తిరుమల శ్రీవారికి శుభలేఖ పంపితే, టీటీడీ నుంచి బహుమతి: ప్రెస్ రివ్యూ

తిరుమల

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, తిరుమల
ప్రచురణ

తిరుమల శ్రీవారి సన్నిధికి ఎవరైనా తమ పెళ్లి శుభలేక పంపితే, వారికి టీటీడీ నుంచి బహుమతి అందుతుందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు.

తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోందని పత్రిక రాసింది.

మొదటి శుభలేఖ పంపవచ్చు..

ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది.

దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారని సాక్షి చెప్పింది.

తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం 'శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి' చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయవచ్చు.

కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోందని సాక్షి వివరించింది.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

మా నీటి హక్కులను కాపాడండి: ప్రధానికి ఏపీ సీఎం లేఖ

తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మించడంపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణ ఎలాంటి అనుమతులూ లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేంద్ర జల్‌శక్తిశాఖ, కృష్ణా బోర్డు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.

తెలంగాణ వైఖరితో ఏపీ తన నీటి హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. జోక్యం చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.

కేంద్ర జల్‌శక్తిశాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బుధవారం ప్రధానికి మరో లేఖ రాశారు.  

లేఖలో ముఖ్యాంశాలివీ..

తెలంగాణ ప్రభుత్వం జీవో 34 తీసుకువచ్చి అన్ని జలాశయాల్లో పూర్తి స్థాయి జల విద్యుత్తు ఉత్పత్తికి ఆదేశించింది. శ్రీశైలం జలాశయంలోకి 26 టీఎంసీలు వస్తే 19 టీఎంసీలతో విద్యుత్తు ఉత్పత్తి చేసింది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే కనీస నీటి విడుదల మట్టం +834 స్థాయి కన్నా దిగువ (796 అడుగుల) నుంచే రోజుకు 4 టీఎంసీలను వినియోగిస్తూ జల విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది.

సాగుకు నీరు కావాలని ఏపీ అధికారులు అడగకుండానే సాగర్‌, పులిచింతలలోనూ తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. దీనివల్ల సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్న నీటిని తెలంగాణ వాటా 299 టీఎంసీల నుంచే మినహాయించాలి.

ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధమైన నీటి వాటాలు దక్కకుండా ఉండేందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తే శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్‌ కోసం చుక్కనీరూ మిగలదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ, గాలేరు- నగరి, కేసీ కాలువలకు నీటిని సరఫరా చేయడంతో పాటు చెన్నై తాగునీటి అవసరాలను తీర్చేందుకు మాకు రాయలసీమ ఎత్తిపోతల ఏర్పాటే ఏకైక మార్గం. ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులున్నాయి.బచావత్‌ కేటాయింపులూ ఉన్నాయి. విభజన చట్టంలో 11వ షెడ్యూలులోనూ ఈ ప్రాజెక్టుల జాబితాను ప్రస్తావించారని ఈనాడు వివరించింది.

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు బంద్

ఫొటో సోర్స్, ts.meeseva

తెలంగాణ ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు బంద్

తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోనున్నాయని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణ ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు మూడురోజుల పాటు నిలిచిపోనున్నాయి. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా పనిచేయవు.

ఈనెల 9 నుంచి 11 వరకు ఈ సేవలు బంద్‌ కానున్నాయి. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలకు కేంద్ర బిందువైన స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) లో కొత్త యూపీఎస్‌ సిస్టంను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేస్తున్నామని ఐటీ శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం గచ్చిబౌలిలోని టీఎ్‌సఐఐసీ సెంటర్‌లో ఎస్‌డీసీ ఉంది. 2010లో ఏర్పాటు చేయబడిన ఈ ఎస్‌డీసీ.. 2011 నుంచి పనిచేస్తోంది.

ఎస్‌డీసీకే ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ అప్లికేషన్లు అనుసంధానమై ఉన్నాయి.

ఎస్‌డీసీలో చాలా కాలంగా పాత యూపీఎస్‌ ఉన్నందున పవర్‌ బ్యాక్‌పలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఐటీ సేవలకు అంతరాయం కలుగుతోంది.

ఈ నేపథ్యంలో దాని స్థానంలో కొత్త యూపీఎ్‌సను ఏర్పాటు చేయాలని (అప్‌గ్రెడేషన్‌) ఐటీ శాఖ నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఆర్టీసీ డ్రైవర్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఆర్టీసీ బస్సులో డ్రైవర్ నిద్రపోతే లేపే అలారం

నిద్రమత్తుతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ల నిద్రమత్తుతో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

బస్సులో డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారాడా? అలసటతో కాస్త ఎక్కువసేపు కండ్లు మూశాడా? అయితే ఇంకేముందు 'కుయ్‌కుయ్‌'మంటూ అలారం మోగుతుంది.

క్షణాల్లో డ్రైవర్లను అప్రమత్తం చేస్తుందీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డివైజ్‌.

దూర ప్రయాణాలు చేసే బస్సు ప్రమాదాల నివారణపై టీఎస్‌ఆర్టీసీ దృష్టిపెట్టింది.

ఇందుకోసం ఏఐ డివైజ్‌ను వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

స్టీరింగ్‌కు ఏర్పాటుచేసే ఈ పరికరం డ్రైవర్‌ కదలికలపై 'కన్నే'సి ఉంచుతుంది. నిద్రమత్తులోకి జారినా, అలసటతో ఎక్కువసేపు కన్నుమూసినా వెంటనే అప్రమత్తం చేస్తుంది.

ఈ ఆర్టిఫిషియల్‌ డివైజ్‌ను రూపొందించిన మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ).. దీని తయారీ, పనితీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించారని పత్రిక చెప్పింది.

రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సహా పలు రాష్ర్టాలకు టీఎస్‌ఆర్టీసీ నిత్యం బస్సులను నడుపుతున్నది.

ఈ బస్సులు ప్రమాదాలకు గురైన సందర్భాల్లో కారణాలను విశ్లేషిస్తే చాలావరకు డ్రైవర్‌ నిద్రమత్తు, అలసటగా తేలుతున్నది. ఎంసీఈఎంఈ రూపొందించిన డివైజ్‌ ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. నెలపాటు పరీక్షించిన తర్వాత ఫలితాలను బట్టి మిగిలిన వాటిలోనూ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)