తెలంగాణ: ఇప్పటివరకు 700 మంది బడిపిల్లలకు కరోనావైరస్ – 10వ తరగతిలోపు బడులన్నీ మూసేస్తే మంచిదన్న వైద్యశాఖ

స్కూల్ విద్యార్థి

ఫొటో సోర్స్, iStock

ప్రచురణ

10వ తరగతిలోపు బడులన్నీ మూసేస్తే మంచిది - వైద్యశాఖ సూచన

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదో తరగతి లోపు స్కూళ్లు, గురుకులాలు, వసతి గృహాలను వెంటనే ముూసివేస్తేనే మేలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక, ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాశాయి. ఆ కథనాల ప్రకారం

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు నడిస్తే, కరోనా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యశాఖ హెచ్చరించింది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు బడులు నిర్వహించకపోవడమే ఉత్తమమని సూచించింది.

రాష్ట్రంలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగుచూశాయి.

దీంతో ఎక్కడికక్కడ పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేసి, ఇన్ఫెక్షన్‌ నిర్ధరణ అయినవారికి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని హోం క్వారంటైన్‌కు పంపారు.

దీనిపై విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 6 నుంచి 9 తరగతుల వరకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరగడంతో కోవిడ్‌ నిబంధనల అమలు సాధ్యపడటం లేదు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యశాఖ అంచనాకు వచ్చింది.

ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా విజృంభించవచ్చని, 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడమే ఉత్తమమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని సర్కారు నిర్ణయించింది.

వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉందని ఆయన వెల్లడించారు. ఒకవేళ కేసులు పెరిగితే వైద్యసేవలు అందించేందుకు అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుతామన్నారు.

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ అదుపులోనే ఉందని, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు పెట్టే తీవ్రమైన పరిస్థితి లేదని వైద్యవర్గాలు వెల్లడించాయి.

సముద్రం

హిందూ మహా సముద్రంలో పరిశోధనలు.. విశాఖలో బయలుదేరిన శాస్త్రవేత్తల బృందం

సముద్రంలో కంటికి కనిపించే వివిధ రకాల జీవరాశుల గురించి మనకు తెలుసు. మరి అవి కాకుండా సాగర గర్భంలో ఇంకా ఏముంది? అక్కడి జీవ వైవిధ్యం వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తదితర అంశాలను అన్వేషించేందుకు విశాఖ నుంచి శాస్త్రవేత్తల బృందం ఈ నెల 15న బయల్దేరిందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆర్‌వీ సింధు సాధన నౌకలో వెళ్లిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషినోగ్రఫీ(సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో)కి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహా సముద్ర గర్భంలోని విశేషాలను అన్వేషిస్తున్నారు.

ఇతర మహా సముద్రాలతో పోలిస్తే హిందూ సముద్రంలో పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. అందుకే ఇక్కడ సముద్ర గర్భంలో ఏం దాగుందో అన్వేషించే బాధ్యతను సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో తీసుకుంది..

సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్‌ చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

ఈ ప్రాజెక్ట్‌కు ‘ట్రేస్‌ బయోమీ’ అని పేరు పెట్టారు.

ఇందులో భాగంగా 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్‌ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది.

ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని పరిశీలిస్తారు.

సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్‌ టోటల్‌ హార్డ్‌నెస్, పీఏ లెవల్స్‌ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు.

అలాగే మనకు కావల్సిన మెడిసిన్లకు అవసరమైన బ్యాక్టీరియా, శిలీంద్రాల పరిశోధన జరగనుంది. భవిష్యత్‌లో వాతావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.

"హిందూ మహా సముద్రం అడుగు భాగంలో అతి తక్కువ పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకు ఉపరితలంపైనా.. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పరిశోధనలు చేశారు. ఈసారి మా శాస్త్రవేత్తల బృందం సాగర గర్భ లోతుల్ని అన్వేషించనుంది. సముద్ర జీవుల్లో జన్యు పరమైన మార్పులు, వాటి ప్రత్యేకతలు, ఆ జీవుల వల్ల కలిగే లాభనష్టాల్ని పరిశోధిస్తాం. సముద్ర గర్భంలోని వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్‌లో వచ్చే మంచి, చెడులపైనా సమాచారం సిద్ధం చేస్తాం. 90 రోజుల్లో ఈ యాత్ర పూర్తయినా.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మాత్రం మూడేళ్లు పడుతుంది" అని సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో చీఫ్‌ సైంటిస్ట్ డా.జి.ప్రభాకర్‌ ఎస్‌ మూర్తి తెలిపారు.

గోండీ

ఫొటో సోర్స్, @MPI_SHH

అంతరించిపోయే భాషల్లో గోండీ భాష

యునెస్కో ప్రకటించిన అంతరించే భాషల జాబితాలో తెలంగాణలోని గోండీ భాషకు ముప్పుపొంచి ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సింగ్ సరూతా తెలిపారని నవతెలంగాణ పేర్కొంది.

లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

గిరిజన భాషల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఆ కార్యక్రమంలో భాగంగా కోయ, లంబాడీ, గోండి, కొలమి భాషల్లో ప్రీమియర్స్ ప్రచురించిందన్నారు.

గిరిజన భాషలతో పాటు తెలుగులో వర్ణమాల, స్థానిక కవితలు, కథలను ముద్రించినట్లు వెల్లడించారు.

విద్యాహక్కు చట్టం 2009, నూతన విద్యావిధానం 2020 ప్రకారం గిరిజన పిల్లలకు 1, 2 తరగతులను వారి మాతృభాషలో విధ్యను బోధించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్రమంత్రి రేణుకా సింగ్ సరూతా వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా అంతరించే జాబితాలో ఉన్న 117 భాషలపై అధ్యయనం చేసి ప్రాధాన్యతా క్రమంలో డాక్యుమెంటేషన్ చేయాలని నిర్ణయించినట్లు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అంతరించే ముప్పు ముంగిట ఉన్న భాషల భద్రత, సంరక్షణకు మైసూరులోని భారతీయ భాషల కేంద్రం పనిచేస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)