You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: దక్షిణాదిలో కొత్త రకం వైరస్, తెలంగాణలోనూ ఆనవాళ్లు, ఏపీని కూడా హెచ్చరించిన కేంద్రం - ప్రెస్ రివ్యూ
తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలలో ‘ఎన్440కే’ రకం వైరస్ వేగంగా ప్రబలుతోందని, అయితే దాని తీవ్రత తక్కువగా ఉందని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు పత్రిక పేర్కొంది .
ఇక ప్రమాదకరమైన బ్రిటన్ రకం వైరస్ ‘ఈ484కే’ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఈ కథనం వెల్లడించింది. అధిక తీవ్రత ఉన్న ‘ఈ484కే’, ‘ఎన్501వై’ రకాల వైరస్‌వ్యాప్తి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నట్టు పరిశోధనలో తేలింది.
ఐసీఎంఆర్ సహకారంతో కొవిడ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్‌పై సీసీఎంబీ పరిశోధన జరుపుతోంది. గత ఏడాది కేరళలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన నాటి నుంచే సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించింది.
అప్పటి నుంచి వెలుగుచూసిన ఐదువేల రకాల జన్యుపరివర్తనలపై లోతైన అధ్యయనం చేసింది. పరిశోధకులు కరోనా జన్యువులలో తేడాలను గుర్తించగలిగారు.
మొదట్లో దేశంలో రెండు రకాల వైరస్ ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబలిన వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలలో విస్తరిస్తున్న వైరస్‌కు తేడా ఉన్నట్టు తెలిపారు.
దక్షిణాదిలో ఉన్న వైరస్‌ను ‘క్లేడ్‌ఏ3ఐ’గా, ఉత్తరాది రాష్ట్రాలలో ని వైరస్‌ను ‘క్లేడ్‌ఏ2ఏ’గా నిర్ధరించారు.
దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ల తీవ్రత అంతగా లేకపోయినా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, మహారాష్ట్ర, కేరళలలో మాస్క్‌లను ధరించకుండా నిర్లక్ష్యం చేసి విచ్చలవిడిగా తిరగడం వల్ల పరిస్థితి మళ్లీ చేయి దాటుతున్నదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.
మహమ్మారి మళ్లీ వస్తోంది- కేంద్రం హెచ్చరిక
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోందని, సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించించినట్లు ఈ కథనం తెలిపింది. కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి.
కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కోవిడ్-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.
ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు.
వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత కోవిడ్ నిబంధనలు పాటించకపోతే సెకండ్ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
హైదరాబాద్‌లో హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, అతని వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే మూడు నెలలపాటు డ్రైవింగ్ చేసే వ్యక్తి లైసెన్స్ రద్దు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు ప్రారంభించారని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
రెండోసారి తనకు ఉన్నా లేకున్నా వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే మాత్రం శాశ్వతంగా లైసెన్స్ రద్దును అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారని ఈ కథనం పేర్కొంది.
ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు లేఖలు రాసేందుకు సమాయత్తం పోలీసులు అవుతున్నారని తెలిపింది. దీనిని ఆచరణలోకి తీసుకొచ్చే ముందు మోటార్ వెహికల్ సవరణల చట్టం–2019, సెక్షన్ 206 (4) ద్వారా హెల్మెట్ లేని వాహనదారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అవగాహన కలిగించేలా వీడియో చిత్రాలు చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
అలాగే వాహనాలు ఎక్కువగా ఆగే ట్రాఫిక్ జంక్షన్లలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించి జాగృతం చేస్తున్నారు.
మరోవైపు గత ఏడాది హెల్మెట్ లేని 18,50,000 మంది (వాహనదారులు, పిలియన్ రైడర్లు)కి ఈ–చలాన్లు జారీ అయినట్లు ఈ కథనం తెలిపింది. గతేడాది జరిగిన 625 రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మృతి చెందారు.
వీరిలో అత్యధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే మరణించారని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి.
మృతుల్లో చాలామంది పిలియన్ రైడర్లే ( వెనక కూర్చున్న వ్యక్తి ) ఉండటంతో హెల్మెట్ ధరించే అంశాన్ని కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసు అధికారులు నిర్ణయించారని సాక్షి కథనం వెల్లడించింది.
ఏకగ్రీవాలపై 23 వరకు విచారణ వద్దన్న ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు నిర్ధరిస్తూ ఎన్నికల అధికారులు ప్రకటన చేసి ఫామ్-10(ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇచ్చే ధృవీకరణ పత్రం) ఇచ్చిన స్థానాల్లో ఈ నెల 23 వరకు అధికారులు/ఎన్నికల సంఘం ఎలాంటి విచారణ జరపవద్దని హైకోర్టు స్పష్టం చేసినట్లు ఈనాడు ఒక కథనం ఇచ్చింది.
ఒకవేళ ఇలాంటి స్థానాల్లో ఇప్పటికే విచారణ జరిపినా దాని ఫలితాలు, చర్యలను ప్రకటించవద్దని ఆదేశించింది. బెదిరింపులు, ఇతర కారణాలతో నామినేషన్లు వేయలేక పోయినవారు ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ఇలాంటి ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ నెల 20లోపు నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈసీ ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన కొందరు ఎంపీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యామమని, ఫామ్-10 కూడా ఇచ్చారని, ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టులో వాదించారు.
ఒకసారి ఎన్నికైనట్లు ప్రకటించాక దాన్ని రద్దు చేయాలంటే ఎన్నికల ట్రైబ్యునల్‌లో ఈసీ పిటిషన్ దాఖలు చేయాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్లు వారు గుర్తు చేశారు.
ఫిర్యాదులపై విచారణ జరపాలని మాత్రమే తాము కోరామని, ఈ దశలో ఈ ఆదేశాలపై పిటిషన్ వేయడానికి వీల్లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ఈ నెల 18న ఉత్తర్వులు ఇచ్చి, 20కల్లా నివేదిక ఇవ్వాలంటూ హడావుడి పెట్టాల్సిన అవసరం ఏముందన్న హైకోర్టు విచారణను ఆపాల్సిందిగా ఆదేశించిందని ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)