కో-విన్ వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కరోనా వ్యాక్సిన్ - కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, PA Media
కరోనా వ్యాక్సినేషన్ కోసం త్వరలో కో-విన్(కొవిడ్-వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని, టీకా వేసుకోవాలనుకునేవారు ఈ వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం పేర్కొన్నదంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారినే టీకా వేసుకోవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు సూచించింది. స్పాట్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొవిడ్ వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇలా ఏదేని ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు వృద్ధులకు టీకా ఇవ్వాలని కేంద్రం సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడినవారిని గుర్తించాలని కోరింది. తొలిదశ టీకా పంపిణీలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం భావిస్తున్నది.
మిగతా మార్గదర్శకాలు..
- వ్యాక్సిన్ క్యారియర్, వ్యాక్సిన్ సీసా, ఐస్‌ప్యాక్‌లకు సూర్యరశ్మి తగలకుండా చూడాలి.
- వ్యాక్సిన్ తీసుకున్నవారిని 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలి.
- వసతులను బట్టి ఒక టీకా కేంద్రంలో రోజుకు 100-200 మందికి టీకా వేస్తారు.
- సాధ్యమైనంత వరకు ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన టీకాను కేటాయించాలని కేంద్రం తెలిపిందని ఈ కథనంలో రాసారు.

ఫొటో సోర్స్, TSRTCHQ/facebook
ఆర్టీసీ ఛార్జీల రౌండ్ ఫిగర్
ఆర్టీసీ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేస్తూ..ఇప్పటికే బస్ చార్జీలు ఎక్కువున్నాయని బాధ పడుతున్న ప్యాసింజర్ల మీద చిల్లర సమస్య పేరుతో మరోసారి భారం వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైందని వెలుగు ప్రత్రికలో ప్రచురించారు.
మెదక్ బస్ డిపో పరిధిలో ప్రయోగాత్మకంగా సోమవారంనుంచి ఈ విధానం అమలు చేసారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనతో ఉన్నారు. మెదక్‌నుంచీ కొల్చారం వరకు ప్రస్తుతం ఆర్డినరీ బస్ చార్జీ రూ.13 కాగా, చిల్లర సమస్య వస్తోదని చెప్పి ఆ ఛార్జీని రూ.15 చేసారు. ఇకపై రూ.2 ఎక్కువ కట్టాల్సిందే. వచ్చిపోతే అదనంగా రూ.4 ఖర్చు చేయాల్సిందే. మెదక్‌నుంచీ కౌడిపల్లికి రూ. 21 టికెట్‌ను రూ.20గా మార్చకుండా రూ.25కు పెంచడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మెదక్‌నుంచీ నర్సాపూర్ వరకూ రూ.38 ఉండగా దానిని రూ.40 చేసారు. చార్జీల రౌండ్‌ఫిగర్ చేసే విధానాన్ని త్వరలో రాష్ట్రమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల ప్యాసింజర్ల మీద లక్షల్లో భారం పడనుందని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కమల్ హాసన్, ఒవైసీ పొత్తు?
ఏఐఎంఐఎం పార్టీ బీహార్‌లో ఐదు స్థానాల్లోనూ, ఇటీవల జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 44 స్థానాల్లోనూ గెలిచి ఉత్సాహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది తమిళనాడులో ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికలపై ఒవైసీ దృష్టి సారించారంటూ ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 25 స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తోంది. తమిళనాడులో ఉన్న పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పాల్గొనాలని ఓవైసీ యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఎంఐఎం కమల్‌హాసన్ పార్టీ (మక్కల్ నీది మయ్యమ్)తో, నామ తమిళర్ వంటి పార్టీలతోనూ జట్టు కట్టాలని చూస్తోంది. దీనికోసం తమిళనాడులోని ఎంఐఎం నేతలతో సోమవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఒవైసీ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రంలో వెల్లూర్, రాణిపేట్, తిరుపత్తూర్, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నింటిలో పోటీ చేసేందుకు మజ్లిస్ సిద్ధమవుతున్నట్లు సమాచారమని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, instagram/samantharuthprabhuoffl
పెళ్లి తరువాత కెరీర్ ప్లాన్ చేసుకోలేదు - సమంత
‘పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే..దానికి అదృష్టమే కారణమ’ని సమంత చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి తాజాగా ఓ టాక్‌షోలో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది అంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
‘‘కథానాయికల కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించాలనో.. ఆ అపోహను తొలగించాలనో.. నేనేమీ నా కెరీర్‌ను ప్లాన్ చేసుకోలేదు. నిజానికి ‘పెళ్లి తర్వాత నాకు ఇక అవకాశాలు రావ’నే అనుకున్నా. దానికి సిద్ధపడే పెళ్లి చేసుకున్నా. కానీ, అదృష్టం నావైపు ఉంది. అందుకే పెళ్లి తర్వాత ‘రంగస్థలం’ వచ్చింది. ‘మహానటి’ లాంటి గొప్ప సినిమా చేశా. ‘ఓ బేబీ’తో మెప్పించా. ఇంకా అద్భుతమైన పాత్రలు పోషించగలుగుతున్నా. ఇందతా నాకు దొరికిన అదృష్టమనే చెప్పాలి’’ అని ఆ షోలో సమంత చెప్పినట్లు ఈ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎయిర్ ఇండియా మళ్లీ తన పాత యజమాని టాటా దగ్గరకు చేరుకోనుందా...
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- సూడాన్ ఖల్వాస్: విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడిలో బీబీసీ రహస్యం చిత్రీకరణ
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























