కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య రెండు అంశాలపై కుదిరిన సయోధ్య.. తదుపరి భేటీ జనవరి 4వ తేదీన - BBC Newsreel

ఫొటో సోర్స్, REUTERS / DANISH SIDDIQUI
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతుల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరో దఫా చర్చలు బుధవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగాయి.
ఈ భేటీలో ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, నాలుగు అంశాలకు గాను రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
తదుపరి భేటీ జనవరి 4వ తేదీన జరుగనుంది.
విద్యుత్ చట్టం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెడితే జరిమానాలు.. ఈ రెండు అంశాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్యా సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది.
అయితే, మూడు వ్యవసాయ చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి చట్టబద్ధత అనే మరో రెండు రైతుల డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అర్జెంటీనా: 14 వారాల లోపు అబార్షన్లకు అనుమతి
గర్భం దాల్చిన 14 వారాలలోపు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతిస్తూ తెచ్చిన బిల్లుకు అర్జెంటీనా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అతి కఠినమైన అబార్షన్ చట్టాలున్న దేశాలలో అర్జెంటీనా ఒకటి.
ఈ బిల్లుకు అనుకూలంగా 38 మంది సెనేటర్లు ఓటు వేయగా, 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.
అర్జెంటీనాలో ఇప్పటి వరకు కేవలం అత్యాచారం జరిగినప్పుడు గాని, లేదా తల్లి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నప్పుడు మాత్రమే గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి లభించేది.
ఈ బిల్లును చాంబర్స్ ఆఫ్ డిప్యూటీ గత నెలలో ఆమోదించారు.

ఫొటో సోర్స్, Reuters
లాటిన్ అమెరికాలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కాథలిక్ చర్చి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ బిల్లును తిప్పి కొట్టమని సెనేటర్లకు పిలుపునిచ్చింది.
లాటిన్ అమెరికాలో ప్రభావవంతమైన దేశాల్లో ఒకటైన అర్జెంటీనా తీసుకున్న నిర్ణయం మిగిలిన దేశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ చట్టాన్ని అమలులోకి తేవాలని దీనిని సమర్ధించే ఉద్యమకారులు ఆశించారు.
అర్జెంటీనాలోని గ్రీన్ వేవ్ ఉద్యమకారులు ఈ బిల్లును తీసుకుని రావడంలో ప్రధాన పాత్ర పోషించారు.
1921 నాటి అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా సంవత్సరాల తరబడి ఉద్యమకారులు చేసిన ప్రచార ఫలితమే ఈ బిల్లు.
ఈ బిల్లుకు చట్టబద్దత తీసుకుని రావడంతో, చిలీ, బ్రెజిల్ లాంటి దేశాలలో కూడా ఈ చట్టాన్ని తిరగరాసే అవకాశం ఉంటుంది అని దక్షిణ అమెరికా కరెస్పాండంట్ కేటీ వాట్సన్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌కు అనుమతి.. జనవరి 4 నుంచి వాడుకలోకి
యూకేలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కరోనావైరస్ వ్యాక్సీన్ వాడేందుకు అనుమతి లభించింది.
బ్రిటన్‌లో భారీ స్థాయిలో తలపెట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఈ అనుమతులు నాంది పలుకుతాయి. జన జీవితం సాధారణ స్థితికి రావాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు.
ఈ వ్యాక్సీన్ ని జనవరి 4 నుంచి ఇవ్వడం మొదలు పెట్టి రానున్న వారాలలో మరింత విస్తృతం చేస్తామని బ్రిటన్ తెలిపింది.
ఈ వ్యాక్సీన్ ని ఆస్ట్రాజెనెకా ఉత్పత్తి చేస్తోంది. యూకే 100 మిలియన్ డోసుల వ్యాక్సీన్ ఆర్డరు చేసింది. ఇది 50 మిలియన్ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి సరిపోతుంది.
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ని 2020 మొదట్లోనే తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిని ఏప్రిల్ లో వలంటీర్ల మీద పరీక్ష చేశారు. అప్పటి నుంచి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కొన్ని వేల మంది పై పరీక్ష చేశారు.
మహమ్మారి తలెత్తక ముందు వరకు ఎన్నడూ ఊహించనంత వేగంగా ఈ వ్యాక్సీన్ ని రూపొందించారు.
ఇది యూకేలో ఆమోదం పొందిన రెండవ వ్యాక్సీన్. దీని కంటే ముందు డిసెంబరులో ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ వాడేందుకు అనుమతి లభించింది. దీనిని తొలి సారిగా మార్గరెట్ కీనన్ అనే మహిళకు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వ్యాక్సీన్ ని 600,000 మందికి పైగా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19: భారత్‌లో 20కి పెరిగిన కొత్త కరోనావైరస్ కేసులు
బ్రిటన్‌లో మొదటగా బయటపడ్డ కోవిడ్-19 కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య భారత్‌లో 20కి పెరిగింది.
తాజాగా బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన 14 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించామని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 20కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇదివరకు నమోదై ఆరు కేసుల్లో.. మూడు కేసులు బెంగళూరు నిమ్‌హన్స్, రెండు కేసులు హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఒక కేసు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిర్ధరించారు. ఆరుగురినీ ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పాకిస్తాన్‌లోనూ మూడు కొత్త రకం కోవిడ్- 19 కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బ్రిటన్ నుంచి కరాచీకి వచ్చినవారిలో ఈ రకం వైరస్‌ను గుర్తించారు.
ఇంతకుముందు బ్రిటన్ నుంచి స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ దక్షిణ కొరియా తదితర దేశాలకు వెళ్లిన వారిలో ఈ కొత్త రకం వైరస్ బయటపడింది.
ఈ కొత్త రకం ఇతర కరోనా వైరస్ రకాలకన్నా 50% నుంచీ 70% వేగంగా వ్యాప్తి చెందుతున్నదని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























