న్యూజీలాండ్ మసీదుల్లో కాల్పుల కేసు: 51 మందిని హత్య చేసిన నేరం అంగీకరించిన బ్రెంటన్

ఫొటో సోర్స్, AFP
న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఏడాది క్రితం రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల కేసులో 29 ఏళ్ల ఆస్ట్రేలియా పౌరుడు బ్రెంటన్ టరెంట్ 51 మందిని హత్య చేసిన నేరాన్ని అంగీకరించాడు.
మరో 40 మందిపై హత్యాయత్నం, ఒక తీవ్రవాదం కేసును కూడా బ్రెంటన్ అంగీకరించాడు. అంతకు ముందు అతడు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. దాంతో కోర్టులో విచారణలు కొనసాగాయి.
రెండు మసీదులపై జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ దాడి తర్వాత న్యూజీలాండ్‌లో తుపాకీ వినియోగ చట్టాలను చాలా కఠినతరం చేశారు.
న్యూజీలాండ్‌లో కూడా కరోనావైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ విధించారు. దీంతో గురువారం క్రైస్ట్ చర్చ్ హైకోర్టులో జరిగిన విచారణకు ఆంక్షలు విధించారు.
ఈ విచారణలు జరుగుతున్న సమయంలో ప్రజలను అనుమతించలేదు. బ్రెంటన్, అతడి తరఫు న్యాయవాది కూడా వీడియో లింక్ ద్వారా విచారణలో పాల్గొన్నారు.
ఈ విచారణలో బాధిత కుటుంబాల తరఫున దాడి జరిగిన రెండు మసీదుల ప్రతినిధులు వాదనలు వినిపించారు.
“కరోనావైరస్ వల్ల చాలా ఆంక్షలు ఉన్నాయి. అందుకే బాధిత కుటుంబాలు కోర్టు గదిలో లేవు” అని జడ్జి మెండర్ అన్నారు. కోర్టు ఈ కేసులో ఇంకా శిక్ష విధించలేదు.
మసీదుపై జరిగిన దాడిలో ఫరీద్ అహ్మద్ భార్య హుస్నా అల్ తూర్ మృతిచెందారు. బ్రెంటన్ నేరాన్ని అంగీకరించిన తర్వాత “ఇక విచారణకు రావాల్సిన అవసరం లేకపోవడంతో ఇప్పుడు చాలా మందికి ఉపశమనం లభించింది. కానీ, అయినవారిని కోల్పోయినవారిలో విషాదం వారిలో ఇప్పటికీ ఉంది” అని ఫరీద్ టీవీఎన్‌జడ్‌తో అన్నారు.
“అతడు సరైన దిశలో వెళ్లాలని నేను ప్రార్థిస్తున్నా. తప్పు చేసినట్లు తనకు అనిపించడం సంతోషం. ఇది మంచి ప్రారంభం” అని కాల్పులు జరిపిన బ్రెంటన్ గురించి అన్నారు.

ఫొటో సోర్స్, getty images
ఈ దాడి ఎలా జరిగింది
2019 మార్చి 15న టెరంట్ క్రైస్ట్ చర్చ్ లోని అల్ నూర్ మసీదులో బ్రెంటన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అర నిమిషానికే మళ్లీ బయటికి వచ్చిన అతడు తన కార్లోని మరో తుపాకీ తీశాడు. మసీదు లోపలున్న వారిపై మళ్లీ కాల్పులు ప్రారంభించాడు.
తలకు పెట్టుకున్న హెడ్ క్యామ్ ద్వారా అతడు ఈ దాడిని ఫేస్‌బుక్ లైవ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత లేన్‌వడ్ మసీదుకు వెళ్లి కాల్పులు జరిపాడు. అక్కడ మసీదు బయటున్న ఇద్దరిని కాల్చిచంపి, తర్వాత కిటికీలోంచి కాల్పులు జరిపాడు. మసీదులోపల నుంచి బయటికొచ్చిన ఒక వ్యక్తి అతడిని వెంటాడాడు. తర్వాత పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేశారు.
ఈ దాడి వల్ల న్యూజీలాండ్ మూల స్వరూపమే మారిపోయిందని, మతోన్మాదాన్ని అడ్డుకోడానికి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని రెండు మసీదుల్లో ఈ కాల్పులు జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ అన్నారు.
“దాదాగిరి, వేధింపులు, జాత్యహంకారం, వివక్ష లాంటి వాటిని ఎలా అంతం చేయాలనేది మనకు సవాలు లాంటిది. మనం ప్రతిరోజూ దీనిని అంతం చేయడానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగిస్తాం. దానికి ప్రతి వ్యక్తీ తమవంతు పాత్ర పోషించాలి. అప్పుడే న్యూజీలాండ్ సమూలంగా మారుతుంది” అని జెసిండా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్ మసీదు కాల్పులు: దాడి చేసింది ‘ఒంటరి గన్‌మన్’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























