విజయవాడ: కోవిడ్‌తో చనిపోయిందని మృతదేహాన్ని అప్పగించారు... అంత్యక్రియలు చేశాక ఆమె సజీవంగా ఇంటికి తిరిగొచ్చారు...

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం పెద్ద చర్చకు దారితీస్తోంది. తాజాగా జగ్గయ్యపేట ఉదంతం తర్వాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు ఘటనలు జరిగినా పాఠాలు నేర్చుకోకుండా చికిత్స పొందుతున్న రోగిని చనిపోయినట్లు నిర్ధారించి, బంధువులకు మృతదేహం అప్పగించడం కలకలం రేపింది.
ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన బంధువులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 15 రోజులకు చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రి నుంచి డిచ్ఛార్జయ్యి నేరుగా ఇంటికి చేరడంతో అందరూ అవాక్కయ్యారు.
జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ ఉదంతం తర్వాత విజయవాడ ఆస్పత్రి సిబ్బంది తీరు మీద పలు విమర్శలు వస్తున్నాయి. విచారణ జరపాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవుతున్న తీరుపై పరిశీలన చేస్తామని చెబుతున్నారు.

అసలేం జరిగింది...
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కరోనా సోకడంతో వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మే రెండోవారంలో ఆమెకు కరోనా లక్షణాలు బయటపడగా తొలుత జగ్గయ్యపేటలో వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆమెను బంధువులు మే 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు.
అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స కూడా చేశారు. మూడు రోజుల తర్వాత కరోనాతో పోరాడుతూ ఆమె చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె భర్త గడ్డయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న వార్డ్ మార్చడంతో తన భార్య కనిపించకపోయేసరికి అక్కడున్న సిబ్బందిని అడిగినానని గడ్డయ్య చెబుతున్నారు. ఆ తర్వాత మార్చురీలో వారు చూపించిన మృతదేహాన్ని తీసుకొచ్చామని అంటున్నారు . తీవ్ర విషాదంతో ఆస్పత్రికి వెళ్ళిన తమకు అక్కడి డాక్టర్లు సిబ్బంది కోవిడ్ నిబంధనల ప్రకారం ప్యాక్ చేసిన మృతదేహాన్ని అప్పగించారని గిరిజమ్మ సమీప బంధువు పరమేష్ బీబీసీకి తెలిపారు.
సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు, ఆ వెంటనే కుమారుడు మృతి
గిరిజమ్మ చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించడంతో మే 16వ తేదీన జగ్గయ్యపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. వయసు మీద పడిన మూలంగా కరోనా సమస్యలతో గిరిజమ్మ చనిపోయినట్లు అంతా భావించామని కుటుంబీకులు చెబుతున్నారు.
"మాకు మృతదేహం కోవిడ్ నిబంధనల ప్రకారం అప్పగించారు. పూర్తిగా ప్యాక్ చేశారు. పైగా వైరస్ వ్యాపిస్తుందనే భయం కూడా అందరిలో ఉంది. దాంతో ప్యాక్ చేసిన బాడీని తెరిచి చూడాలనే ఆలోచన రాలేదు. అలానే సంప్రదాయం ప్రకారం దహనం జరిగిపోయింది. ఆమె చనిపోయిందనే అంతా అనుకుని, ఇతర కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. ఆమెతో పాటుగా కొడుక్కి కూడా వైరస్ సోకింది. తల్లి మరణంతో కలత చెందిన రమేష్ బాబు కూడా ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 23న చనిపోయాడు. అతనికి కూడా అదే రీతిలో అంత్యక్రియలు పూర్తి చేసేశాం. వారం రోజుల్లోనే తల్లీ, కొడుకులు చనిపోయారనే ఆవేదనలో ఉన్నాం" అని రమేష్ తెలిపారు.

హఠాత్తుగా ప్రత్యక్షమైన గిరిజమ్మ
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి సాధారణ స్థితికి వస్తున్న దశలో అనూహ్య పరిణామం ఎదురైంది. జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో గిరిజమ్మ ఇంటికి వచ్చారు. విజయవాడ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ చేయడంతో ఆటోలో ఆమె జగ్గయ్యపేట చేరుకున్నారు. ఆటో దిగి వచ్చిన ఆమెను చూసి కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. తొలుత కొంత కంగారుపడిపోయామని స్థానిక మహిళ విజయ బీబీసీతో అన్నారు.
"ఆమె రావడంతోనే మా అందరికీ ఆందోళన కలిగింది. తీరా కూర్చోబెట్టి కొంత సేపు మాట్లాడితే విషయమంతా చెప్పింది. అప్పుడు మాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమె చెప్పిన విషయాలను బట్టి బహుశా మరొకరి మృతదేహం మాకు అప్పగించి ఉంటారని అర్థమైంది. స్థానికంగా ఉన్న పెద్దలకు చెప్పాం. విజయవాడ ఆస్పత్రి వారితో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చనిపోయినట్లు మాకు సమాచారం ఇవ్వడం, మళ్లీ మరొకరి మృతదేహం అప్పగించడం వెనుక కారణాలు మాకు తెలియడం లేదు" అంటూ ఆమె వివరించారు.
ఎందుకిలా జరిగింది?
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్స సందర్భంగా గిరిజమ్మతో పాటు ఆమె పోలికలు ఉన్న మరో మహిళకు కూడా వైద్యులు చికిత్స చేసినట్టు పేరు తెలిపేందుకు నిరాకరించిన ఓ స్టాఫ్ నర్స్ అన్నారు. సడన్‌గా ఆమె చనిపోవడంతో గిరిజమ్మే చనిపోయిందనే అంచనాకు వచ్చి ఉంటారని ఆమె చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కూడా అదే సమాచారం ఇవ్వడం, వారు కూడా మృతదేహం ప్యాక్ చేసి ఉండడంతో గుర్తించలేకపోయిన కారణంగా సమస్య వచ్చిందని అంచనా వేశారు.
అయితే విజయవాడ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు ఈకాలంలో పదే పదే జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పెడన కి చెందిన ఓ వ్యక్తి మృతదేహం విషయంలో కూడా ఇలానే మారిపోయిందని, అయితే సకాలంలో గుర్తించి మార్చుకున్నారని పౌర సమాఖ్య ప్రతినిధి విజయ్ భాస్కర్ తెలిపారు. మార్చురీలో మరింత జాగ్రత్తలు అవసరం అని ఆయన అంటున్నారు. బతికి ఉన్న వారు చనిపోయారని సమాచారం ఇవ్వడం, చనిపోయిన వారి మృతదేహాల పట్ల తగిన శ్రద్ధ లేకపోవడం వంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

విచారణ జరుగుతోంది... గడ్డయ్య గుర్తు పట్టలేకపోయారు
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో మృతి చెందిన వారి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే శివశంకర్ రావు అన్నారు. గిరిజమ్మ ఎపిసోడ్ లో ఎక్కడ లోపం జరిగిందన్నది తేల్చేందుకు ఆస్పత్రి అధికారులతో అంతర్గత కమిటీ వేసి విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.
"కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో ఎక్కువ మృతదేహాలు వచ్చాయి. ముఖ్యంగా కొందరు బంధువులు చనిపోయిన వారిని వదిలేసి వెళ్లిపోయారు. గ్రామీణ ప్రాంతంలో కొందరికి సమాచారం ఇవ్వడానికి కూడా సెల్ ఫోన్ అందుబాటులో లేని స్థితి ఉంది. కొందరి నెంబర్లు తప్పుగా ఫీడ్ అవుతున్నాయి. అలాంటి సమయంలో వారం రోజుల పాటు చూసి ఆ మృతదేహాలను పోలీసుల సహాయంతో తరలిస్తాము. కోవిడ్ మృతదేహాలను అప్పగించినప్పుడు బంధువులకు మొఖం చూపించి, నిర్ధారణ తర్వాత అప్పగిస్తాం. ఇక్కడ కూడా ఆమె భర్తకు చూపించినా సరిగ్గా కనిపెట్టలేకపోయారు. దాంతో సమస్య వచ్చింది. అయితే అంతకుముందు జరిగిన లోపాలకు కూడా బాధ్యులు ఎవరన్నది కనుగొనే ప్రయత్నం చేస్తున్నాం. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జూహీచావ్లా 5జీపై ఎందుకు కోర్టుకెళ్లారు.. ఈ టెక్నాలజీపై అంత ఆందోళన ఎందుకు
- ‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి
- ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























