కరోనాతో చనిపోయిన తండ్రి చితిమంటల్లో దూకిన కూతురు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, DEFODI IMAGES/GETTY
రాజస్థాన్‌లో ఒక యువతి కరోనాతో తండ్రి చనిపోవడాన్ని తట్టుకోలేక ఆయన చితిమంటల్లో దూకిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
తండ్రి కరోనా కాటుకు బలవడాన్ని ఆమె ఏ మాత్రం తట్టుకోలేకపోయారు. చితికి నిప్పంటించగానే ఆ మంటల్లోకి దూకారు. తండ్రితో పాటే తనువు చాలించేందుకు యత్నించారు.
ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
రాజస్థాన్ రాష్ట్రం బాడ్‌మేర్‌లోని రాయ్ కాలనీలో ఉండే దామోదర్‌దాస్ షార్దా(73)కు కరోనా సోకింది. ఆదివారం ఆయనను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వ్యాధితో పోరాడుతూ మంగళవారం మరణించారు.
అనంతరం ఆయనకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ముగ్గురు కుమార్తెల్లో చిన్నామె అయిన చంద్ర షార్దా (34) ఉన్నట్టుండి చితి మంటల్లో దూకేశారు.
అక్కడే ఉన్న జనం ఆమెను మంటల నుంచి బయటకు లాగినప్పటికీ 70 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
తొలుత ఆమెకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జోధ్‌పుర్ తరలించారు. వాస్తవానికి శ్మశానానికి రావొద్దని వారించినా.. చంద్ర పట్టుబట్టి మరీ వచ్చారని పోలీసులు చెప్పారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో లాక్ డౌన్ అక్కర్లేదు -సీఎస్
తెలంగాణ కరోనా విషయంలో మిగతా రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉందని, లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు.
ప్రజలు అనవసరంగా భయపడవద్దని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
10 రోజులుగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోందని, ఇది శుభ పరిణామమని తెలిపారు. లాక్‌డౌన్ విధింపుతో పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుందన్నారు.
లాక్‌డౌన్‌పై సీఎం, కేబినేట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బుధవారం ఆయన ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కరోనా కట్టడికి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు కష్టపడి పని చేశారని, దీంతో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదగ్గర పరిస్థితి బాగానే ఉందన్నారు.
సీఎం రోజుకు మూడు, నాలుగు సార్లు తనతో మాట్లాడి తగిన ఆదేశాలిస్తున్నారని, వాటి ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో మౌలిక సదుపాయాలను పెంచుతూనే ఉన్నామన్నారు.
సెప్టెంబరులో 18 వేలుగా ఉన్న ఆక్సిజన్ పడకలను 52 వేలకు పెంచామన్నారు. అందుకే హైదరాబాద్ వైద్య చికిత్స కేంద్రంగా మారిందని, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్ నుంచి కూడా ప్రజలు వచ్చి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్సులు హైదరాబాద్‌కు వచ్చాయని సోమేశ్ కుమార్ చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో కాల్‌లో వివాహం
కరోనా కష్టకాలంలో మెదక్ జిల్లాలోని ఒక పురోహితుడు వీడియో కాల్ ద్వారా ఒక జంట పెళ్లి చేశాడని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
లగ్గం అంటేనే పచ్చని పందిళ్లు, పురోహితుడి వేదమంత్రాలు, చుట్టాల హడావుడి.. పెండ్లి తంతు మొదలైనప్పటి నుంచి ప్రతీ ఘట్టాన్ని చేయించడానికి బ్రాహ్మణులు ఉండాల్సిందే, వేదమంత్రాలు చదవాల్సిందే.
కరోనా వేళ ఆ మంత్రాలు చెప్పే పంతుళ్లు వైరస్ బారినపడుతున్నారు. పెండ్లికి వచ్చేవారినుంచి వైరస్ సోకి అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనకు తెరతీశారు పురోహితుడు దిగంబరశర్మ.
సాంకేతికతను వినియోగించుకొని ఆన్‌లైన్ ద్వారా వేదమంత్రాలు చెప్తూ లగ్గం చేయించారు. ఈ పెండ్లి మెదక్ జిల్లాలో జరిగింది.
పాపన్నపేట మండలం సోమ్లా గిరిజన తండాకు చెందిన మంజులకు టేక్మాల్ మండలం వెంకటాపూర్ పంచాయతీలోని భీమ్లా తండాకు చెందిన మోహన్‌తో ఈ నెల 3న పెండ్లి చేయాలని నిశ్చయించారు.
ఈ నెల 2న సోమ్లా తండాలో ఒకరు కరోనాతో మృతిచెందడంతో.. పెండ్లి వేదికను వరుడి గృహానికి మార్చారు. వైరస్ తీవ్రత వేళ పెండ్లి జరిగే స్థలానికి రాలేనని, ఆన్‌లైన్ ద్వారా జరుపుతామని పురోహితుడు దిగంబరశర్మ తెలిపారు.
అందుకు ఇరు కుటుంబసభ్యులు అంగీకరించారు. దిగంబరశర్మ పాపన్నపేటలోని తన స్వగృహంలో నుంచి వీడియో కాల్‌ద్వారా మంత్రోచ్చారణ చేస్తూ పెండ్లి జరిపించారు.
సెల్‌ఫోన్‌ను పందిరిలో మైక్ వద్ద ఉంచగా.. పెండ్లి తంతు యథావిధిగా కొనసాగింది. కరోనా వల్ల ఆగిపోతుందనుకొన్న పెళ్లి సెల్‌ఫోన్ ద్వారా జరగటంతో రెండు కుటుంబాలు ఊపిరి పీల్చుకొన్నాయని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించిందని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మార్పులు తెచ్చి రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారని సాక్షి రాసింది.
'ప్రస్తుతం రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా 44,639 (73 శాతం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
వీటిలో 43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6,13,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ప్రవేశం పొందారు.
వీరిలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రాగా రెండు లక్షల మంది కొత్తగా ప్రవేశం పొందారు.
ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం, అదికూడా కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రవేశాలు పొందడం చరిత్రాత్మకం.
వీరందరికీ బంగారు భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
సీబీఎస్‌ఈకి దేశ విదేశాల్లో 25,000కి పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా బోర్డుకు అనుసంధానించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
2024 - 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు ద్వారా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతుంది' అని ప్రకటనలో తెలిపారని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























