‘బోధన్‌లోని 7 అడ్రస్‌లతో 72 మంది బంగ్లాదేశీయులు పాస్‌పోర్టులు పొందారు’ -ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులే కానీ వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్‌ పోలీసులను ఉటంకిస్తూ సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

‘‘బోధన్‌ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని కమిషనర్‌ సజ్జనార్‌ వివరించారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మీర్జా అక్రమంగా ఆధార్‌ కార్డులు జారీ చేయించగా, మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్‌లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు.

ఈ కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్‌ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించగా ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్‌ చేశారు.

ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా, ముగ్గురు శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు... సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్‌ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌ ఔట్‌ సర్క్యులర్స్‌ జారీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు’’ అని సాక్షి కథనం పేర్కొంది.

కుటుంబం కోసం చిరుత పులితో పోరాటం

కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి అతిపెద్ద సాహసం చేశారని, తన వాళ్లని రక్షించుకొనేందుకు చిరుతతోనే తలపడి గెలిచారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

కర్ణాటకలోని హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లికి చెందిన రాజగోపాల్‌ సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై భార్య, కుమార్తెతో కలిసి బైరగొండనహళ్లి కొండ ప్రాంతంలో వెళ్తుండగా చిరుత అడ్డొచ్చింది. దాన్ని చూసి అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వాహనం నుంచి భార్య, కుమార్తె కిందపడ్డారు.

అదే సమయంలో చిరుత వారిపై దాడి చేసింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోవడం ఖాయమని భావించిన రాజగోపాల్‌..వెంటనే మృగంతో తలపడ్డారు. చేతికి అందిన కర్రతో చితకబాదాడు. అది కూడా ఎదురుదాడి చేసి రాజగోపాల్‌ తల భాగాన్ని తీవ్రంగా గాయపరిచినా వెనుకంజ వేయలేదు.

చివరికి చిరుతను హతమార్చడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే చిరుత సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు తెలిపారు.

కుటుంబం కోసం చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ నిజమైన హీరో అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారని ఈనాడు కథనం వెల్లడించింది. రాజగోపాల్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

ఏకగ్రీవాలపై విచారణకు అనుమతించండి - హైకోర్టుకు ఏపీ ఎస్‌ఈసీ అభ్యర్ధన

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టును అభ్యర్థించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.

న్యాయస్థానం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా తాము చేపట్టిన విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది. గతంలో ఫామ్‌-10 లేని ఏకగ్రీవ అభ్యర్థులంతా గత శుక్రవారం కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఫామ్‌-10 తీసుకున్నారని ఎస్‌ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు ఈ కథనం పేర్కొంది.

బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేయని వారు, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్నవారు, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాలు ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపింది. వీటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎస్‌ఈసీ పేర్కొనగా, ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే అధికారం ఎస్‌ఈసీకి లేదని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది అన్నట్లు ఈ కథనం వెల్లడించింది.

ఇరు పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

సోషల్‌ యాప్స్‌లో ప్రైవసీ రక్షణ సంగతేంటి ? సత్య నాదెళ్లకు కేటీఆర్‌ ప్రశ్న

కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్‌కేర్‌ టు హిట్‌ రిఫ్రెష్‌' అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు.

వైద్యరంగంపై కరోనా ప్రభావం, భవిష్యత్తు వైద్య విధానాలు, స్టార్టప్‌ల పాత్ర తదితరాలపై చర్చించారు. వైద్యరంగంలో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో స్టార్టప్‌లు కీలకంగా వ్యవహరించాయని సత్య నాదెళ్ల అభినందించారు. ‘కంప్యూటింగ్‌ విత్‌ బయాలజీ’తో అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయన్నారు.

ఏ టెక్నాలజీ అయినా దాని ఫలాలు సామాన్యుడికి చేరినప్పుడే సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే చెప్తుంటారని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు ఈ కథనం పేర్కొంది.

ఐదేళ్ల కిందట హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించిన విషయాన్ని సత్యనాదెళ్ల గుర్తుచేయగా.. మరోసారి సందర్శించాలని కేటీఆర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో సోషల్మీడియాయాప్స్‌, ఫిట్నెస్ట్రాకర్స్డాటారక్షణ, గోప్యతకు ఎలాంటి చర్యలు అవసరమని కేటీఆర్‌ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన సత్య నాదెళ్ల గోప్యత మానవుడి హక్కు అని, టెక్నాలజీని లేదా ఉత్పత్తిని తయారు చేస్తున్న సంస్థలే గోప్యత, రక్షణ బాధ్యతలు తీసుకోవాలని, అది ధర్మమని అన్నారు.

ఇంటర్నెట్‌ సేఫ్టీ, ఏఐ ఎథిక్స్‌కు విధివిధానాలు సంస్థలే రూపొందించుకోవాలని, దీంతోపాటు ప్రభుత్వాలు తగిన నిబంధనలు రూపొందించాలని సత్య నాదెళ్ల అభిప్రాయపడినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)