రైతుకు వజ్రం దొరికింది.. వేలం వేస్తే రూ.60 లక్షలు పలికింది : ప్రెస్ రివ్యూ

వజ్రం
ప్రచురణ

వజ్రం దొరకడంతో మధ్యప్రదేశ్‌లో ఒక రైతు లక్షాధికారి అయ్యారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు ఒక్కసారిగా లక్షాధికారి అయ్యారు.

14.90 క్యారెట్ల వజ్రం లభించడంతో ఆయన పంటపండింది.

మంగళవారం నిర్వహించిన వేలంలో ఈ వజ్రం రూ.60.60 లక్షలు పలికిందని నమస్తే తెలంగాణ రాసింది.

పన్నా జిల్లాలోని కృష్ణ కల్యాణ్‌ పూర్‌కు చెందిన లక్ష్మణ్‌ యాదవ్‌ అనే రైతుకు గత నెలలో ఒక గనిలో ఈ వజ్రం లభించింది.

వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన పన్నా జిల్లా వజ్రపు గనులకు ప్రసిద్ధి అని పత్రిక వివరించింది.

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్

అమిత్ షాతో ఏపీ సీఎం భేటీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సహకారం కోసం ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారని సాక్షి కథనం ప్రచురించింది.

జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు పెరిగిపోతుందని తెలిపారు. సవరించిన అంచనా వ్యయం మేరకు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సీఎం వినతిపత్రం అందచేశారని సాక్షి రాసింది.

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ రాత్రి 8.35 నుంచి 9.40 గంటల వరకు అమిత్‌ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని, ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు సూచించాలని ముఖ్యమంత్రి కోరారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనుల ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.

నిర్వాసిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని, ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు.

భూసేకరణ, పునరావాసం ఖర్చు గణనీయంగా పెరిగిందని వివరించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం వివరించారని సాక్షి రాసింది.

యువరాజ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ రీఎంట్రీ

క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్నారని ఈనాడు కథనం ప్రచురించింది.

గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తిరిగి మైదానంలో రానున్నారు.

దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఈనాడు పేర్కొంది.

తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ కోసం మంగళవారం పంజాబ్‌ ప్రకటించిన 30 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్‌ జాబితాలో అతనికి చోటు దక్కింది.

పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) కార్యదర్శి పునీత్‌ బాలి విజ్ఞప్తి మేరకు ఆ జట్టు తరపున దేశవాళీ టోర్నీల్లో బరిలో దిగాలని యువీ నిర్ణయించుకున్నారు.

అందుకు బీసీసీఐ అనుమతి కోసం అతను ఎదురుచూస్తున్నారు. అతను మొహాలిలోని పీసీఏ స్టేడియంలో సాధన చేస్తున్నారు.

మరోవైపు బీసీసీఐ విధించిన నిషేధం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లో బయటపడ్డ భారత వెటరన్‌ పేసర్‌ శ్రీశాంత్‌ మళ్లీ పోటీ క్రికెట్‌ ఆడనున్నారు.

ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ కోసం ప్రకటించిన 26 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్‌ జాబితాలో కేరళ క్రికెట్‌ సంఘం అతనికి చోటు కల్పించిందని ఈనాడు వివరించింది.

నాడీ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

సబ్బులు, టూత్ పేస్టులతో నాడీ వ్యవస్థకు నష్టం-ఐఐటీహెచ్

సబ్బులు, టూత్ పేస్టుల వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని ఐఐటీహెచ్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

నిత్యం వాడే సబ్బులు, టూత్‌ పేస్ట్‌లు, డియోడరెంట్లలో ఉపయోగిస్తున్న సూక్ష్మజీవ సంహారక రసాయనం ‘ట్రైక్లోసాన్‌’.. శరీరంలోని నరాల వ్యవస్థను దెబ్బతీస్తుందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌) శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

సబ్బులు, టూత్‌పే‌స్టులు, డియోడరెంట్లలో సూక్ష్మక్రిములు పెరగకుండా అడ్డుకోవడం ద్వారా వాటి నిల్వ కాలాన్ని పెంచేందుకు ‘ట్రైక్లోసాన్‌’ వంటి రసాయనాలను వాడుతారు.

కొన్ని వైద్య పరికరాలు, చివరకు వంటపాత్రల తయారీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు.

ఈ రసాయనాన్ని అతి తక్కువ పరిమాణంలో ఉపయోగించినా శరీరంలోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడే జన్యువులు, ఎంజైమ్‌లు తీవ్రంగా దెబ్బతింటాయి.

అంతేకాకుండా ఈ రసాయనం నరాల్లోని కణజాలాన్ని సైతం దారుణంగా దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనామికా భార్గవ్‌ సారథ్యంలోని పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది.

ప్రభుత్వం అనుమతించిన మొత్తంలో 500వ వంతు ట్రైక్లోసాన్‌ రసాయనం ఉపయోగించినా నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని పరిశోధక బృందం సభ్యుడు పి.నరసింహ వెల్లడించారు.

ఈమేరకు వివరాలతో వీరు రూపొందించిన పరిశోధనా పత్రం బ్రిటన్‌ నుంచి వెలువడే ‘కెమోస్ఫియర్‌’ జర్నల్‌లో ప్రచురితమైందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)