బిగ్ బాస్ తెలుగు సీజన్-4 విజేత అభిజీత్: ప్రెస్ రివ్యూ

Big Boss Telugu Season 4 winner abhijeet, Chiranjeevi, Akkineni Nagarjuna

ఫొటో సోర్స్, Star Maa

ప్రచురణ

తెలుగు బిగ్‌బాస్-4 ముగిసిందని, అభిజిత్ విజేతగా నిలిచాడని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్‌ నిలిచాడు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం సినీ తారల సందడి మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సీజన్‌-4 విజేత అభిజీత్‌కు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందించారు. ఈ సీజన్‌లో ఫైనలిస్ట్‌లుగా అఖిల్‌, అభిజీత్‌, సోహైల్‌, అరియానా, హారిక నిలవగా.. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు గట్టిపోటీ ఇచ్చారు.

ఫైనలిస్ట్‌లుగా నిలిచిన వారిలో నుంచి హారిక మొదట బయటకు రాగా, ఆ తర్వాత అరియానా, సోహైల్‌ బయటకు వచ్చారు.

ఆ తర్వాత అభిజీత్‌-అఖిల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో విజేతగా ఎవరు నిలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న అభిజీత్‌ను విజేతగా ప్రకటించారు.

హౌస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి తోటి హౌస్‌ మేట్స్‌తో కలిసిపోయి ఉండటం, బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లను మైండ్‌ గేమ్‌తో ఆడడం వంటివి అభిజీత్‌కు అభిమానులను పెంచడమే కాకుండా విజేతగానూ నిలబెట్టాయని ఈనాడు రాసింది.

Fastag at toll gates

ఫొటో సోర్స్, NPCI

కొత్త సంవత్సరంలో, దేశంలో కొత్త నిబంధనలు

2021 ప్రారంభం నుంచి దేశంలో కొత్త నిబంధనలు అమలు కానున్నాయని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించంది.

కొత్త ఏడాదితోపాటు కొన్ని కొత్త రూల్స్ కూడా రానున్నాయి. వ‌చ్చే జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌లాంటి వాటిలో నిబంధ‌న‌లు మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఫాస్టాగ్ (FASTag) త‌ప్ప‌నిస‌రి: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర రోడ్డు, ర‌వాణా, హైవేల మంత్రిశ్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 1, 2017కు ముందు త‌యారైన అన్ని నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఈ మేర‌కు కేంద్ర మోటారు వాహ‌నాల చ‌ట్టం, 1989లో స‌వ‌ర‌ణ‌లు చేశారు.

2. చెక్కుల పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌: జ‌న‌వ‌రి 1, 2021 నుంచి చెక్కుల‌కు పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇందులో భాగంగా రూ.50 వేల‌కు మించిన చెక్కుల విష‌యంలో కీల‌క వివ‌రాల‌ను మ‌రోసారి నిర్ధారించాల్సిన అవ‌స‌రం రావ‌చ్చు. చెక్కు జారీ చేసే వ్య‌క్తి చెక్కు నంబ‌ర్‌, తేదీ, పేయీ పేరు, అకౌంట్ నంబ‌ర్‌, అమౌంట్ వంటి వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది.

3. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితి పెంపు: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితిని పెంచుతూ ఆర్బీఐ ఈ మ‌ధ్యే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ.2 వేల ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచింది.

4. త్రైమాసిక జీఎస్టీ రిట‌ర్న్ ఫైలింగ్ సౌక‌ర్యం: దేశ‌వ్యాప్తంగా ఉన్న సుమారు 94 ల‌క్ష‌ల మంది చిన్న వ్యాపార‌స్థులు ఇక సులువ‌గా, మూడు నెల‌ల‌కు ఓసారి గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిట‌ర్న్స్ ఫైల్ చేసే సౌక‌ర్యం క‌ల‌గ‌నుంది. ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మ‌కాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వ‌స్తాయి.

5. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే 0 త‌ప్ప‌నిసరి: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15 నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే క‌చ్చితంగా ముందు 0 యాడ్ చేయాల్సిందేన‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ) స్ప‌ష్టంచేసింది.

6. టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు పెరుగుతాయ్‌: కొత్త ఏడాదితో పాటు టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు కూడా కొత్త‌వి రానున్నాయి. అన్ని త‌యారీ కంపెనీలు ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయని నమస్తే తెలంగాణ వివరించంది.

ఎడ్లు, నాగలితో చేను దున్నుతున్న రైతు

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో నేటి నుంచి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి మళ్లీ పాత పద్ధతిలో జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 19న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతోపాటు మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా.. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌లో త్వరలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

ధరణి ద్వారా ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతోపాటు, మ్యుటేషన్‌ వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

పంట పొలాలు

ఏపీలో సమగ్ర రీసర్వే

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి సమగ్ర రీసర్వే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

పొలం గట్ల తగాదాలు, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేందుకు ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది.

పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్‌ అందజేస్తారు.

అనంతరం ఇక్కడ సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు.

మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది.

తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేసేలా ప్రభుత్వం కాల వ్యవధితో ప్రణాళిక రూపొందించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)