WTC21 Final : టీమిండియా ప్లేయింగ్ లెవెన్‌ను ఖరారు చేసిన బీసీసీఐ- Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత జట్టులోని తుది 11 మంది సభ్యుల పేర్లను బీసీసీఐ ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్‌లో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడబోతున్నాయి.

భారత్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చేతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌) లు ఫైనల్ లెవెన్ లో చోటు దక్కించుకున్నారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు ముందు క్రికెట్ జట్టు అంతా కలిపి తీసుకున్న చిత్రాన్ని బీసీసీఐ ట్వీట్ చేసి, ఆ చిత్రం ఎలా ఉందో కామెంట్లు పెట్టమని నెటిజన్లను కోరింది.

జూన్ 18 నుంచి 23 వరకు జరిగే ఈ టెస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల (సుమారు 11.72 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ దక్కుతుంది.

దిల్లీ అల్లర్ల కేసు: బెయిల్ పై నటాషా, దేవాంగన, ఇక్బాల్‌ల విడుదల

విద్యార్ధి నాయకులు నటాషా నార్వాల్, దేవాంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్‌ తన్హాలను వెంటనే విడుదల చేయాలని పోలీసులను దిల్లీలో కర్‌కార్‌డుమా కోర్టు ఆదేశించింది.

దీంతో ఈ సాయంత్రం నటాషా నార్వాల్, దేవాంగన కాలిత, ఇక్బాల్ లు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాము నమ్మిన సిద్ధాంతాలతో తమ పోరాటం కొనసాగుతుందని, ఈ కేసులో న్యాయపోరాటం కొనసాగిస్తాని విడుదల అనంతరం నటాషా నార్వాల్ వ్యాఖ్యానించినట్లు ఎన్ఎన్ఐ పేర్కొంది.

ఈ ముగ్గురిని గత ఏడాది మే లో అరెస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో వీళ్లు పాల్గొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులలో పోలీసులు వీరి మీద యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నటాషా నార్వాల్, దేవాంగన కలితా పింజ్రా తోడ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు కాగా, ఇక్బాల్, ఆసిఫ్‌లు జామియా యూనివర్సిటీ విద్యార్ధులు.

ఈ ముగ్గురికి దిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసినా, వీరిని జైలులోనే ఉంచారు. నిందితుల శాశ్వత చిరునామాను ధృవీకరించుకునేందుకు సమయం పడుతుందని, విడుదలకు మూడు రోజుల సమయం కావాలని దిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కర్‌కార్‌డుమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి రవీందర్ బేడి తిరస్కరించారు.

''బెయిల్ వచ్చిన తర్వాత కూడా నిందితులను జైల్లోనే ఉంచాలని అనడం సరైన వాదన కాదు'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మరోవైపు, బెయిల్ వచ్చినా తమను విడుదల చేయకపోవడంపై ముగ్గురు నిందితులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ వచ్చినా తమను విడుదల చేయకపోవడం చట్ట ఉల్లంఘన అని వారు కోర్టులో వాదించారు.

అయితే, తాము దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ట్రయల్ కోర్టు వాటిని అమలు చేయాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు, ఈ ముగ్గురికి జూన్ 15న బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని దిల్లీ పోలీసులు సుప్రీం కోర్టులో ఇప్పటికే సవాలు చేశారు.

దిల్లీ అల్లర్లకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్సెస్ అహ్మద్ షా వతాలీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు అర్ధం చేసుకోలేకపోయిందని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

CBSE 12th Result: 12వ తరగతిలో మార్కులు ఎలా ఇస్తారో సుప్రీంకోర్టుకు చెప్పిన సీబీఎస్‌ఈ

విద్యార్థుల 10, 11, 12వ తరగతుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా 12వ తరగతి మార్కులు జారీ చేయనున్నట్లు సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు చెప్పింది.

ఫలితాల్లో 10వ తరగతిలో వచ్చిన మార్కుల్లో 30, 11వ తరగతికి 30, 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇస్తామని చెప్పింది.

12వ తరగతి ఫలితాలు జులై 31న విడుదల చేస్తామని సీబీఎస్ఈ 12 మంది సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు చెప్పింది.

12వ తరగతి విద్యార్థులకు ఎలా మూల్యాంకనం చేస్తామో సీబీఎస్ఈ సుప్రీంకోర్ట్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ మహేశ్వరి వెకేషన్ బెంచ్‌కి సమాచారం ఇచ్చింది.

10, 11వ తరగతి పరీక్షల్లో ఏ మూడు సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చాయో, వాటి ఆధారంగా ఈ మార్కులు ఉంటాయని చెప్పింది.

మరోవైపు 12వ తరగతి యూనిట్, టర్మ్, ప్రాక్టికల్ పరీక్షల మార్కులు కూడా వీటికి జోడిస్తామని చెప్పింది. ఈ రెండింటి ఆధారంగానే 12వ తరగతి విద్యార్థులు మార్కులు పొందుతారని చెప్పింది.

వివిధ స్కూళ్లలోని మూల్యాంకన వ్యవస్థలో ఉన్నతేడాల్లో సమానత్వం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏజీ కేకే వేణుగోపాలన్ సుప్రీంకోర్టుకు చెప్పారు.

ప్రతి స్కూల్లో ఒక రిజల్ట్ కమిటీ ఏర్పాటు చేయాల్సుంటుందని, అది 12వ తరగతి మూల్యాంకనంలో తమ సాయం అందిస్తుందని చెప్పారు.

ఏ విద్యార్థి అయినా ఈ మూల్యాంకన ప్రక్రియలో ఫెయిల్ అయితే వారిని 'ఎసెన్షియల్ రిపీట్' లేదా 'కంపార్ట్‌మెంట్ కేటగిరీ'లో ఉంచుతామని వేణుగోపాలన్ సుప్రీంకోర్టుకు చెప్పారు.

దానితోపాటూ విద్యార్థుల్లో ఎవరికైనా మార్కులపై అసంతృప్తి ఉంటే వారికి తర్వాత జరిగే సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో రాయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు.

సీబీఎస్ఈ బోర్డ్ ఫార్ములాను సుప్రీంకోర్టు స్వీకరించింది. మార్కులపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు వారు పరీక్ష రాయవచ్చని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)