కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్: టీడీపీ నిజనిర్ధరణ కమిటీ పర్యటన ఉద్రిక్తం - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/kodalinani
గుడివాడలో కేసినో వ్యవహారంపై నిజ నిర్ధరణకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.
''నిజ నిర్ధరణ కోసం శుక్రవారం గుడివాడ వచ్చిన టీడీపీ నాయకులే లక్ష్యంగా దౌర్జన్యకాండకు మంత్రి కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకులు తెగబడ్డారు.
గుడివాడను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులు చేస్తూ.. రాళ్ల వర్షం కురిపించారు.
దాదాపు రెండు వేలమంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో కొన్నిగంటలపాటు అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి! నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి ఏకపక్షంగా, యథేచ్ఛగా కొన్నిగంటలపాటు సాగిన ఈ దాడిలో టీడీపీ నేత బొండా ఉమా కారు ధ్వంసం కాగా, ఓ టీడీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు.
కొవిడ్ రూల్స్ చెప్పి టీడీపీ నేతల కదలికలను పోలీసులు బాగా నియంత్రించారు. చివరకు అరెస్టు కూడా చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కే కన్వెన్షన్‌లో గుమిగూడిన వేలాదిమందిపైగానీ, దాడికి సిద్ధమై రోడ్లపైకి వచ్చిన వైసీపీ నేతలనుగానీ ఎక్కడా అడ్డుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..
సంక్రాంతి పండగ రోజుల్లో మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కే కన్వెన్షన్‌లో కేబిరే డ్యాన్సులు, కేసినో పేకాట క్లబ్బులు నడిచిన వ్యవహారం, దానికి సంబంధించి బయటపడిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
దీనిపై నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని టీడీపీ ఏర్పాటుచేసింది. కే కన్వెన్షన్ ప్రాంగణాన్ని సందర్శించడానికి శుక్రవారం ఈ బృందం గుడివాడ చేరుకుంది.
ఇదే సమయానికి కే కన్వెన్షన్ ప్రాంగణానికి వైసీపీ కార్యకర్తలు రెండువేల మంది చేరుకున్నారు. దీంతో గుడివాడలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
గుడివాడ ఘటనలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సారథ్యంలో దర్యాప్తు జరుపుతామని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు వెల్లడించారు.
ఆరుగురు సభ్యులతో కూడిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అనుమతించగా.. వందలాదిగా తరలిరావడం ఏమిటన్నారు.
రెండు పార్టీల పట్ల పోలీసులు సమానంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని సిద్ధార్థ కౌశల్ చెప్పినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

‘ఏపీలో 6 నుంచి ఉద్యోగుల సమ్మె’
వేతన సవరణ (పీఆర్సీ) విషయంలో ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించినట్లు 'ఈనాడు' ఒక వార్తలో తెలిపింది.
''పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్స్ సాధన సమితిగా ఏర్పడ్డాయి.
ఏపీ ఐకాస, ఐకాస అమరాతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి వేదికపైకి వచ్చాయి.
ఉద్యోగసంఘాలు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. మొదట ఉదయం ఎన్డీవో హోంలో ఐరాసలు సమావేశమై మద్యాహ్నం వరకు సమ్మె ఉద్యమ కార్యాచరణపై చర్చించాయి. మధ్యాహ్నం నుంచి సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాయి.
సమావేశం అనంతరం ఏపీ ఐకాస్, ఐకాస అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ సమీర్ శర్మను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
కొత్త జీతాల బిల్లులు చేయాలని డిడిఓలపై ఒత్తిడి చేయొద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ఉత్తర్వులు, ఆపాలని విన్నవించారు. సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సమయం కోరారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించడానికి 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు'' ఈనాడు వార్తలో తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఔను.. నేనే ఇచ్చా: మస్తాన్‌వలీ
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) కాజేసేందుకు జరిగిన కుట్రలో తానూ పాత్రధారినే అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ నేరం అంగీకరించినట్లు 'సాక్షి' పేర్కొంది.
''తెలుగు అకాడమీ కేసులో జైల్లో ఉన్న అతడిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలోనే తన నేరం అంగీకరించడంతోపాటు వెంకటరమణ పేరు బయటపెట్టాడు.
ఎఫ్‌డీ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్న సాయికుమార్‌కు ప్రధాన అనుచరుడైన వెంకటరమణే గిడ్డంగుల సంస్థకు, కార్వాన్ యూనియన్ బ్యాంక్ శాఖకు మధ్య దళారిగా వ్యవహరించాడు.
ఆ సంస్థ నుంచి రూ.3.98 కోట్ల చెక్కులు తీసుకెళ్లి మస్తాన్ వలీకి ఇచ్చాడు. అతడిచ్చిన అసలు బాండ్లను తీసుకెళ్లిన రమణ, వాటి స్థానంలో నకిలీవాటిని గిడ్డంగుల సంస్థకు అప్పగించాడు.
తెలుగు అకాడమీసహా ఇతర స్కాముల మాదిరిగా సాయికుమార్ నేతృత్వంలోనే ఈ స్కామ్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని అధికారికంగా నిర్ధారించడానికి వెంకటరమణను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు.
ఈ కేసులోనూ చెన్నైకి చెందిన పద్మనాభన్ ఈ నకిలీ బాండ్లు సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ష్యూరిటీల తంతు పూర్తికాకపోవడంతో వెంకటరమణ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే ఇతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారి, ఏసీపీ మనోజ్‌కుమార్ నిర్ణయించారు. మస్తాన్ వలీని విచారిస్తే ఈ కుట్రలో సాయి సహా ఇతరుల పాత్ర బయటకు వస్తుందని భావిస్తుస్తున్నట్లు'' సాక్షి రాసుకొచ్చింది

ఫొటో సోర్స్, Ntnews.com
న్యాక్‌కు అసోచాం అవార్డు
హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్)కు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అసోచాం అవార్డు లభించినట్లు 'నమస్తే తెలంగాణ' తెలిపింది.
''శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిచినందుకు అవార్డును అందజేస్తున్నట్టు ఆసోచాం (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) తెలిపింది.
శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన సదస్సులో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బేయిస్, ఆ రాష్ట్ర స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమక్షంలో అవార్డును అందజేశారు.
కరోనా కాలంలోనూ 9,466 మందికి శిక్షణ ఇచ్చి 8,973 మందికి (84%) ప్లేస్‌మెంట్స్ ఇవ్వటం అసాధారణ అంశమని అసోచాం ప్రశంసించింది.
గత మూడేండ్లలో 41,200 శిక్షణ తరగతులు నిర్వహించినట్టు న్యాక్ డైరెక్టర్ కే భిక్షపతి పేర్కొన్నారు. అవార్డు రావడం పట్ల న్యాక్ వైస్ చైర్మన్, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారని'' నమస్తే తెలంగాణ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఏడు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ టోనీని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- దిల్లీ పీఠానికి దారి ఉత్తర్‌ప్రదేశ్ మీదుగానే ఎందుకు వెళ్తుంది?
- ‘మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























