You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs ENG: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ 'పింక్ బాల్' టెస్ట్.. విజయం ఎవరిదో
- రచయిత, స్టీఫెన్ షెమ్లిట్
- హోదా, బీబీసీ స్పోర్ట్
- ప్రచురణ
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ బుధవారం నుంచి అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియం వేదికగా జరగనుంది.
సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా, రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఇది.
చెన్నైలో జరిగిన రెండో టెస్టులో భారత్ చేతిలో ఇంగ్లండ్ 317 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ... తమ ఓటమికి పిచ్ కారణం కాదని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నిజానికి భారత ఉపఖండం పిచ్‌లపై ఇంగ్లండ్ జట్టు సవాళ్లు ఎదుర్కొంటోంది. శ్రీలంకపై ఆ జట్టు 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకోవడం, ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో 1-1తో సమంగా ఉండటాన్ని మంచి ప్రదర్శనే అనుకోవచ్చు.
ఇంగ్లండ్ సంతోషించే అంశాలు చాలా ఉన్నా, అంతే సంఖ్యలో సవాళ్లు కూడా ఆ జట్టు ముందు ఉన్నాయి.
గులాబీ టెస్టులో...
చెన్నై మ్యాచ్‌లో పిచ్ ఇంగ్లండ్‌కు చాలా ఇబ్బందికరంగా ఉంది.
అయితే, ఆ జట్టు పేలవ ప్రదర్శనకు ఇదొక్కటే కారణం అనుకోలేం. బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్య ఆటతీరు, స్పిన్నర్ల పేలవ బౌలింగ్ కూడా కనిపించింది. స్పిన్ పిచ్‌పై ఆడటంలో అనుభవం, నైపుణ్యం ఉన్న భారత్ మాత్రం దీన్ని బాగా సొమ్ము చేసుకుంది.
మొదటి రెండు టెస్టులతో పోల్చితే అహ్మదాబాద్ పిచ్ కాస్త భిన్నంగా ఉండొచ్చని భావిస్తున్నారు. పైగా ఈ మ్యాచ్ గులాబీ బంతితో, ఫ్లడ్ లైట్ల వెలుగులో జరగబోతోంది.
భారత్‌లో జరుగుతున్న రెండో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచింది గానీ, ఒక్క భారత స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయారు. భారత్ సొంత గడ్డపై స్పిన్నర్లు వికెట్లు తీయకుండా గెలిచిన టెస్టు అదొక్కటే.
అహ్మదాబాద్‌లో పరిస్థితులు ఇంగ్లండ్‌కు మరీ అంతగా మారినట్లుగా అనిపించకపోవచ్చు. పేసర్లు మళ్లీ కష్టపడాల్సి రావొచ్చు.
అయితే, ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు (ఇద్దరూ జట్టులో ఉంటే) పిచ్ నుంచి ఏ మాత్రం ప్రోత్సాహం లభించినా, ఆ జట్టు ప్రయోజనం పొందొచ్చు.
రొటేషన్... రొటేషన్...
ఇంగ్లండ్ ఈ ఏడాది వన్డేలు, టీ20లతోపాటు 17 టెస్టు మ్యాచ్‌లు ఆడుతోంది. అందుకే ఆటగాళ్లపై భారం లేకుండా, ఆ జట్టు రొటేషన్ పద్ధతి అనుసరిస్తోంది. ఆటగాళ్లకు మధ్య మధ్యలో విశ్రాంతినిస్తోంది.
ఈ విధానాన్ని తమ జట్టు కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న ఆరోన్ ఫించ్ అంటున్నారు.
ఇంగ్లండ్ ఈ మధ్య బలమైన జట్లను ఎంపిక చేసింది దక్షిణాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్‌కు, ఇప్పుడు భారత్‌తో సిరీస్‌కే.
మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టుల్లో విశ్రాంతి తీసుకుంటూ... ఐపీఎల్‌లో మాత్రం ఆడుతుండటంపై చర్చ జరుగుతోంది.
అయితే, వాస్తవిక దృక్పథంతో చూసినప్పుడు ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని దూరం చేయడం చాలా కష్టం. ఓ విధంగా ఆ లీగ్‌లో ఆడిన అనుభవం ఆటగాళ్లు ఇంగ్లండ్ తరఫున రాణించేందుకు కూడా పనికివస్తుంది.
రొటేషన్ విధానంలో ఇంగ్లండ్ పూర్తి ప్రణాళికలేంటో ఇంకా తెలియరాలేదు. కొందరు ఆటగాళ్లు ఈ వేసవిలో జరిగే టెస్టులన్నీ ఆడుతున్నారు. కానీ, కొన్ని వన్డేలకు మాత్రం దూరమవుతున్నారు.
మరోవైపు ఐపీఎల్ చివరి దశలో మ్యాచ్‌లు ఆడేందుకు... న్యూజీలాండ్‌తో జూన్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు కొందరు ఆటగాళ్లు దూరం కానున్నారు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు తమ జట్టు పూర్తి సామర్థ్యంతో వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని ఇంగ్లండ్ ఆశించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న రెండు ఐపీఎల్ సీజన్లను కూడా దీనికి ప్రాక్టీస్‌గా పరిగణించవచ్చా?
మరోవైపు శ్రీలంక సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి వచ్చిన కారణంగా కొందరు ఆటగాళ్లు భారత హోటళ్లలో క్వారంటీన్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ జట్టు మేనేజ్‌మెంట్ ఉద్దేశాలు మంచివే కావొచ్చు గానీ, వాటి వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి.
అయితే, ఈ రొటేషన్ విధానంలో ఈ చలికాలంలో మంచి ఫలితాలే కనిపించాయని చెప్పకతప్పదు. దీర్ఘకాలికంగా దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది యాషెస్ టెస్టు సిరీస్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంటే, ఈ విధానం విజయవంతమైనట్లు భావించవచ్చు.
రొటేషన్ పద్ధతిలో భాగంగా అహ్మదాబాద్ టెస్టు సహా చివరి రెండు టెస్టుల నుంచి స్పిన్నర్ మోయిన్ అలీకి ఇంగ్లండ్ జట్టు విశ్రాంతినిస్తోంది.
బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్, వికెట్ కీపింగ్‌లో ఇంగ్లండ్ బలంగానే ఉంది. లోటంతా స్పిన్ విభాగంలోనే. భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఉండటం కలవరపెట్టే విషయమే.
రెండో టెస్టు తర్వాత మెయిన్ అలీకి విశ్రాంతినిస్తామని తెలిసినా, డోమ్ బెస్‌కు బదలుగా అతడినే ఈ పర్యటనకు ఎంపిక చేసింది ఇంగ్లండ్.
ఇక అహ్మదాబాద్ టెస్టులో జాక్ లీచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. బెస్‌ను తీసుకోవడంపై మళ్లీ ఆ జట్టు దృష్టి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మణికట్టు గాయం నుంచి బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ కోలుకుంటే, అహ్మదాబాద్ టెస్టుకు అందుబాటులోకి వస్తాడు.
అయితే, క్రాలీ, డోమ్ సిబ్లీ, రోరీ బర్న్స్, జానీ బెయిర్‌స్టో, డాన్ లారెన్స్... ఈ ఐదుగురూ ఒకేసారి అందుబాటులో ఉన్న సందర్భం ఇంతవరకూ రాలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి.
మొదటి టెస్టులో సిబ్లీ 87 పరుగులు చేసి, ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లు ఆ తర్వాతి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నారు.
లారెన్స్‌కు జట్టులో చోటు ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి.
బెయిర్ స్టో స్పిన్ బాగా ఆడతాడు. శ్రీలంక సిరీస్‌లో క్రాలీ కంటే మెరుగ్గా పరుగులు చేశాడు. కానీ, క్రాలీ పాకిస్తాన్‌పై 267 పరుగులు చేసిన తర్వాత ఆడింది ఐదు ఇన్నింగ్స్‌లే.
ఈ మధ్య రూట్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లే పునాదిగా ఇంగ్లండ్ పెద్ద స్కోర్లు సాధిస్తోంది. చెన్నైలోనూ రూట్ మెరుపులు చూశాం.
ఇక ఇంగ్లండ్ టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లూ కలిపి 300 పరుగులైనా దాటకపోవడం 1995 తర్వాత తొలిసారి గత మ్యాచ్‌లోనే జరిగింది.
కెప్టెన్ రూట్‌కు మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అవసరం.
స్టోక్స్ ‘అశ్విన్ గండం’ దాటుతాడా...
భారత పర్యటనలో తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేశాడు బెన్ స్టోక్స్. ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌లు కలిపి అతడు చేసింది 33 పరుగులే. ప్రతి సందర్భంలోనూ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కే అతడు వికెట్ సమర్పించుకున్నాడు.
టెస్టుల్లో అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు స్టోక్స్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకూ అశ్విన్ చేతిలో అతడు పది సార్లు ఔటయ్యాడు. మరే బౌలర్ కూడా స్టోక్స్‌ను అన్నిసార్లు ఔట్ చేయలేదు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ చాలా కఠినమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. దీనికి అతడిని తప్పుపట్టలేం. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అతడు తీవ్రంగా తడబడ్డాడు.
రెండో టెస్టులో స్టోక్స్ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. వ్యూహత్మకంగానే అతడికి బౌలింగ్ ఇవ్వకుండా ఉండాల్సి వచ్చిందని రూట్ అన్నాడు. ఇక ఆ మ్యాచ్‌లో స్టోక్స్ అశ్విన్ క్యాచ్ కూడా వదిలేశాడు. ఆ మ్యాచ్‌లో అశ్విన్ శతకం చేసి, భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
స్టోక్స్ నుంచి సరైన సహకారం లేకుండా ఇంగ్లండ్ ఈ సిరిస్ గెలుచుకోవడం కష్టమే.
బౌలింగ్‌లో అవకాశాలు రాకపోతే, బ్యాట్‌తోనైనా అతడు రాణించాల్సి ఉంటుంది. ఇందుకు కొరకరాని కొయ్యగా మారిన అశ్విన్‌పై అతడు పైచేయి సాధించాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- Hyperemesis: గర్భం దాల్చి వారాలు గడిచినా వాంతులు తగ్గట్లేదు, ఎందుకిలా? వాంతుల వల్ల బిడ్డకు హాని ఉంటుందా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)