సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కోవిడ్‌తో మృతి

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి గురువారం ఉదయం మృతి చెందారు.

తన కుమారుడు కోవిడ్‌కు చికిత్స పొందుతూ చనిపోయారని సీతారాం ఏచూరి ట్వీటర్‌ ద్వారా తెలిపారు.

కరోనా నుంచి తన కుమారుడు కోలుకునేలా చివరి వరకు ప్రయత్నించిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

జూన్ 9కి ఆశిష్‌కు 35 ఏళ్లు నిండుతాయని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.

ఆశిష్ ఏచూరికి గుర్‌గ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. కానీ, గురువారం ఉదయం 5.30కు ఆయన చనిపోయారని ఆశిష్ కుటుంబ సభ్యులు చెప్పారు.

ఆశిష్ మృతిపై సీపీఎం ఒక ప్రకటన విడుదల చేసింది.

"సీతారాం ఏచూరి - ఇంద్రాణీ మజుందార్‌ల కుమారుడు ఆశిష్ ఏచూరి మరణం మమ్మల్ని విషాదంలో ముంచేసింది. సీతారాం, ఇంద్రాణీ, ఆశిష్ భార్య స్వాతి, ఆయన చెల్లెలు అఖిలకు పోలిట్ బ్యూరో అండగా నిలుస్తుంది" అని అందులో తెలిపింది.

ఆశిష్ ఏచూరి అకాల మరణానికి సీతారాం ఏచూరి, ఆయన కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

సీతారాం ఏచూరి కుమారుడి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

ఏచూరి కుటుంబానికి మమత సంతాపం తెలిపారు.

కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్‌లో ఆశిష్ మృతిపై సంతాపం తెలిపారు.

"ఈ వార్త చాలా కదిలించింది. తల్లిదండ్రులకు ఇంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది. ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)