వైసీపీ కార్యకర్తపై ఏపీ మంత్రి బాలినేని అనుచరుల దాడి, లేదు దాడిని ఆపానన్న మంత్రి: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, UGC/Viral video
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించిందని, కానీ మంత్రి తాను ఆపించానని చెప్పారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.... మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయని పత్రిక రాసింది.
ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
గుంటూరులో బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40 గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు.
సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారని ఈనాడు పత్రిక రాసింది.
తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.
'అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా..నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్...' అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు.
తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. 'చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం' అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు.
సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు.
సుబ్బారావు గుప్తా విలేకర్లతో మాట్లాడుతూ.. ఒంగోలులో తన నివాసంపై జరిగిన దాడితో ఆందోళనకు గురై గుంటూరులోని పద్మశ్రీ లాడ్జిలో తలదాచుకున్నానని చెప్పారని పత్రిక రాసింది..
ఒక పోలీసు వాహనంతో పాటు మరో వాహనంలో వచ్చిన సుభానీ, అతని బృందం దాడి చేశారన్నారు. తనకు మతిస్థిమితం లేదని భార్య చెప్పినట్లు.. మంత్రి బాలినేని అంటున్నారని, అది సరికాదన్నారు.
సుబ్బారావు గుప్తా నివాసంపై దాడి, గుంటూరులోని లాడ్జిలో అతనిని కొట్టిన సంఘటనలపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదైంది.
కానీ, "సుబ్బారావు గుప్తాను నా అనుచరులు కొట్టలేదు. పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధపడి దాడి చేసేందుకు వెళ్లారు. ఇది తెలిసి వారికి ఫోన్ చేసి ఆపించాను..." అని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
బూస్టర్ డోసుగా భారత్ బయోటెక్ నాజిల్ టీకా
భారత్ బయోటెక్ సంస్థ తాను తయారుచేస్తున్న ముక్కు టీకాను (ఇంట్రా నేజల్ టీకా) బూస్టర్ డోసుగా ఇవ్వడానికి సంబంధించి ఫేజ్-3 ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి కోరిందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త ప్రచురించింది.
ట్రయల్స్‌లో ఈ టీకా సురక్షితమని తేలితే.. ఇప్పటికే కొవ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారికి బూస్టర్ డోసుగా ముక్కు టీకా ఇస్తారు.
భారత్ బయోటెక్ ఇప్పటికే ఈ రెండు టీకాలతో ఫేజ్-2 ట్రయల్స్ నిర్వహించింది. కాగా.. 9నెలలుగా ఉన్న కొవ్యాక్సిన్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను ఏడాదికి పెంచుతూ 'కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతిచ్చింది.
తమ టీకాకు '28 రోజుల మల్టీ డోస్ వయల్ పాలసీ' అనుమతి కూడా ఉందని భారత్ బయోటెక్ వివరించింది. అంటే.. 20 డోసులు ఉండే వయల్‌ను ఒకసారి తెరిస్తే 20 మందికి ఇవ్వొచ్చు.
ఒకవేళ మిగిలిపోతే.. దాన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేసి.. తర్వాతి రోజు ఇవ్వొచ్చు. ఇలా 28 రోజులపాటు నిల్వ చేయొచ్చు అని ఆంధ్రజ్యోతి వివరించింది.

పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల రిజిస్ట్రేషన్
పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు.
నిజానికి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు పేదల ఇళ్లకు కేవలం 'నివసించే హక్కులు' మాత్రమే ఇచ్చాయని పత్రిక చెప్పింది.
ఆ ఇంటి విలువ రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఉన్నప్పటికీ ఇల్లు, ఇంటి స్థలాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదు. అంతేకాదు.. ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్థితి కూడా.
ఈ నేపథ్యంలో.. కేవలం నామమాత్రపు రుసుముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల రుణాలు, వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తూ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించారని వివరించింది.

ఎంత ధాన్యం కొంటుందో చెప్పండి- నిరంజన్ రెడ్డి
వానకాలంలో మొత్తం ధాన్యాన్ని కొనటంతో పాటు, రాబోయే యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొంటుందో, లేదో చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్‌సభా పక్ష నేత నామానాగేశ్వర్‌రావు, ఇతర ఎంపీలతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
'కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే తెలంగాణకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. మొత్తం బియ్యం కొంటామని కేంద్రమంత్రి నోటి మాటతో చెప్పారు సరే, తర్వాత కొనబోం అని చేతులెత్తేస్తే మా పరిస్థితేంటి? అందుకే లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. రైతుల ప్రయోజనాల కోసమే మేం ఢిల్లీకి వచ్చాం. రాజకీయం చేయటానికి కాదు. కేంద్రమంత్రి తక్షణమే మాకు సమయం ఇవ్వాలి. మా రైతుల గోడు వినాలి. మమ్మల్ని నిరీక్షించేలా చేయటం అంటే తెలంగాణ రైతులను అవమానించినట్టే. ఆయన టైం ఇచ్చేవరకు వేచిచూస్తాం' అని నిరంజన్ రెడ్డి అన్నారని పత్రిక రాసింది.
వానకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇచ్చిందని, ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నదని వెల్లడించారు. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు కొనసాగుతాయని వివరించారు.
40 లక్షల టన్నుల బియ్యం/60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రంతో రాష్ర్టానికి ఎంవోయూ కుదిరిందని, దాన్ని పెంచాలని గతంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని ఆయన గుర్తు చేశారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- తనలాంటి మరో వ్యక్తిని చంపేసి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. చివరికి పోలీసులకు దొరికిపోయారు
- వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్‌నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్‌తో భోజనం పెట్టారు’
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























