బిగ్‌బాస్ సీజన్‌-5 విజేత వీజే సన్నీ: ప్రెస్ రివ్యూ

బిగ్ బాస్ విజేత సన్నీకి ట్రోఫీ అందిస్తున్న నాగార్జున Biggboss 5 Telugu winner

ఫొటో సోర్స్, FB/STAR MAA

ఫొటో క్యాప్షన్, బిగ్ బాస్ విజేత వీజే సన్నీకి ట్రోఫీ అందిస్తున్న నాగార్జున
ప్రచురణ

వీజే సన్నీ బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌గా నిలిచారని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

తనే విన్నర్‌ అని చెప్పగానే సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నారు. ఇక తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది.

ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని ఆయన తల్లి భావోద్వేగానికి లోనైంది. ఇక యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడని పత్రిక చెప్పింది.

తనకున్న భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయారు. దీంతో రన్నరప్‌ స్థానంతో సరిపెట్టుకున్నారు.

విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్‌ ట్రోఫీని బహుకరించారు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశారని సాక్షి రాసింది.

దీనితో పాటు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్‌ సన్నీ సొంతం చేసుకున్నట్లు, ఒక బైక్‌ కూడా గెలుచుకున్నాడని నాగార్జున ప్రకటించారు.

ఈ సందర్భంగా తనను గెలిపించిన ఆడియన్స్‌ను ఎప్పటికీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉంటానని సన్నీ మాటిచ్చారు. అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్‌ ట్రోఫీ అంటూ దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందారు.

నువ్వు చాలామంది మనసులు గెలుచుకున్నావ్‌ షణ్నూ అంటూ సన్నీ ఆయనపై పొగడ్తలు కురిపించారని సాక్షి వివరించింది.

తెలంగాణలో దేశంలో తొలి గే మారేజ్

ఫొటో సోర్స్, FB/Supriyo Chakrabortysahni studio

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో దేశంలో తొలి గే మారేజ్

తెలంగాణలో స్వలింగ సంపర్క వివాహం

తెలంగాణలో స్వలింగ సంపర్కుల వివాహం జరిగిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రెండు మనసులు కలిస్తే ప్రేమ. అది నమ్మకంతో కొనసాగితే పెండ్లి. దీనికి జెండర్‌తో పనేముందని అనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు.

ప్రేమించుకొని శనివారం రెండు కుటుంబాల సభ్యులు, బంధువుల సమక్షంలో ఒక్కటయ్యారు.

ఈ గే పెండ్లికి వికారాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ రిసార్ట్‌ వేదికైంది.

ఎనిమిది ఏండ్ల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో సుప్రియో చక్రవర్తి, అభయ్‌ డాంగ్‌ ఒకరికొకరు పరిచయం అయ్యారు.

సుప్రియో హైదరాబాద్‌లోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా, అభయ్‌ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

ఒకరి భావాలు ఒకరు తెలుసుకొని ప్రేమికులుగా మారారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు చెప్పారు.

వారి అంగీకారంతో, రెండు కుటుంబాల సమక్షంలో ట్రాన్స్‌జెండర్‌ సోఫియా డేవిడ్‌ వీరి వివాహాన్ని జరిపించారు.

స్వలింగ సంపర్కుల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ స్నానాలు, సంగీత్‌ కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్లంతా వీరిని ఆశీర్వదించారని పత్రిక వివరించింది.

రైల్వే తరహాలో సినిమా టికెట్ల రిజర్వేషన్

ఫొటో సోర్స్, Getty Images

రైల్వే తరహాలో సినిమా టికెట్ల రిజర్వేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెట్లు విక్రయించే ప్లాట్‌ఫామ్‌ నిర్వహణ బాధ్యతల్ని ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కి అప్పగించిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

తాము ఎప్పటికప్పుడు నిర్దేశించే నిబంధనలు, షరతులకు అనుగుణంగా దీన్ని నిర్వహించాలని సూచించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఈ నెల 17న జారీ చేసిన ఉత్తర్వులు ఆదివారం వెలుగుచూశాయి.

''సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధివిధానాల రూపకల్పనకు తొలుత ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీని నోడల్‌ ఏజెన్సీగా నియమించాం. ఆ తర్వాత రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ తరహాలో ప్రభుత్వ సంస్థ ద్వారా బుకింగ్‌కు వీలు కల్పించే పోర్టల్‌ అభివృద్ధికి ఓ కమిటీని నియమించాం. ఈ వ్యవస్థ అవసరంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించాం. 15న చట్టం తీసుకొచ్చాం. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ టికెట్లు విక్రయించే ప్లాట్‌ఫామ్‌ నిర్వహణ బాధ్యతల్ని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీకి అప్పగించాం'' అని ఆ ఉత్తర్వుల్లో వివరించారని ఈనాడు వివరించింది.

ఒమిక్రాన్

ఫొటో సోర్స్, Getty Images

మూడో యుద్ధానికి సిద్ధం కండి

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఈ మేరకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బందిని కూడా సంసిద్ధం చేస్తోంది. ఇప్పటికే వారి సెలవులను రద్దు చేసింది.

సెలవులపై వెళ్లిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోధనాస్పత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చారు.

ఒకవేళ ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరిగితే.. కొద్ది రోజుల తర్వాత నమోదయ్యే ప్రతి కేసు ఆ వేరియంట్‌దేనని పరిగణించాల్సి ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ఈ వేరియంట్‌ స్వభావం రీత్యా సంక్రాంతి తర్వాత కేసులు పెరుగుతాయని వైద్య శాఖ అంచనా వేస్తోంది. కాగా సర్కారీ దవాఖానల్లో ఎంతమంది పల్మనాలజిస్టులు, జనరల్‌ ఫిజిషీయన్లు ఉన్నారో వివరాలు ఇవ్వాలని వైద్య శాఖ అన్ని ఆస్పత్రులను కోరింది.

ప్రధానంగా బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఈ వైద్యులు తప్పకుండా ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఉన్నచోట.. మొదటి, రెండో వేవ్‌ తరహాలోనే తాత్కాలిక పద్ధతిలో భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ఆలోచిస్తోందని ఆంధ్రజ్యోతి చెప్పింది.

క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఉండడంతో రానున్న నెల రోజులు కీలకంగా మారనున్నాయి. పండుగల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఒమైక్రాన్‌ వ్యాప్తిని బట్టి.. జనవరి రెండో వారం నుంచి కేసులు రావొచ్చని వైద్య వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సర్కారీ దవాఖానల్లో ఇన్‌పేషెంట్లు 15 వేలు మించితే ఇబ్బందిగా మారుతుందని పేర్కొంటున్నాయి.

ఇప్పటికే 112 ప్రభుత్వ, 1,215 ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొవిడ్‌ రోగుల చికిత్సకు అనుమతులున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిలో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇక సర్కారీ దవాఖానల్లో 15,009 సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లను సిద్ధం చేయగా, ప్రైవేట్‌లో మరో 39,236 పడకలను అత్యవసరం కింద అందుబాటులో ఉంచారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)