తెలంగాణలో కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలి... వైఎస్‌ అభిమానులకు షర్మిల ప్రశ్నావళి - ప్రెస్ రివ్యూ

షర్మిల
ప్రచురణ

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసను, కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇవ్వాలని రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల వైఎస్‌ అభిమానులను కోరినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జరిగిన రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ‘తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తేవాలని నా కోరిక. మీరందరూ తోడుంటే అది సాధ్యమేనని నా అని నమ్మకం’ అన్నారు.

ఈ సందర్భంగా షర్మిల జై తెలంగాణ అంటూ పలుమార్లు నినదించారు. ‘తెరాస ప్రభుత్వం ఎలా ఉంది, పేదలు ఎలా ఉన్నారు, మనవాళ్లు ఎలా ఉన్నారు... మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి?’ అని అభిమానులను అడిగారు.

సమ్మేళనంలో పాల్గొన్న వారి నుంచి షర్మిల అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మొత్తం 11 ప్రశ్నలతో నాలుగు పేజీలను అందించారు. తాజాగా తాను తీసుకున్న రాజకీయ నిర్ణయంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో తెరాసను, కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నలు అందులో ఉన్నాయి.

భాజపాను ఎదుర్కొనేందుకు కూడా సూచనలడిగారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పోరాడాల్సిన అంశాలేంటి, తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలి... వ్యవస్థాగతంగా బలపడేందుకు, కేడర్‌ను నిర్మించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలి.. తదితర విషయాలు ప్రశ్నావళిలో ఉన్నాయి. అభిమానుల వ్యక్తిగత సమాచారం.. వారు ఎదుర్కొంటున్న కష్టాలు... వాటిని తొలగించడం ఎలా అన్నవీ ఉన్నాయి.

జగన్

ఫొటో సోర్స్, facebook/ycp

ప్రత్యేక హోదా ప్రకటించండి: ప్రధాని మోదీకి జగన్‌ విజ్ఞాపన

ఉపాధి, ఆదాయ మార్గాన్నిచ్చే హైదరాబాద్‌ లాంటి నగరాన్ని రాష్ట్ర విభజనతో కోల్పోయిన రాష్ట్రం.. సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే ప్రత్యేక హోదా మాత్రమే శరణ్యమని ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఆయన కోరారు.

ప్రధాని కాంక్షిస్తున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదానికి రాష్ట్రం కట్టుబడి ఉన్నదని తెలిపారు. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన పారిశ్రామిక విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ‘‘ఇతర దేశాల్లో పారిశ్రామిక రంగానికి రెండు నుంచి మూడు శాతం వడ్డీకే రుణాలూ, యూనిట్‌కు మూడు రూపాయలకు లోపే విద్యుత్తు లభిస్తోంది. కానీ .. దేశంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ సంస్థల నుంచి 10 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు తీసుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఇలాగైతే దేశీయ తయారీ రంగం విదేశీ పోటీని ఎలా తట్టుకోగలదు?’’ అనే సందేహం జగన్‌ వ్యక్తం చేశారు.

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధానిని ఆయన కోరారు. అలాగే.. ‘‘రాష్ట్రంలో కొత్తగా16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే కేంద్రం మూడు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది. మరో 13 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది’’ అని జగన్‌ తెలిపారు.

మాస్కు ధరించిన బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మళ్లీ మహమ్మారి విజృంభణ.. ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

దేశంలో గత 24 గంటల్లో 13,993 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని.. గత 22 రోజుల్లో ఇదే అత్యధిక కేసుల సంఖ్య కావడం ఆందోళన కలిగిస్తుందని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెచ్చరించింది.

ఛత్తీస్‌గఢ్‌లో గత 24 గంటల్లో 259 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. కేరళలో శనివారం నాడు 4,854 కొత్త కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 6,112 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో గత 24 గంటల్లో పంజాబ్‌లో 383 కొత్త కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఫిబ్రవరి 13 నుంచి రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఇక్కడ 297 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం యాక్టివ్‌ కోవిడ్‌–19 కేసులలో మహారాష్ట్ర, కేరళ రెండు రాష్ట్రాల్లోనే 75.87 శాతం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు అజాగ్రత్తగా ఉన్న కారణంగానే పెరుగుదల నమోదవుతోందనే అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రతీ ఒక్కరూ కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలావుంటే.. కరోనా కారణంగా శనివారం నాడు 101 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,212కు చేరుకుందని కేంద్రం తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,06,78,048కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.27 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,43,127గా ఉంది.

జియో

ఫొటో సోర్స్, Getty Images

జియోకు షాక్‌.. పంజాబ్‌, హర్యానాలో తగ్గిన వినియోగదారులు

భారత్‌కు చెందిన అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియోకు రైతు నిరసనల ప్రభావం తాకిందని.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో జియో వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయిందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఈ రెండు రాష్ట్రాలలో రిలయన్స్‌ జియో తన సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్లు గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రారు) సమాచారం చెప్తోంది. అలాగే, ఇదే నెలలో అధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన మేజర్‌ ఆపరేటర్‌ జియో అని తేలింది.

గత ఏడాది డిసెంబర్‌ చివరినాటికి పంజాబ్‌లో 1.25 కోట్ల మంది వినియోగదారులున్నారు. అయితే అంతకుముందు నెల నవబంర్‌లో ఈ వినియోగదారుల సంఖ్య 1.40 కోట్ల మంది ఉండగా.. 25 లక్షల మంది జియోకు దూరమయ్యారు. ఈ విధంగా పంజాబ్‌లో అధిక సంఖ్యలో వినియోగదారులను కోల్పోవడం జియోకు ఇది రెండో సారి కావడం గమనార్హం.

ఇక హర్యానాలో గతేడాది నవంబర్‌లో రిలయన్స్‌ జియో వినియోగదారుల సంఖ్య 94.48 లక్షల మంది ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 89.07 లక్షలకు తగ్గిపోయింది. 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్‌ జియో ఆవిర్భావం తర్వాత వినియోగదారుల సంఖ్య ఈ విధంగా గణనీయంగా పడిపోవడం గమనించాల్సిన అంశం.

వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడం జియోకు నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని రిలయన్స్‌ ఒక ప్రకటనలో సైతం పేర్కొనడం గమనార్హం.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)