You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెన్నెలకంటి ఇకలేరు... 'మాటరాని మౌనమిది అని రాసిన కవి మౌనంగా వెళ్ళిపోయార'న్న భువనచంద్ర
తెలుగు సినిమా పాటలు, మాటల రచయిత వెన్నెలకంటి మంగళవారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 64 ఏళ్లు.
వెన్నెలకంటిగా సుపరిచితులైన వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. సాహిత్యం పట్ల ఆసక్తితో శతకాలు రాసేవారు. సినిమా పాటలు, మాటల రచయితగా ఆయన వేయికి పైగా చిత్రాలకు పని చేశారు. మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు రెండు వేల పాటలు రాశారు.
తెలుగు సినిమా పాటల రచయితగానే కాకుండా తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేయడంలో రచయితగా ఆయన ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. వెన్నెలకంటి దాదాపు 1,000కి పైగా చిత్రాలకు పని చేశారు.
నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి 1986లో తీసిన 'శ్రీరామచంద్రుడు' సినిమాలో వెన్నెలకంటి 'చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...' పాట రాశారు. అదే ఆయన తొలి సినీ గీతం. ఆ తరువాత అన్నాచెల్లెలు, మురళీకృష్ణుడు వంటి సినిమాలతో స్వల్పకాలంలోనే లిరిక్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మహర్షి చిత్రంలోని 'మాటరాని మౌనమిది...' పాట ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఆదిత్య-369, తీర్పు, క్రిమినల్, శీను, టక్కరిదొంగ, మిత్రుడు, రాజా, చెట్టుకింద ప్లీడరు, నాయకుడు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఏప్రిల్ 1 విడుదల, స్వాతికిరణం వంటి ఎన్నో చిత్రాలకు ఆయన రాసిన పాటలు ప్రజాదరణ పొందాయి.
నాయకుడు, పంచతంత్రం, దశావతారం, సత్యభామ వంటి ఎన్నో చిత్రాలను ఆయన తమిళం నుంచి తెలుగులోకి అనువదించారు. ఆయనకు ఇద్దరు కుమారులు శశాంక్ డబ్బింగ్ రైటర్‌గా, రాకేందు మౌళి గీత రచయితగా తండ్రి మార్గంలోనే పయనిస్తున్నారు.
'అద్భుతమైన మేధస్సు, అసాధారణ ధారణ... క్షణంలో నేలకొరిగిపోయాయి'
- సినీ గీత రచయిత భువనచంద్ర
వెన్నెలకంటి మరణం వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరమైన విషయం. ఇది ఊహకు అందనిది.వెన్నెల కంటి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. నేను ఏనాడూ ఆయన్ను పేరు పెట్టి పిలవలేదు. ఎప్పుడూ అన్నయ్యా అని పిలిచేవాడు. నేనెప్పుడూ బుల్లబ్బాయ్ అనేవాడిని.
నిన్న కూడా మాట్లాడాలనుకున్నాం. కొత్త సంవత్సరంలో మనం కలవలేదన్నయ్యా.. మీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు ఏ పేరుతో పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడే అవకాశమే లేనంత, నా మాటకు అందనంత దూరం వెళ్లిపోయాడు.
34 సంవత్సరాల సినీ జీవితంలో ఏ సభలు, కార్యక్రమాలు, ఏ పండుగలు అయినా, ఎక్కడ సమావేశాలు జరిగినా ఇద్దరం కలిసేవాళ్లం. అందరూ మమ్మల్ని మీరిద్దరూ లేకపోతే సభకు నిండుదనమే రాదు అనేవారు. అలా ఇద్దరం కలిసి ఎన్నో సార్లు కలిసి ఒకే వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నాం. ఆయతో నేను, నాతో ఆయన కలిసి వెళ్లేవాళ్లం.
ఈ రోజు వెన్నెలకంటి పడుకుని, నిద్రపోతున్నట్టే ఉన్నాడు. నమ్మకం కలగడం లేదు. కానీ, తప్పదు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చివరికి ఖాళీ చేతులతో వెళ్లిపోవల్సిందే, ఇవాళ తను చెప్పింది కూడా అదే.
అన్నయ్యా నా పేరు, బంధాలను వదిలి వెళ్లిపోతున్నానని చెబుతున్నట్టే ఉంది.
మనిషి జీవితం కన్నతల్లి కడుపు నుంచి నేలతల్లి ఒడిలోకి చేరుకునేవరకూ ఇద్దరు తల్లుల మధ్య ముగుస్తుంది. వెన్నెలకంటి జీవితం 64 ఏళ్లకే ముగిసిపోయింది.
అద్భుతమైన మేధస్సు, అసాధారణ జ్ఞాపకశక్తి , అలవోకగా పాట రాయగలిగిన సమర్థత అన్నీ క్షణంలో నేలకు ఒరిగిపోయాయి.
విచిత్రం ఏంటంటే వెన్నెలకంటి తన చివరి క్షణంలో భార్యతో మాట్లాడుతూనే ఒరిగిపోయాడు. ఇలా ఒరిగిపోయాడే అని ఎదురింట్లోనే ఉన్న డాక్టరును పిలిచి చూపించారు. ఆయనకు 'మాసివ్ హార్టెటాక్ వచ్చుంటుందని, పల్స్ అందడం లేదు' అని ఆయన చెప్పారు.
అది వెన్నెలకంటి అదృష్టమా, అందరి దురదృష్టమో తెలీడం లేదు. ఎవరినీ కష్టపెట్టలేదు, బాధపెట్టలేదు. నవ్వుతూనే వెళ్లిపోయారు.
వెన్నెలకంటి నాకంటే ఒక ఏడాది సీనియర్. 34 ఏళ్ల సినీ జీవితంలో 3 వేల పైచిలుకు పాటలు రాశారు. కవితా సంకలనాలు వేశారు. రాజశ్రీలాగే వెన్నెలకంటి కూడా ఎన్నో డబ్బింగ్ సినిమాలు చేశారు.
సినిమా రంగంలో తన తనయులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు వెన్నెలకంటి ఇద్దరి విజయాలనూ చూశారు. ఇప్పుడు చెప్పాపెట్టకుండా సడన్‌గా వెళ్లిపోయారు.
వెన్నెలకంటి మృతి చాలా బాధాకరం. ఒక తల్లికి పుట్టకపోయినా, మా ఇద్దరికీ విడదీయరాని అన్నదమ్ముల సంబంధమే. "మాటరాని మౌనమిది" అనే అద్భుతమైన పాటరాసిన వెన్నెలకంటి మాట కూడా చెప్పకుండానే వెళ్లిపోయాడు.
నిన్న పొద్దునే మేం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ సాయంత్రం 4.30కు ఆయన హఠాత్తుగా దూరమయ్యాడు. తన మరణంతో నన్ను కూడా ఏం చేయాలో తెలీని మౌనంలో పడేశాడు.
ఇవి కూడా చదవండి:
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)