కరోనావైరస్: తెలంగాణలో తొలి దశలో 75 లక్షల మందికి టీకా.. దుష్ఫలితాలు వస్తే ఏం చేయాలంటే.. - ప్రెస్‌రివ్యూ

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక డోసులో 0.5 మి.లీ. వంతున కోవిడ్‌ టీకాను అందజేయనున్నారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

టీకాల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల వైద్యాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

ప్రతి లబ్ధిదారుడికి ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.

ద్రవరూప కోవిడ్‌ టీకాను సూదిమందు(ఇంజక్షన్‌) ద్వారా అందజేస్తారు. వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో, అత్యంత శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశాల్లోనే భద్రపర్చాలని, ఎండలో ఉంచనేవద్దని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. టీకా కేంద్రాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది.

టీకా ఎంతో సురక్షితమైనదని, అర్హులంతా తప్పక తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. దుష్ఫలితాల (సైడ్‌ ఎఫెక్ట్స్‌) పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోను నోడల్‌ అధికారిని నియమించింది. దుష్ఫలితాలు తలెత్తితే సత్వర చికిత్సకు 14 రకాల మందులు, వస్తువులతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనుంది.

దుష్ఫలితాలను ఆరోగ్యశాఖ మూడు రకాలుగా విభజించింది. 1. టీకా వేశాక నొప్పి, వాపు, జ్వరం వంటివి రావడం. 2. గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పడిపోవడం, ఆయాసం వంటివి. 3. ఉన్నట్టుండి పరిస్థితి విషమించడం, అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం.

టీకా పొందే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వర వైద్యమందించేలా సన్నద్ధమవ్వాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. దుష్ఫలితాల సమాచారాన్ని వెంటనే కోవిన్‌ యాప్‌లో పొందుపర్చాలని సూచించింది. సాధారణ, స్వల్ప తీవ్రతగల దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స అందించేలా వైద్యులు, నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

పరిస్థితి విషమిస్తున్నట్లు భావిస్తే.. సత్వరమే సమీపంలోని పెద్దాసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి టీకా పంపిణీ కేంద్రానికి అనుసంధానంగా ఇప్పటికే కొన్ని జిల్లా, బోధనాసుపత్రులను ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 64 ఆసుపత్రులను సర్కారు ఎంపిక చేసింది.

రాష్ట్రంలో తొలిదశలో 75 లక్షల మందికి టీకాలందించడానికి 10వేల టీకాల పంపిణీ కేంద్రాలను నెలకొల్పాలని వైద్యఆరోగ్యశాఖ భావించింది. వీరిలో ముందుగా వైద్యసిబ్బందికి 2 వారాల పాటు, తర్వాత పోలీసు, పురపాలక, రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా ముందుగా 1500 టీకా పంపిణీ కేంద్రాలనే ఏర్పాటు చేయనుంది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఆరు రాష్ర్టాలపై బర్డ్‌ఫ్లూ ప్రభావం

దేశంలో ఆరు రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, కేరళ, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయని కేంద్రం వెల్లడించింది.

కేంద్రం ప్రకటించిన బర్డ్‌ఫ్లూ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేవు.

దిల్లీలోని డీడీఏ పార్కులో 16 పక్షులు మృతిచెందాయి. దీంతో వాటి నుంచి నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

మరోవైపు హరియాణాలోని పంచకుల జిల్లాలో జరిపిన పరీక్షల్లో పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది. 1.60 లక్షల పక్షులను మూకుమ్మడిగా చంపడానికి రాష్ట్ర సర్కార్‌ నిర్ణయించింది.

పీకే

ఫొటో సోర్స్, MANISH SAANDILYA/BBC

సీఎం జగన్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

తిరుపతి ఉప ఎన్నికపై విగ్రహాల ధ్వంసం ఘటనల ప్రభావం లేకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చర్చించినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

శుక్రవారం తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌ను ప్రశాంత్ కిశోర్ కలిశారు.

త్వరలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో జగన్, పీకే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

విగ్రహాల ధ్వసంపై సీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ కమిటిని ఏర్పాటు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కిశోర్‌తో సీఎం భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫస్ట్‌ ఇంటర్‌ తరగతులు 18 నుంచి

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం తరగతులను ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఆరో తరగతి విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని సురేశ్ చెప్పారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్‌ తొలి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పారు.

ఇంటర్‌ తొలి ఏడాది అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, అదే రోజు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ మరుసటి రోజు తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)