Ind vs Ire టీ20 సిరీస్: టీమిండియా ఫైనల్ స్క్వాడ్‌లో సూర్యవంశీకి చోటు దక్కక పోవడంపై సీనియర్లు ఏమన్నారు?

ఫొటో సోర్స్, Charles McQuillan/Getty Images
ఆదివారం బెల్‌ఫాస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై ఐర్లాండ్ ఒక పరుగు తేడాతో గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది.
2023 తర్వాత భారత్‌కు టీ20 సిరీస్‌లో ఇదే తొలి ఓటమి.
శుక్రవారం భారత్‌పై 34 పరుగుల తేడాతో గెలిచిన ఐర్లాండ్ టీట్వంటీ ప్రపంచ కప్ చాంపియన్‌లకు రెండోసారి షాక్ ఇచ్చింది.
ఐర్లండ్ విజయంలో జయ్ ముంద్రా, మాథ్యూ హాలార్డ్ కీలక పాత్ర పోషించి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
చివరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గెలవడానికి చివరి రెండు బంతుల్లో ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి.

అయితే చివరి ఓవర్‌లో హ్యారీ టెక్టర్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా ఔటయ్యాడు. చివరి బంతికి ముందు పడిన ఈ వికెట్ ఐర్లాండ్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించింది.
ఏ ఫార్మాట్‌లోనైనా 12 మ్యాచ్‌ల తర్వాత భారత్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. టీ20 ఫార్మాట్‌లో ఐర్లాండ్ భారత్ మీద తొమ్మిదో ప్రయత్నంలో ఈ విజయాన్ని సాధించింది.
రెండో టీ20లో భారత్ పుంజుకుంటుందని భావించినా అలా జరగలేదు. వైభవ్ సూర్యవంశిని తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత అభిమానులు నిరాశ పడ్డారు. భారత కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
గౌతమ్ గంభీర్‌పై ట్రోలింగ్
ఐర్లాండ్‌తో సిరీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
గౌతమ్ గంభీర్‌ను హేళన చేస్తూ ఐస్‌లాండ్ క్రికెట్ ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది.
"మేము గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ సిబ్బందిలో చేర్చుకోవాలని అననుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. అతని ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. భారత ఆటగాళ్లతో ఐర్లాండ్‌కు వెళ్లి అలాంటి ఫలితాలు సాధించడానికి నిజంగా అసాధారణమైన సామర్థ్యం అవసరం" అని ఆ మెసేజ్‌లో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
వైభవ్‌కు ఇకనైనా అవకాశం ఇవ్వాలి
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ భారత క్రికెటర్లు నిరాశ వ్యక్తం చేశారు.
"వైభవ్ సూర్యవంశీ ఫామ్‌ను బట్టి చూస్తే అతడిని రెండు మ్యాచ్‌ల్లో ఆడించి ఉండవచ్చు. ఎందుకంటే ఒక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయించి, రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను కింది వరుసకు పంపి అతని స్థానంలో సంజూ శాంసన్‌ను చేర్చి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు" అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"వైభవ్ కేవలం 10-15 పరుగులు మాత్రమే చేయొచ్చు. మనం యువ ఆటగాళ్లను ప్రయత్నించాలనుకుంటే ఈ రెండు మ్యాచ్‌లే ఉత్తమ అవకాశం. ఇంగ్లండ్‌తో జరిగే మొట్టమొదటి మ్యాచ్‌లోనే వారిని ఆడించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్‌లను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీని ఆడించాలి. ఒకవేళ ఓపెనర్ల తర్వాత వైభవ్‌ను ఆడించాల్సి వచ్చినా అతడిని ఆడించాల్సిందే" అని గావస్కర్ అన్నారు
భారత తుది జట్టు ఎంపికను భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా తప్పుబట్టారు.
"11 మంది ఉత్తమ ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తే అందులో సూర్యవంశీ పేరు ఉండాల్సింది. ఇది ప్రపంచ కప్ గెలిచిన జట్టు. సూర్యవంశీ వేచి చూడాలని చెబితే దాన్నే అమలు చేయాలి. కప్ గెలిచిన రోహిత్ శర్మను పక్కన పెట్టి వేరే యువ ఆటగాడికి ఆ అవకాశం ఇచ్చారు. ఇదే వాదనతో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు" అని మొహమ్మద్ కైఫ్ చెప్పారు.
"మీరు భారత క్రికెట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కంటే గొప్ప భవిష్యత్ ఆశావాది ఎవరుంటారు? వైభవ్ సూర్యవంశీ పరుగులు సాధిస్తున్నాడు. అతను ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆరెంజ్ క్యాప్ విజేత. అతను క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం ఒక సిక్సర్ దూరంలో ఆగిపోయాడు. అతను ఉత్తమ పదకొండు మందిలో ఉండాల్సింది" అని కైఫ్ అభిప్రాయ పడ్డారు.
"వైభవ్ సూర్యవంశీని కేవలం బెంచ్‌కే పరిమితం చేయడానికే ఐర్లాండ్ పంపారా? లేక మీ టీవీ తెరలపై ఈ సిరీస్‌ను మార్కెట్ చేయడానికా? ఒక జనరేషన్‌లో ఒక్కసారి మాత్రమే కనిపించే ప్రతిభావంతుడు మీ దగ్గర ఉన్నప్పుడు, అతను రాణించడానికి ప్రతి అవకాశమూ లభించేలా మీరు చూడాలి. ఇది చాలా వింతగా ఉంది!" అని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
"ఐర్లాండ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. వారి క్రికెట్‌కు సరిగ్గా ఇలాంటి విజయమే అవసరం. ఈ ఫలితం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి క్రికెట్‌ను మరింత బలోపేతం చేస్తుంది" అని ఐర్లాండ్ జట్టు గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రశంసలు గుప్పించారు.
"ఈ రెండు మ్యాచ్‌లు కనువిప్పు కలిగించాయి. విభిన్న పరిస్థితుల్లో, ఎలాంటి పిచ్ మీదైనా సునాయాసంగా 250 పరుగుల చేయగల ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు కూడా త్వరగా అలవాటు పడలేకపోయారు. అందుకే ఆటగాళ్లు కాలానుగుణంగా 160-170 పరుగుల మ్యాచ్‌లు ఆడాలి. అటువంటి మ్యాచ్‌లు మంచివి, ఎందుకంటే అవి బ్యాట్స్‌మెన్‌లను నిజంగా పరీక్షిస్తాయి" అని హర్షా భోగ్లే తన మెసేజ్‌లో రాశారు
"శభాష్ ఐర్లాండ్! ఐరిష్ క్రికెట్‌కు ఇది ఎంత గొప్ప రోజు!" మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆటగాళ్ల ప్రదర్శన, కెప్టెన్సీపై ఎవరేమన్నారు?
"ఐపీఎల్‌లో '24 క్యారెట్ల' ఫ్లాట్ పిచ్‌లపై ఆడటానికి భారత ఆటగాళ్లు అలవాటు పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడల్లా, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు" అని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను అప్పుడే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదన్నారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.
"కేవలం రెండు మ్యాచ్‌లతోనే అతని ప్రతిభను నిర్ణయించడం తొందరపాటు అవుతుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాతే దీనిపై ఏదైనా చెప్పవచ్చు" అని గావస్కర్ చెప్పారు.
భారత్ ఓటమి అనూహ్యమైనదని అభివర్ణించారు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
"బ్యాట్స్‌మెన్ మారలేదు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను మాత్రమే జట్టు నుండి తొలగించారు. ప్రపంచ కప్ చాంపియన్ జట్టు ఈ విధంగా ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐర్లాండ్ లాంటి జట్టు తొలిసారిగా భారత్‌ను ఓడించడం అంటే జట్టులో మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అర్థం. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి" అని చోప్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మీ దగ్గర బుమ్రా .. మా దగ్గర ముంద్రా
ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జట్టును 8 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం చేసింది. హ్యారీ టెక్టర్ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు.
భారత సంతతికి చెందిన ఐర్లాండ్ బౌలర్ జై ముంద్రాకు శుక్రవారం జరిగిన మ్యాచ్ మొదటిది. ఈ మ్యాచ్‌తోనే అతను ఐర్లాండ్ జట్టులో అడుగు పెట్టాడు. జట్టులో కొత్త హీరోగా అవతరించాడు.
ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.
ఆ తర్వాత అతను అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్లు తీయడంతో, భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది.
ముంద్రా భారత్‌లో జన్మించినప్పటికీ, 2021లో చదువుల కోసం డబ్లిన్‌కు వెళ్లాడు. రాజస్థాన్‌లోని టోంక్ అతని స్వస్థలం. ముంద్రా విజయాన్ని భారత్‌లోని ఆయన కుటుంబం సెలబ్రేట్ చేసుకుంది.
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు జై ముంద్రా రూపంలో ఐర్లాండ్ సమాధానం దొరికిందని చాలామంది అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























