కోవిడ్- 19 వైరస్ చైనాలోని ల్యాబ్‌ నుంచి లీకైందని చెప్పలేం: ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు- News Reel

పీటర్ బెన్ ఎంబారెక్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పీటర్ బెన్ ఎంబారెక్
ప్రచురణ

కోవిడ్- 19 వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైంది, దీని మూలాలేమిటి అని అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ప్రయోగశాల నుంచీ వైరస్ బయటకు వచ్చుంటుందనే వాదనను నిపుణులు తోసిపుచ్చారు.

చైనాలోని వూహాన్‌లో ఉన్న ఒక ప్రయోగశాల నుంచీ ఈ వైసర్ లీకై ఉంటుందన్న అనుమానానికి తావు లేదని, అలా జరగడానికి అవకాశాలు దాదాపుగా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మిషన్ అధిపతి పీటర్ బెన్ ఎంబారెక్ తెలిపారు.

వైరస్ మూలాలను కనుగొనేందుకు మరింత కృషి అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ-చైనా మిషన్ ముగింపు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

హూబే ప్రాంతంలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. అప్పటినుంచీ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, 23 లక్షల మరణాలు నమోదయ్యాయి.

ఈ పరిశోధనలో కొన్ని కొత్త విషయాలు తెలిశాయని డాక్టర్ ఎంబారెక్ తెలిపారు.

మనుషులకు సోకే ముందు ఈ వైరస్ జంతువులలో పుట్టి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, అది ఎలా జరిగిందన్న విషయంలో స్పష్టమైన సమాచారం లేదు.

కరోనా వైరస్ వ్యాప్తి గబ్బిలాల సహజ క్షేత్రాల నుంచీ మొదలై ఉండొచ్చని పరిశోధనలో తేలింది. కానీ వూహాన్‌లోనే అది జరిగి ఉండకపోవచ్చు అని డాక్టర్ ఎంబారెక్ తెలిపారు.

2019 డిసెంబర్‌లో తొలిసారిగా కరోనావైరస్ అధికారికంగా కేసులు నమోదు కావడానికి ముందు ఈ వైరస్ వూహాన్‌లోనే ఎక్కడో ఉండి ఉంటుందని అనడానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని నిపుణులు తెలిపారు.

చైనా హెల్త్ కమిషన్ నిపుణులు లియాంగ్ వానియన్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 వుహాన్‌లో బయటపడడానికి ముందు ఇతర ప్రాంతాలలో కూడా ఉండి ఉండొచ్చని అన్నారు.

వైరస్ మూలాలు కనిపెట్టడానికి మరికొంత పరిశోధన అవసరం అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని పరిశీలించిన తరువాత.. ఈ వైరస్ ప్రయోగశాల నుంచే లీక్ అయ్యుంటుందనే సిద్ధాంతానికి తెరదించారు.

జంతువుల నుంచి వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ కచ్చితమైన ఆధారాలు లేవు.

మరో వైపు, దిగిమతి చేసుకున్న ఫ్రోజెన్ ఫుడ్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయేమోనని పరిశోధిస్తున్నారు.

కరోనా వైరస్ మూలాలు కనుగొనేందుకు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

#INDvENG

ఫొటో సోర్స్, Icon Sportswire

తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం

చెన్నైలో జరిగిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 227 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

భారత్ 420 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టింది. అయితే 192 రన్లకే వెనుదిరగాల్సి వచ్చింది. జట్టును ముందుకు నడిపించేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ప్రయత్నించారు. ఆయన 72 పరుగులు సాధించారు. అయితే, వరుసగా వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ఇంగ్లండ్ బౌలర్లు లీచ్ నాలుగు వికెట్లు, ఆండర్సన్ మూడు వికెట్లు తీశారు.

కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఏకంగా 578 పరుగులు చేసింది. భారత్ 337 రన్లు కొట్టింది. దీంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేనాటికి ఇంగ్లండ్ 241 పరుగుల లీడ్‌లో ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ చక్కటి బౌలింగ్ వేయడంతో 178 రన్లకే ఇంగ్లండ్‌ను కట్టడి చేయగలిగారు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ వల్ల భారత్ లక్ష్యం 420గా మారింది.

జేమ్స్ ఆండర్సన్

ఫొటో సోర్స్, Stu Forster

ఫొటో క్యాప్షన్, జేమ్స్ ఆండర్సన్

నాలుగో రోజు ఆట పూర్తయ్యేనాటికి 39 పరుగులతో భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. అయితే, ఐదో రోజు భారత్‌కు కలిసిరాలేదు. వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన చతేశ్వర్ పుజారా 15 పరుగులకే అవుట్ అయ్యారు.

శుభమ్ గిల్ కాస్త మెరుగైన ప్రదర్శనతో అర్ధ శతకం కొట్టారు. అయితే, జేమ్స్ ఆండర్సన్ ఆయన వికెట్ తీశారు. ఆజింక్య రహానే ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన రిషబ్ పంత్ కేవలం 11 రన్లు మాత్రమే కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఖాతా తెరవలేకపోయాడు. కోహ్లీతో కలిసి ఆర్ అశ్విన్ క్రీజులో నిలబడగలిగాడు. వీరిద్దరూ కలిసి 54 రన్లు కొట్టారు. అయితే, దీనిలో అశ్విన్ కొట్టింది తొమ్మిది రన్లే.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)