ఆంధ్రప్రదేశ్: ‘సచ్చిపోయారా, బతికారా అని చూసేదానికి వచ్చారా?’.. మంత్రి, ఎమ్మెల్యేపై వరద బాధితుల ఆగ్రహం

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
పెన్నా నది వరద ప్రవాహంతో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తమకు సకాలంలో సహాయం అందలేదంటూ నెల్లూరులో వరద బాధితులు ఆందోళనకు దిగారు.
కోవూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా బతుకులు మేం బతుకుతున్నాం కదా. ఇప్పుడెందుకు వచ్చారు? వెళ్లిపోండయ్యా. సచ్చిపోయారా, బతికారా అని చూసేదానికి వచ్చారా? అందరూ సచ్చిపోయినాక రండి.. ఎందుకు ఇప్పుడు రావడం.. (వరద వచ్చినప్పుడు) ఒక్కోడు ఇంటిమీద కూర్చుని అర్చుకుంటా ఉన్నారు. ఇంకెప్పుడూ ఓటేయకూడదు’ అంటూ విమర్శలు చేశారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్.. మంత్రి డౌన్ డౌన్’ అని నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు. దాంతో నేతలు అక్కడి నుంచి వెళ్లారు.

ఈనెల 19వ తేదీ నుంచి నెల్లూరులోని పలు కాలనీలు వరద బారిన పడ్డాయి.
కోవూరు నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులకు సహాయం అందించేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
తాము వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న సమయంలో ముందస్తు హెచ్చరికలు గానీ, వరద సహాయం అందించేందుకు గానీ అధికారులు ప్రయత్నించలేదని బాధితులు విమర్శిస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం వరద సహాయంలో భాగంగా ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం, బంగాళాదుంపలు, పప్పులు అందించాలని ఆదేశించింది.
కుటుంబానికి రూ. 2వేలు చొప్పున తక్షణ సహాయం అందించేందుకు నిధులు విడుదల చేసింది.
అయితే పరిహారం పంపిణీలో జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. వరదల తాకిడి గురించి ముందుగా హెచ్చరించి, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆయన విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా బాధితులకు తక్షణ సహాయం కూడా అందడం లేదని విమర్శించారు.
‘అందరికీ సహాయం అందిస్తున్నాం’ - మంత్రి బాలినేని
అయితే పంట నష్టం అంచనాలు పూర్తవుతున్నాయని, తక్షణ సహాయం పంపిణీ జరుగుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు బీబీసీకి తెలిపారు.
అంతకుముందు మంత్రి బాలినేని, ఎమ్మెల్యే, కలెక్టర్ వరద బాధితులకు ప్రభుత్వ సహాయం అందించారు. కోవూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో బాధితులకు బియ్యం, నగదు పంపిణీ చేశారు.
"పదిరోజులుగా వర్షాలు, వరదల కారణంగా అపారనష్టం సంభవించింది. కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అందరికీ సహాయ అందిస్తున్నాం. రూ. 2వేల నగదు, బియ్యం సహా ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. కేవలం పునావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా అందరికీ సహాయం అందిస్తున్నాం. ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. టీడీపీ నేతలు కొందరు ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో ఉన్నారు" అని మంత్రి బాలినేని ఈ సందర్భంగా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































