You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నేను పిచ్చిదాన్ని కాదని కోర్టు నమ్మింది, కానీ సమాజం నమ్మాలిగా’-అని బాధపడే మహిళలకు మదురై కోర్టు తీర్పు ఎలా ఊరటనిస్తుందంటే..
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మానసిక ఆరోగ్య సంబంధిత ఆరోపణలు ఉన్న వివాహ, విడాకుల కేసుల్లోని సంబంధిత వ్యక్తుల పేర్లు, చిరునామాలు వంటి గుర్తింపు వివరాలను బయటకు వెల్లడించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై శాఖ ఆదేశించింది.
భార్యకు మానసిక ఆరోగ్య సమస్యలున్నాయని ఆరోపిస్తూ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను మదురై హైకోర్టు కొట్టివేసింది.
'ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చేసే నిరాధారమైన ఆరోపణలు వారి గౌరవం, గోప్యత, సామాజిక జీవితంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపవచ్చు' అని పేర్కొంది.
"చాలా విడాకుల కేసుల్లో, మహిళలపై మానసిక ఆరోపణలే ఎక్కువగా చేస్తారు. తీర్పు అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా సరే ఈ ఆరోపణలు జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ఆదేశం ఒక గొప్ప ముందడుగు" అని న్యాయవాదులు పేర్కొన్నారు.
అదే సమయంలో విడాకులు తీసుకున్నవారిని వివాహం చేసుకునేవారు వారి గత వివాహం లేదా నేపథ్యం గురించి తెలుసుకునే అవకాశాలు కూడా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కేసు నేపథ్యం ఏంటి?
జస్టిస్ ఆనంద్ వెంకటేశ్, ఆర్.ఆర్. రామకృష్ణన్‌లతో కూడిన మదురై హైకోర్టు బెంచ్ విడాకులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.
పెళ్లికి ముందు తన భార్యకు స్కిజోఫ్రీనియా (ఒక మానసిక రుగ్మత) ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ భర్త విడాకుల పిటిషన్ వేశారు.
తంజావూరు కుటుంబ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత ఆయన మదురై హైకోర్టును ఆశ్రయించారు.
భార్యపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి భర్త తగిన వైద్య ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
"ఒక వ్యక్తికి స్కిజోఫ్రెనియా ఉందని నిరూపించడానికి కేవలం వైద్య సిఫార్సులు, ప్రిస్క్రిప్షన్లు మాత్రమే సరిపోవు" అని పేర్కొంది.
భార్య ఉన్నత విద్యావంతురాలు కావడం, విచారణ సమయంలో ఆమె ఇచ్చిన స్పష్టమైన వాంగ్మూలం వంటి అంశాలను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు ఆనంద్ వెంకటేశ్, ఆర్.ఆర్. రామకృష్ణన్‌లు జూన్ 15న భర్త పిటిషన్‌ను కొట్టివేశారు.
పేర్లను వెల్లడిస్తే ఏమవుతుంది?
"మానసిక అనారోగ్యం ఆరోపణలు తర్వాత అబద్ధమని నిరూపితమైనప్పటికీ, దానివల్ల పడే సామాజిక ముద్ర చాలా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు" అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
''ఇలాంటి ఆరోపణలు వివాహ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తి గౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఒకరికి 'మానసిక రోగి' అనే ముద్ర పడటం, సమాజం వారిని జీవితాంతం చూసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది" అని న్యాయమూర్తులు అన్నారు.
ఇలాంటి కేసుల్లో
- భార్యాభర్తల పేర్లను ప్రచురించకూడదు.
- చిరునామా, కుటుంబ వివరాలతో సహా గుర్తింపు సమాచారాన్ని తప్పనిసరిగా తొలగించాలి.
- కోర్టు ఉత్తర్వులు, తీర్పుల్లో వారిని "X", "Y" వంటి కోడ్ పేర్లతో సూచించాలి.
- మానసిక ఆరోపణలతో కూడిన విడాకులు, వివాహ, కుటుంబ కేసుల్లో గోప్యతను కాపాడాలి.
ఇలాంటి కేసుల్లో పిటిషన్లు, ఉత్తర్వులు, తీర్పులతో సహా ప్రజలకు అందుబాటులో ఉండే కోర్టు పత్రాల్లో గుర్తింపు వివరాలను వెల్లడించకూడదని హైకోర్టు పేర్కొంది.
"తీవ్రమైన మానసిక అనారోగ్య ఆరోపణలతో కూడిన వైవాహిక కేసులు పెరగడం, అలాగే ఈ కేసుల్లోని వ్యక్తుల గుర్తింపు వారి జీవితాంతం తీవ్ర పరిణామాలకు దారితీయగలదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది" అని న్యాయమూర్తులు అన్నారు.
ఈ ఆదేశం అన్ని విడాకుల కేసులకు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. మానసిక అనారోగ్య ఆరోపణలు ఉన్న వైవాహిక, కుటుంబ కేసులకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని చెప్పింది.
"భారత్‌లో లైంగిక దాడి బాధితుల గుర్తింపును వెల్లడించడంపై ఇప్పటికే చట్టపరమైన నిషేధం ఉంది. అయితే మానసిక అనారోగ్య ఆరోపణలు ఉన్న ఫ్యామిలీ కేసుల్లో పేర్లను గోప్యంగా ఉంచడానికి స్పష్టమైన కోర్టు మార్గదర్శకాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది స్వాగతించదగ్గ విషయం" అని మద్రాసు హైకోర్టు న్యాయవాది రాజీవ్ రూఫస్ అన్నారు.
"కొన్నేళ్ల క్రితం ఓ విడాకుల కేసులో నేను ఆ మహిళ తరఫున వాదించాను. తన పేరుతో ఉన్న తీర్పు లేదా ఉత్తర్వుల ప్రతులు, విడాకుల కేసుకు సంబంధించిన పత్రాలు బహిరంగంగా ఉండటం తన భవిష్యత్తు వృత్తి, ఉద్యోగంపై ప్రభావం చూపుతుందని ఆమె భావించారు. అందుకే విచారణ సమయంలో ఆమె గుర్తింపును వెల్లడించవద్దని మేము కోర్టును అభ్యర్థించాము. కోర్టు దానిని అంగీకరించింది" అని మద్రాసు హైకోర్టులో తాను వాదించిన ఒక కేసును ఉదహరిస్తూ ఆయన చెప్పారు.
ఒకరిపై ముఖ్యంగా వైవాహిక కేసుల్లో ఆరోపణలు చేయడం చాలా సులభమని ఆయనన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఆరోపణలు తర్వాత అబద్ధం అని తేలినప్పటికీ, అది వారికి ఒక కళంకంగానే మిగిలిపోతుందని రాజీవ్ రూఫస్ అంటున్నారు.
‘సమాజం నన్ను మానసిక రోగిగా చూస్తోంది’
తిరునెల్వేలికి చెందిన 60 ఏళ్ల మహిళ ఒకరు తన భర్త చేసిన ఆరోపణల వల్ల తాను తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ఆమె తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
మదురై హైకోర్టు ఉత్తర్వును ఆమె స్వాగతించారు.
"నా 30 ఏళ్ల వివాహ బంధం ముగిసేసరికి నన్ను మానసిక రోగిగా మార్చేశారు" అని అన్నారు.
''మా వైవాహిక జీవితమంతా నేను నిరంతరం శారీరక, మానసిక హింసను భరించాను. మాకు పిల్లలు లేరనే సాకుతో నా భర్త రెండో పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. నేను దాన్ని కూడా భరించాను.
"నాకు ఏదో మానసిక సమస్య ఉందని ఒక మానసిక వైద్యుడి ద్వారా నన్ను నమ్మించి, కొన్ని మాత్రలు వేసుకోమని చెప్పాడు. 54 ఏళ్ల వయసులో నా నగలు, ఆస్తిపాస్తులన్నీ తీసుకుని నన్ను వదిలేయాలని చూసినప్పుడు నేను భరించలేకపోయాను. స్థానిక కోర్టులో 'గృహ హింస చట్టం' కింద కేసు పెట్టాను"
"కానీ నాకు నయంకాని మానసిక అనారోగ్యం ఉందని, అందువల్ల నేను చేసే ఆరోపణలు నిరాధారమైనవని నా భర్త చెప్పారు. చివరికి నాకు ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు లేవని కోర్టు తీర్పు ఇచ్చింది. నా భర్త జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. అక్కడ కూడా తీర్పు నాకు అనుకూలంగానే వచ్చింది" అని ఆమె తెలిపారు.
ఆమె న్యాయవాదితో మాట్లాడి కేసు వివరాలను బీబీసీ ధ్రువీకరించుకుంది.
తీర్పులు అనుకూలంగా వచ్చినప్పటికీ, సమాజం, బంధువులు తనను చూసే విధానం మారలేదని ఆ మహిళ చెప్పారు.
‘‘ఎవరిపైనైనా వచ్చిన ఆరోపణలను మాత్రమే ఇక్కడి సమాజం గుర్తుంచుకుంటుంది. అవి అబద్ధమని రుజువైనప్పుడు చాలా మంది పట్టించుకోరు" అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
‘ముందు పెళ్లి వివరాలు తెలుసుకునే అవకాశం ఉండాలి’
"కుటుంబ కేసుల్లో ఆధారాలులేని మానసిక ఆరోగ్య సమస్యల ఆరోపణలను నిరోధించేలా మదురై హైకోర్టు బెంచ్ ఆదేశం ఉంది'' అని మద్రాస్ హైకోర్టు న్యాయవాది శాంతకుమారి అన్నారు.
''మానసిక రోగులను మానవతాదృక్పథంతో చూడాలని ఇది సూచిస్తుంది. వారి వివరాలు బహిరంగంగా వ్యక్తీకరించడం తప్పు అని ఇది స్పష్టం చేసింది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఆదేశం స్వాగతించదగినదే అయినప్పటికీ కొన్ని వైవాహిక కేసుల్లో తమ పేరు గానీ లేదా ఎదుటి పక్షం పేరును గానీ వెల్లడించడం అవసరమని భావించేవారు కోర్టుల నుంచి ప్రత్యేక అనుమతి పొందవచ్చని మద్రాస్ హైకోర్టు న్యాయవాది సురేఖ అంటున్నారు.
''ఒకరు మళ్లీ పెళ్లి చేసుకునేటప్పుడు గత వివాహం ఎందుకు ముగిసిందో కొత్త భాగస్వామి తెలుసుకోవాలనుకుంటే అందుకు చట్టపరమైన మార్గాలుండాలి. ఆ వ్యక్తికి సంబంధించిన పత్రాలు బహిరంగంగా అందుబాటులో లేనప్పుడు ప్రత్యేక అనుమతితో వాటిని పొందేందుకు న్యాయస్థానాలు మార్గదర్శకాలను అందించాలి" అని ఆమె సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)