తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో శీఘ్రదర్శనం టిక్కెట్లు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Sridhr Raju
తిరుమల వెళ్లే భక్తులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో శ్రీవారి శీఘ్రదర్శనం టికెట్లు కొనుగోలు చేయవచ్చని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది.
ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు.
రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు.
తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్‌వైజర్లు సహాయం చేస్తారు.
అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుందని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర
దేశంలో వరసగా నాలుగో రోజు బంగారం ధర తగ్గిందని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
గురువారం రూ.322 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన(24 క్యారెట్లు) పుత్తడి రూ. 47,135 పలికింది.
అటు వెండి ధర కూడా రూ. 68వేల దిగువకు పడిపోయింది. రూ. 972 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,170గా ఉంది.
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి బలపడటంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1825 డాలర్లు, ఔన్సు వెండి 26.61డాలర్లు పలికిందని ఈనాడు చెప్పింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
బ్రాండ్ కింగ్ విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ కెప్టెన్ బ్రాండ్ వాల్యూ దేశంలోని సెలబ్రిటీలు అందరికంటే టాప్‌లో ఉందని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా నాలుగో సంవత్సరమూ అత్యంత విలువైన సెలెబ్రిటీలలో అగ్రస్థానంలో నిలిచాడు.
మొత్తం రూ. 1733 కోట్ల బ్రాండ్ విలువతో విరాట్ 2020 సంవత్సరంలోనూ తన టాప్ స్థానం నిలబెట్టుకున్నాడు.
డఫ్, ఫెల్ప్స్ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్‌కు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కాయి.
టాప్-10లో సినిమాయేతర రంగం నుంచి కోహ్లీ ఒక్కడే ఉన్నాడు.
మిగతా తొమ్మిది మంది సినీ స్టార్లలో ఇద్దరు నటీమణులు దీపికా పదుకోన్ (5వ), ఆలియా భట్(6వ)కు చోటు లభించింది.
గత ఏడాది కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ కోహ్లీ బ్రాండ్ విలువ చెక్కు చెదరలేదని ఆంధ్రజ్యోతి రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను మనమే తొలగించచ్చు
ఫేస్‌బుక్‌లో ఎవరైనా మన పేరిట నకిలీ ఖాతా సృష్టిస్తే దానిని మనం తొలగించవచ్చని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక వార్త ప్రచురించింది.
ఫేస్‌బుక్‌లో ఎవరైనా మన పేరుతో నకిలీ అకౌంట్‌ను సృష్టిస్తే.. దానిని డిలీట్ చేసే ఆప్షన్‌ను కల్పించారు.
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు మన పేర నకిలీ అకౌంట్లు సృష్టిస్తూ.. అందులో 'నాకు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య అవసరాల కోసం డబ్బు కావాలి. ఫలానా బ్యాంక్ ఖాతాకు పంపండి' అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ పోస్ట్‌ను చూసిన స్నేహితులు, బంధువులు.. 'మన వాడు నేరుగా అడగడానికి మొహమాటపడి ఫేస్‌బుక్ ద్వారా అడుగుతున్నాడు' అని భావించి డబ్బులు పంపుతున్నారు.
ఈ విషయాన్ని మనం గ్రహించేలోపే జరగాల్సిన మోసం జరిగిపోతుంది. ఇటువంటి మోసాలను అరికట్టేందుకు మన పేరిట సృష్టించిన ఫేక్ అకౌంట్‌ను తొలగించే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించింది.
మీ అసలు ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వివరాలను తెలియజేయడం ద్వారా మన బంధువులు, మిత్రులను అప్రమత్తం చేయవచ్చని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ తెలిపారని నమస్తే తెలంగాణ చెప్పింది.
సైబర్ నేరగాళ్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేరు మీద ఓ నకిలీ ఖాతాను సృష్టించారు. ఈ ఖాతాలో సైబర్ నేరగాడు 'నమస్కార్ జీ' అని పెట్టాడు.
ఈ ఖాతాను పరిశీలించిన ఏసీపీ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన ఏసీపీ శివకుమార్.. విషయాన్ని ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే వారు సూచించిన విధంగా ఆ నకిలీ ఖాతా ఐడీలో 20 మందితో డిలీట్ పోస్టు అని పెట్టించి దాన్ని తొలగించారు.
నకిలీ ఖాతాను తొలగించండిలా..
- ఆ నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.
- దానిపై క్లిక్‌చేస్తే రిపోర్టు ఆప్షన్ వస్తుంది.
- అందులో దాదాపు 20 మంది 'ఈ పోస్టును డిలీట్ చేయండి' అని పెట్టాలి.
- వెంటనే ఫేసుబుక్ ఆ ఖాతాను తొలగించేస్తుంది
అని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పంచాయితీ: మహారాష్ట్ర ఎస్ఈసీకి అసెంబ్లీ జైలు శిక్ష విధించినప్పుడు ఏం జరిగింది?
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బడ్జెట్ 2021: కరోనా మహమ్మారితో భారత ఆర్థికవ్యవస్థకు ఎంత నష్టం... ఏంటి పరిష్కారం?
- దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























