నరేంద్ర మోదీ ఫొటోను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో -ప్రెస్ రివ్యూ

అంతరిక్షంలోకి ప్రధాని ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ఇస్రో ప్రయోగించనున్న ప్రైవేటు ఉపగ్రహాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తొలిసారి దేశీయ ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది.

ఇందులోని ఓ ఉపగ్రహంలో ప్రధాని మోదీ ఫొటోతో పాటు భగవద్గీతను, 25 వేల మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారని కథనంలో చెప్పారు.

ఈ నెల 28న పీఎ్‌సఎల్‌వీ వాహక నౌక ద్వారా సతీశ్‌ ధావన్‌ ఉపగ్రహం(ఎస్డీ శాట్‌) అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రంపై ఉత్సాహాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఇండియా సంస్థ ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేసింది.

''మేం తయారు చేసిన తొలి ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లనుండడంతో ఉత్కంఠగా ఉంది. మా మిషన్‌ పూర్తయిన తర్వాత అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు పంపాలని కోరాం.

వారం రోజుల్లోనే 25 వేల మంది పంపారు. ఇందులో 1000 పేర్లు విదేశీయులవి. చెన్నైలోని ఓ పాఠశాల తన విద్యార్థులందరి పేర్లనూ పంపింది.

అంతరిక్ష శాస్త్రంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం'' అని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో శ్రీమతి కేసన్‌ తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.

ఇతర దేశాల్లో అంతరిక్ష పరిశోధనా సంస్థలు వారికి పవిత్రమైన బైబిల్‌ లాంటి గ్రంథాలను పంపాయని.. అదే తరహాలో మనకు అత్యంత పవిత్రమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించామని కేసన్‌ చెప్పారు.

ప్రధాని మోదీ ఫొటో, దానిపై ఆత్మనిర్భర్‌ మిషన్‌ అని రాసి పంపనున్నట్లు వెల్లడించారు.

ఉపగ్రహం కింది భాగంలో ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌, సైంటిఫిక్‌ సెక్రటరీ ఆర్‌.ఉమామహేశ్వరన్‌ పేర్లు కూడా రాసినట్లు తెలిపారు.

ఇస్రో చరిత్రలో భారతీయ స్టార్ట్‌ప్‌లు తయారు చేసిన ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ఇదే తొలిసారి అని పత్రిక చెప్పింది.

ఈ నెల 28న పీఎఎస్‌ఎల్‌వీ-సీ51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన ఉపగ్రహంతో పాటు భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన సతీశ్‌ ధావన్‌, ఆనంద్‌, యూనిటీశాట్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

సమీక్షలో సీఎం జగన్

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

మధ్య తరగతికి తక్కువ ధరలో ఇళ్ల స్థలాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య తరగతికి తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు అందించాలని నిర్ణయించినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు అందించే పథకంలో భాగంగా.. తొలి విడతలో 12 పట్టణాల్లో 18 లేఅవుట్లు అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఆయా నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన కనీసం 25 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్‌టౌన్‌ల రూపకల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారని పత్రిక చెప్పింది.

పనులు ప్రారంభించిన 18 నెలల్లోగా లే అవుట్‌ సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇందుకు భూములిచ్చిన వారికి, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా పట్టణాల చుట్టూ రింగ్‌రోడ్లు నిర్మించి, వాటి చుట్టూ స్మార్ట్‌టౌన్స్‌ లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా అధికారులు సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచారు.

'మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు స్థలాలు ఇవ్వడం.. నిరంతర ప్రక్రియ. అర్హులు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా స్థలాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలి. ఆ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులోకి తేవాలి. కొంత భూనిధి (ల్యాండ్‌బ్యాంక్‌)ని సిద్ధం చేసుకోవడం వల్ల కొత్త దరఖాస్తుదారులపై భారం పడకుండా తక్కువ ధరకే స్థలాలు ఇచ్చేందుకు వీలవుతుంది. వివాదాలు, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో కూడిన స్థలాల్ని ఇవ్వాలి' అని జగన్‌ సూచించారని ఈనాడు రాసింది.

కర్ణాకట రేషన్ కార్డ్

ఫొటో సోర్స్, ahara.kar.nic.in

టీవీ, ఫ్రిజ్, బైక్ ఉంటే రేషన్ కట్-కర్ణాటక ప్రభుత్వం

రేషన్ కార్డుల మంజూరు విషయంలో కర్ణాటక ప్రభుత్వం కొత్త నిబంధనల అమలుకు సిద్ధమైందని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

రేషన్‌ కార్డుల పంపిణిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతగా టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్‌ కార్డును నిరాకరించాలని నిర్ణయించింది.

బీపీఎల్‌ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్‌ కత్తి స్పష్టం చేశారు.

సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్‌ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారని పత్రిక రాసింది.

ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.

1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే వక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్‌ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు.

మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్‌ కత్తి హెచ్చరించారు.

ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

టీవీ, ఫ్రిజ్‌ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని సాక్షి వివరించింది.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

కేవైసీ కాల్స్ పేరుతో, అమ్మాయిలను ఎరగా వేసి...

కేవైసీ వీడియోకాల్స్‌ ముసుగులో జరిగే సైబర్ నేరాలు హైదరాబాద్‌లో పెరుగుతున్నాయని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకొనేలోపు, నేరగాళ్లు మరోమార్గాన్ని ఎంచుకొని ఖాతాలు లూటీ చేస్తున్నారు.

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) ముసుగులో బ్లాక్‌మెయిల్‌ దందా పెరిగిపోయింది. పేటీఎం కేవైసీ కోసమంటూ గుర్తుతెలియని యువతులు వీడియోకాల్‌ చేసి అశ్లీలంగా మాట్లాడి, నగ్నంగా కనిపిస్తూ కవ్వించే ప్రయత్నం చేస్తారు.

అప్పటికే ఆ కాల్‌ను రికార్డు చేసిన నేరగాళ్లు.. 'ఆమె అశ్లీలంగా మాట్లాడుతుంటే మందలించాల్సిందిపోయి, అసభ్యకరంగా మాట్లాడుతావా. చిన్న పిల్లను చేసి గలీజు పనిచేస్తావా. ఆమె మైనర్‌. నీపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు పెడుతాం'అని హెచ్చరిస్తారు.

కేసులు వద్దనకుంటే అడిగినంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. చాలామంది పరువు భయంతో లక్షలు ముట్టజెప్తున్నారని పత్రిక రాసింది.

ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో నమోదవుతున్నాయి. రాజస్థాన్‌ సైబర్‌ ముఠాలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోందని పత్రిక రాసింది.

పేటీఎం ముసుగులో మోసాలపై ప్రజలు ఎక్కువగా స్పందించకపోవడంతో సైబర్‌ నేరగాళ్లు ఎయిర్‌టెల్‌ కేవైసీ అంటూ కొత్త మోసానికి దిగారు.

'కేవైసీని అప్‌డేట్‌ చేసుకోనందున మీ సిమ్‌ సేవలు మరికొద్దిసేపట్లో నిలిచిపోతున్నాయి. సేవలు కొనసాగాంటే ఈ నంబర్‌ను సంప్రదించండి' అని ఓ ఫోన్‌నంబర్‌ మెసేజ్‌చేస్తారు.

ఎవరైనా ఫోన్‌చేస్తే.. 'నేను ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ను మాట్లాడతున్నా. మీ కేవైసీ అప్‌డేట్‌ కాలేదు. మీ సిమ్‌కార్డు సేవలు కొనసాగాలంటే రిమోట్‌ యాప్‌లైన క్విక్‌ సపోర్టు, టీమ్‌వ్యూయర్‌, ఎనీడెస్క్‌లో ఏదో ఒకటి డౌన్‌లోడ్‌ చేసుకోండి' అని చెప్త్తారు.

అది డౌన్‌లోడ్‌ చేసుకోగానే బాధితుడి ఫోన్‌లో జరిగే ప్రతి వ్యవహారం సైబర్‌ మోసగాడు తన ఫోన్‌స్క్రీన్‌పై చూస్తుంటాడు.

ఆపై ఎవరికైనా రూ.10 రీచార్జి, లేదంటే ఏదైనా పేమెంట్‌ చేయమని కోరుతారు. ఆ సమయంలో నేరగాడు ఖాతా వివరాలు, పిన్‌ నంబర్‌ తెలుసుకొని.. ఖాతాను ఖాళీచేస్తాడు.

ఇలా మోసపోయిన 11 మం ది ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారని పత్రిక రాసింది.

సిమ్‌కార్డుకు కేవైసీ అప్‌డేట్‌ అవసరం లేదు. సిమ్‌ తీసుకునప్పుడే సంబంధిత కంపెనీ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటుంది.

వాట్సాప్‌లో అశ్లీల, అభ్యంతకరమైన వీడియోల్లో మాట్లాడేందుకు గుర్తుతెలియని యువతులు ప్రయత్నించినప్పుడు ఆ కాల్‌ను కట్‌ చేయండి. వాటికి దూరంగా ఉండాలని పత్రిక వివరించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)