయం ప్రతిపత్తి కల్పించాలని బీఎల్ఏ డిమాండ్ చేసేది. క్రమంగా విధ్వంసకర దాడులతో వేర్పాటువాద సంస్థగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ రూపొందించిన పాక్ ఉగ్రవాద సంస్థల జాబితాలో దీని పేరు కూడా ఉంది.
ఈ ప్రావిన్స్‌లో పాక్ సైన్యం అణచివేతలకు సంబంధించి దశాబ్దాలుగా చాలా వార్తలు వచ్చాయి. ఇక్కడకు జర్నలిస్టులు, మానవ హక్కుల సంస్థల చేరుకోవడం దాదాపు అసాధ్యమే.
బలూచిస్తాన్‌లో జనాభా చాలా తక్కువ. బీఎల్ఏతోపాటు మరికొన్ని మిలిటెంట్ సంస్థలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. వీటికి సంబంధించి ఈశాన్య అఫ్గాన్‌లో స్థావరాలు కూడా ఉన్నాయి.
పాక్‌లోని పేదరికం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బలూచిస్తాన్ కూడా ఒకటి. ఇక్కడ గ్యాస్, బొగ్గుతోపాటు బంగారం, రాగి గనులు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడి వనరులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బలూచిస్తాన్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కున్న అతి పెద్ద సమస్యేంటి? బిన్‌లాడెన్ గురించి నోరు జారారా, కావాలనే మాట్లాడారా?
- ప్రత్యేక అధికారాలను రద్దు చేసిన పాక్ తీరుపై గిల్గిత్ బాల్టిస్తాన్ వాసులు ఏమంటున్నారు..
- అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- 'డాడీ, నాకు ఆక్సిజన్ తీసేశారు...నేను చచ్చిపోతున్నా అందరికీ బై బై...'
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)