వైఎస్ జగన్: రైతులకు ఇచ్చినట్లే పశుపోషకులందరికీ కిసాన్ క్రెడిట్ కార్టులు -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, APCM/FB
పశు పోషకులు అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.
రైతులకు ఇచ్చినట్టే, రాష్ట్రంలోని పశు పోషకులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొన్నవారికి ఈ కార్డులు ఉపయోగపడతాయని చెప్పారు.
గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రూ.1,860కోట్ల విలువైన 2.49లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే ’జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
సామాజికంగా, ఆర్థికంగా మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ఇలాంటివి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
‘‘ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. అక్కాచెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. వారి ముఖాల్లో సంతోషం నిలిచిఉండేలా కృషి చేస్తున్నాం. 31లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా వారిపేరుతోనే రిజస్ట్రేషన్ చేస్తాం’’ అని జగన్ తెలిపారని పత్రిక రాసింది.
వ్యవసాయంతోపాటు పశువుల పెంపకం చేపడితే రైతు కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందన్నారు.
‘‘అమూల్‌తో ఒప్పందంలో భాగంగా రూ.3,500కోట్ల విలువైన 4.69 లక్షల ఆవులు, గేదెల యూనిట్లు మహిళలకు అందిస్తామని" కూడా సీఎం చెప్పారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని సవతి పిల్లలను చంపిన మొదటి భార్య
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రెండో భార్య ద్వారా అతడికి పుట్టిన పిల్లలను హత్య చేసిన మొదటి భార్య తర్వాత ఆత్మహత్య చేసుకుందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
తనని కాదని రెండో పెళ్లి చేసుకున్నందుకు భర్తపై కక్ష పెంచుకుందా ఇల్లాలు. భర్త తనకు దూరమవుతున్నాడనే బాధను తట్టుకోలేక...కట్టుకున్న వాడు చేసిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక కొన్నేళ్లుగా కుమిలిపోయిన ఆమె తన కోపాన్ని మరో రూపంలో తీర్చుకుందని ఈ కథనంలో రాశారు.
పెళ్లిరోజు నాడే భర్త రెండో భార్యకు పుట్టిన ఇద్దరు కుమార్తెలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది.
నల్గొండ పట్టణంలో గురువారం ఆ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ పట్టణం జూబ్లిహిల్స్ కాలనీకి చెందిన మేకల ప్రదీప్, ప్రసన్నరాణి (45) దంపతులు ఐసీడీఎస్ శాఖలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రదీప్ భువనగిరి జిల్లాలో, ఆయన భార్య మునుగోడులో విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి 1999లో వివాహమైంది. కుమారుడు (20), కుమార్తె (15) ఉన్నారు.
ఎనిమిదేళ్ల క్రితం ప్రదీప్ నల్గొండ పట్టణానికే చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మేఘన (6), రుచరి (4) కుమార్తెలు.
మూడేళ్ల క్రితం భర్త రెండో పెళ్లి విషయం ప్రసన్నరాణి దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి తరచూ ఆమె భర్తతో, ఆయన రెండో పెళ్లి చేసుకున్న మహిళతో గొడవపడుతూ వస్తోంది.
రెండో భార్యకు భర్త నల్గొండలో ఇల్లు కట్టిస్తున్నట్టు ఇటీవల తెలుసుకుని రగిలిపోయింది. గురువారం పెళ్లిరోజు నాడే అతనిపై కక్ష తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయంత్రం పక్క కాలనీలో ఉంటున్న శాంత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు.
తన పుట్టినరోజున కేకు కోస్తున్నట్టు చిన్నారులు మేఘన, రుచరిలను నమ్మించి ఇంటికి తీసుకొచ్చింది. పడక గదిలో ఇద్దర్నీ ఉరి బిగించి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది’ అని నల్గొండ ఒకటో పట్టణ ఎస్సై వెంకట్‌రెడ్డి వెల్లడించారని ఈనాడు రాసింది.
శుభకార్యానికి వెళ్లి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చిన భర్త ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించి సమాచారమిచ్చారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రసన్నరాణి రాసిన ఆత్మహత్య లేఖను ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కష్టాలతో అప్పులు చేసిన మిల్లేనియల్స్
కరోనా కష్టాలు భారత్‌లో యువతను అప్పులవైపు నడిపించాయని ఒక బ్రిటన్ బ్యాంక్ సర్వేలో తేలినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో తలకిందులైన ఆర్థిక పరిస్థితులు మిల్లేనియల్స్‌ను అప్పుల వైపు నడిపించాయి.
దేశంలో దాదాపు సగం మిల్లేనియల్స్ (1981 తర్వాత జన్మించినవారు) ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో అధికంగా అప్పులు చేసినట్లు బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వేలో తేలిందని పత్రిక రాసింది.
ఇతర వయస్కులతో పోల్చితే రోజువారీ అవసరాలను తీర్చుకోవడంలో మిల్లేనియల్స్ తెగ ఇబ్బంది పడిపోయారని పేర్కొంది. ఈ క్రమంలోనే వారు రుణాలపై ఆధారపడాల్సి వచ్చిందని తెలిపింది.
సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 మధ్య భారత్‌సహా 12 దేశాల్లో 12వేల మంది అభిప్రాయాల ఆధారంగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ సర్వేను చేపట్టింది.
ఈ సందర్భంగా మిల్లేనియల్స్ అప్పులు ఈ రెండు నెలల్లో 44 శాతం ఎగిశాయని రుజువైంది. అయితే 45కు పైగా వయసున్నవారి రుణభారం మాత్రం 28 శాతమే పెరిగినట్లు తేలింది.
కరోనా వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తెలిపింది.
ముఖ్యంగా లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి సంఘటిత రంగంలో ఎక్కువ మంది ఉపాధిని కోల్పోయారని చెప్పింది.
అయితే ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయని, జీడీపీ అంచనాలూ క్రమంగా మెరుగవుతున్నాయని ఈ సర్వేలో తేలిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, TSRTCNalgonda/FB
జీహెచ్ఎంసీ అంతటా టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు
తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవలను జీహెచ్ఎంసీ అంతటా విస్తరించినట్లు సాక్షి దిన పత్రిక వార్త ప్రచురించింది.
కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు.
ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు.
పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్‌పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారని సాక్షి రాసింది.
అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని,
కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్‌లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు.
ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























