'చీఫ్ సెక్రటరీగా పనిచేసినవారికే పింఛన్లు పడడం లేదు.. పదో తేదీ వచ్చినా జీతాలకు ఎదురుచూపులే' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FACEBOOK/BUGGANA RAJENDRANATH REDDY
జులై 10వ తేదీ వచ్చేసినా రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పింఛన్లు ఇంకా పడలేదని 'ఈనాడు' కథనం రాసింది.
''ఇంకా ఎంత మందికి జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉందో ఆర్థిక శాఖ అధికారులు ఇతమిత్థంగా చెప్పడం లేదు. జీతాలు అందని ఉద్యోగులు 20 శాతం, పింఛను రానివారు 20 శాతం వరకు ఉంటారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలియడం లేదని, అధికారులెవరూ సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 4.70 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.20 లక్షల మంది ఉపాధ్యాయులు, మరో 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.
వీరికి గతంలో జీతాలు, పింఛన్ల చెల్లింపులో జాప్యం జరిగిన దాఖలాలు చాలా తక్కువ. అందరి ఖాతాల్లో ఒకటో తారీఖునే పడేవి. ఆ రోజు ఆదివారమో, మరైదేనా సెలవు దినమో వస్తే ఆ మర్నాడు వేసేసేవారు.
ఇప్పుడు ఏకంగా పదో తారీఖు వచ్చినా అందరికీ వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరైన ఒక మాజీ అధికారి ఖాతాలో శుక్రవారం సాయంత్రానికి కూడా పెన్షన్ డబ్బు జమ కాలేదు.
అదే విషయాన్ని హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో నివసించే ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన విశ్రాంత అధికారుల వాట్సప్ గ్రూప్‌లో ఉంచారు.
అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తనకు పెన్షన్ మొత్తం జమ అయిందని ఆయన వెల్లడించారు'' అని ఆ కథనంలో రాశారు.
''పెండింగులో ఉన్న జీతాలు, పింఛన్లు రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/revanthreddy
కేటీఆర్ అసలు పేరు అజయ్.. ఎన్టీఆర్‌ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ అలా మార్చారన్న రేవంత్
తెలంగాణ కాంగ్రెస్.. టీడీపీగా మారిందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుండడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''వాస్తవానికి టీఆర్‌ఎస్సే.. టీడీపీ అని, కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు తెలుగుదేశం వాళ్లే ఉన్నారని రేవంత్ అన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి టీడీపీనే దిక్కయిందని, గతిలేక ఎల్.రమణ కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
తాను చంద్రబాబు మనిషినైతే.. కేసీఆర్ ఆయనకు చెప్రాసీ అని అన్నారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
కేటీఆర్ పేరు కల్వకుంట్ల రామారావు కాదని, కల్వకుంట్ల డ్రామారావు అని అన్నారు. తన పేరును మరో విధంగా మార్చుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తనపై విమర్శలు చేయటానికి బావ, బావమరిది పోటీ పడుతున్నారుని చెప్పారు.
కేటీఆర్ అసలు పేరు అజయ్ అని, ఆనాడు ఎన్టీఆర్‌కు భ్రమ కల్పించేందుకు తారక రామారావుగా కేసీఆర్ మార్చారని తెలిపారు.
కేటీఆర్‌ది మిడిమిడి జ్ఞానమని, హోటల్లో వెయిటర్ కూడా ఇంగ్లిష్ మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. ''కేసీఆర్, కేటీఆర్‌ల బతుకు టీడీపీ అయితే.. హరీశ్‌రావు బతుకు కాంగ్రెస్. కేటీఆర్ పేరే బిచ్చమెత్తుకుని పెట్టుకున్నరు.
మీ దగ్గర టీడీపీ కాకుండా ఉన్నదెవరో చెప్పాలి. చంద్రబాబుకు ఊడిగం చేశాకే కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని పెట్టాడు. హుజూరాబాద్ ఎన్నిక కోసం టీడీపీ నుంచి ఎల్.రమణను చేర్చుకుంటున్నారు'' అని రేవంత్ ధ్వజమెత్తార''న ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Sakshi
అంత లంచం ఇచ్చుకోలేనయ్యా
తమ పేరుపై ఉన్న పట్టాభూమిని సర్వే చేసి రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్ ఏకంగా రూ.60 వేలు డిమాండ్ చేయడంతో, మనస్తాపంతో ఓ తెలంగాణ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగారని 'సాక్షి' కథనం తెలిపింది.
''ఈ ఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో చోటు చేసుకుంది. మద్దెలబండ గ్రామానికి చెందిన బుడ్డ వీరన్న, నర్సింహులు, భీమేష్‌లు అన్నదమ్ములు.
వీరికి గ్రామ శివారులో సర్వే నంబర్ 64లో 3.16 ఎకరాల పొలం ఉంది. 2015లో ఉపాధి నిమిత్తం ముగ్గురూ వలస వెళ్లి.. తిరిగి 2018లో స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే వీరి పొలంలో 1.10 ఎకరాలను రాములు నాయక్ ఆక్రమించుకున్నాడు.
దీనిపై జిల్లా రెవెన్యూ, పోలీసులకు సదరు రైతులు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్ర యించగా.. వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారుల ను వేడుకోగా, సర్వే చేసి రిపోర్టు అందజేస్తే, న్యా యంచేస్తామని చెప్పారని ఆ రైతులు తెలిపారు.
రూ. 60 వేలు ఇస్తేనే..: కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఉన్న తన భూమిని సర్వే చేసి, రిపోర్టు ఇవ్వా లని సర్వేయర్ బ్రహ్మయ్యను వారు సంప్రదించా రు. భూ ఆక్రమణదారుడు తనకు రూ.50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, మీరు రూ.60 వేలు ఇస్తే రిపోర్టు అనుకూలంగా ఇస్తానని సర్వేయర్ చెప్పినట్లు బాధితులు తెలిపారు.
అంత డబ్బు ఇవ్వలేమని బతిమాలుకున్నా సర్వేయర్ కనికరించలే దన్నారు. దీంతో మనస్తాపం చెందిన బుడ్డ వీరన్న శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది, రైతులు వెంటనే ఆయనను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు.
ఈ విషయంపై మల్దకల్ తహసీల్దార్ మీర్ అజాం అలీని వివరణ కోరగా, బుడ్డ వీరన్న పేరున పట్టా భూమి ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు.
కోర్టులో విచారణ కొనసాగుతున్నట్లు తెలిసిందని, అందుకే రైతుకు న్యాయం చేయలేకపోయామని చెప్పార''ని ఆ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- రేవంత్ రెడ్డి అరెస్ట్: డ్రోన్లతో ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించారనే కేసులో 14 రోజుల రిమాండ్
- ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























