నా రాజకీయ ప్రవేశం గురించి మరోసారి మాట్లాడతా: జూనియర్ ఎన్‌టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/JRNTR

ప్రచురణ

‘‘రాజకీయరంగ ప్రవేశం గురించి నా దగ్గర ఉన్న సమాధానమేంటో అందరికీ తెలుసు. ఆ విషయాలు మాట్లాడానికి ‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు. దీని గురించి మరోసారి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం’’ అని జూనియర్ ఎన్టీఆర్‌ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. శనివారం దీనికి సంబంధించిన ప్రోమోను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వివిధ జీవన స్థితిగతులున్న ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, మనిషి తాత్పర్యం అర్థం చేసుకోవాడానికి ఈ షో దోహదపడుతుందని అంగీకరించా. తప్పకుండా ఇది నాకు కొత్త జర్నీ. నా వంతు మార్క్‌ క్రియేట్‌ చేయడానికి కృషి చేస్తా. ఈ షోలో పాల్గొన్న వాళ్లు ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలీదు కానీ జీవితంలో గెలవగలం అన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లేలా చేయడమే నా బాధ్యత’’ అని చెప్పారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ డిమాండ్‌ వల్ల మూడేళ్లుగా మరో సినిమాలో కనిపించలేదు. మన హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే చిత్రమది. అందులో భాగం కావడం గర్వంగా ఉంది. ఇక ఫ్యాన్స్‌ విషయానికొస్తే.. నేను అభిమానులకు చేసిన దానికంటే అభిమానులు నాకు చేసిందే ఎక్కువ. మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏ హీరో అభిమాని అనేది ముఖ్యం కాదు.. మనుషులుగా సేవ చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అభిమానులు కాలర్‌ ఎగరేసుకుని తిరిగే స్థాయిలో నేను తప్పకుండా పనిచేస్తా" అని తెలిపారని ఈ కథనంలో రాశారు.

బంగారం

ఫొటో సోర్స్, Reuters

బబుల్‌గమ్‌లో, చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్

తెలంగాణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్‌ అధికారులు 471 గ్రాముల బంగారం, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారని సాక్షిలో ఒక వార్త రాశారు.

శుక్రవారం అర్ధరాత్రి షార్జా నుంచి 6ఈ–1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే వారి కదలికలు, మాటల తీరు అనుమానించిన అధికారులు నోట్లో తనిఖీ చేశారు.

నలుగురి నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను బయటకు తీయించగా, అందులో 471 గ్రాముల చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బంగారంతో పాటు ఒక ఉంగరం బయటపడింది. ఈ బంగారం విలువ సుమారు రూ.20.67 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.

అలాగే షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా జి–9458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి చెప్పుల్లో 694 గ్రాముల బంగారం బయటపడింది. ఈ చెప్పులను కవర్లు, కార్బన్‌ పేపర్లతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.27.04 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఈ కథనంలో తెలిపారు.

టీకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు: ఏపీ వైద్య శాఖ అనుమతి

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖ అనుమతించిందని ప్రజాశక్తిలో రాశారు.

ఈ మేరకు ప్రభుత్వ, ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పొందవచ్చని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ తెలిపారు.

కొవిన్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకున్నవారికే ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌లో లేకపోయినా.. ఎలాంటి ధృవపత్రం లేకున్నా కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే వెలుసుబాటును వైద్యశాఖ కల్పించింది.

60 ఏళ్లు దాటిన వారు ఏదైనా ధృవపత్రం చూపించి వ్యాక్సిన్‌ తీసుకునే వెలుసుబాటు కల్పించారు. 45-59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్య ధృవీకరణ పత్రంతో వ్యాక్సిన్‌ తీసుకోవచ్చన్నారు.

ఒకవేళ వైద్య ధృవీకరణ పత్రం లేకపోతే.. ఇతర ఆధారాలు చూపితే వ్యాక్సినేషన్‌ ఇస్తారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)