వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 అరంగేట్రంపై నిపుణుల భిన్నాభిప్రాయాలు, ఎవరేమన్నారంటే..

క్రికెట్, భారత్, టీమిండియా, వైభవ్ సూర్యవంశీ

ఫొటో సోర్స్, Charles McQuillan/Getty Images

ఫొటో క్యాప్షన్, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ(ఫైల్ ఫోటో)పై క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 తుది జట్టులోనూ యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం వాయిదా పడినట్టైంది.

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ ఆదివారం(జూన్ 28) సాయంత్రం, బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్‌లో ప్రారంభమైంది. ఈసారి కూడా భారత 'ప్లేయింగ్ ఎలెవన్'‌లో సూర్యవంశీకి చోటు దక్కలేదు.

అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందువరకూ రెండో మ్యాచ్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనే చర్చ పెద్దయెత్తున నడిచింది.

ఈ విషయంలో క్రికెట్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మొదటి మ్యాచ్‌లో వైభవ్‌కు చోటు దక్కకపోవడంపై కెప్టెన్ శ్రేయస్ ఏమన్నాడు?

క్రికెట్, భారత్, వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

ఫొటో సోర్స్, Indranil MUKHERJEE / AFP via Getty Images)

ఫొటో క్యాప్షన్, సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం వస్తుందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

తొలి టీ20లో వైభవ్‌ను ఆడించకపోవడం గురించి మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు.

"వైభవ్ సూర్యవంశీ గొప్ప ఆటగాడే. కానీ, మా జట్టులో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు బాగా రాణించారు. అందుకే మేం వారిపై నమ్మకం ఉంచుతున్నాం.

సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు కచ్చితంగా అవకాశం లభిస్తుంది" అని శ్రేయస్ అయ్యర్ నవ్వుతూ అన్నాడు.

సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని మ్యాచ్ ప్రారంభం కాకముందే భారత జట్టు బ్యాటింగ్ కోచ్ శితాన్షు కోటక్ కూడా సంకేతాలిచ్చాడు.

నిపుణులు ఏమంటున్నారు?

క్రికెట్, భారత్, వైభవ్ సూర్యవంశీ

ఫొటో సోర్స్, Ashley Allen-ICC/ICC via Getty Images

ఫొటో క్యాప్షన్, సూర్యవంశీకి అవకాశం వస్తుందని, కానీ అప్పుడే కాదని ఆకాశ్ చోప్రా అన్నారు. (ఫైల్ ఫోటో)

ఈరోజు మ్యాచ్‌లో వైభవ్‌కు స్థానం దక్కడం కష్టమేనని క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.

''నేనైతే ఇప్పుడు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను జట్టు నుంచి తొలగించే ఆలోచనే చేయను. రొటేషన్ గురించి కూడా ఆలోచించను. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికీ వైభవ్ సూర్యవంశీ ఎవరో, అతను ఎంత స్పెషలో తెలుసు. అతనికి కూడా సమయం వస్తుంది. కానీ, అది ఇప్పుడే కాదు. ప్రస్తుతానికి జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు'' ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పారు.

వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున అతన్ని తుదిజట్టులోకి తీసుకోవాలని మరో మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అన్నారు.

''అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకు ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఒకవేళ అతన్ని ఆడించాలనుకుంటే సంజూతో కలిసి ఓపెనింగ్ చేయించి, అభిషేక్ శర్మను వన్ డౌన్‌లో పంపించవచ్చు'' అని కైఫ్ సలహా ఇచ్చాడు.

వైభవ్‌ను బ్రాడ్‌కాస్టర్లు, ఈసీబీ, పాత కామెంటేటర్లు మరీ ఎక్కువగా పొగుడుతున్నారని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా అభిప్రాయపడ్డారు.

''వరల్డ్ కప్ గెలిచిన ఓపెనర్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను జట్టు నుంచి తీసేయలేం. వైభవ్ గొప్ప ప్రతిభావంతుడు. అతను ఒక్కసారి జట్టులోకి వస్తే శాశ్వత సభ్యుడిగా మారిపోతాడు. అయితే, ఐర్లాండ్‌తో జరిగే రెండో టీ20 లో వైభవ్‌కు ఆడే అవకాశం రావొచ్చు'' అని ఆయన అన్నారు.

'జట్టులో ప్రత్యేక స్థానం ఎవరికీ ఉండదు'

క్రికెట్, భారత్, వైభవ్ సూర్యవంశీ, రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

మొదటి మ్యాచ్‌లో వైభవ్‌ను పక్కన పెట్టడాన్ని భారత మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా సమర్థించారు.

తన యూట్యూబ్ చానెల్ 'ఆష్ కీ బాత్' లో అశ్విన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

''వైభవ్ సూర్యవంశీ చాలా మంచి ప్లేయర్. అతన్ని నేనూ చాలాసార్లు మెచ్చుకున్నాను. కానీ, మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది ఒక క్రికెట్ టీమ్.. ఒక ప్లేయర్ కోసం మొత్తం టీమ్‌ను తయారు చేయరు. గౌతమ్ గంభీర్ చెప్పినట్లు జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం. ఇక్కడ సూపర్ స్టార్ కల్చర్ ఉండదు'' అని అన్నాడు.

''సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కలిసి ఓపెనింగ్ చేస్తారు. వరల్డ్ కప్‌లో సంజూ బాగా ఆడారు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని బయట కూర్చోబెట్టి వైభవ్‌ను ఆడిస్తే అసలు దాన్ని 'టీమ్ గేమ్' అని ఎలా అంటాం? కొన్నిసార్లు మ్యాచ్ ఆడకుండా బయట కూర్చోవడంలో కూడా ఒక అర్థం ఉంటుంది. వైభవ్ బయట కూర్చుని, జట్టుకు సేవ చేస్తూ కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు" అని అశ్విన్ అన్నారు.

కేవలం 'ఎవరో బాధపడతారు' అనే కారణంతో జట్టులోని అత్యంత ప్రతిభావంతుడైన, ఉత్సాహవంతుడైన ఆటగాడిని పక్కన పెట్టడం సరైనది కాదని సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)