బీచ్‌లో నగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్ నటుడు - ప్రెస్‌రివ్యూ

మిలింద్ సోమన్

ఫొటో సోర్స్, Twitter/Milind

ప్రచురణ

బాలీవుడ్ నటుడు మిలింద్‌ సోమన్‌ తన 55వ పుట్టినరోజుని సరికొత్తగా సెలబ్రేట్‌ చేసుకున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

గోవా బీచ్‌లో ఉదయం నగ్నంగా పరిగెత్తి మిలింద్‌ సోమన్‌ ఫోటో తీయించుకున్నారు. ఈ ఫొటోను మిలింద్‌ సోమన్‌ సతీమణి అంకితా కోన్‌వార్‌ తీసింది.

ఫోటోపై నెటిజెన్లు సరదాగా మీమ్స్‌, జోక్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. యాబై ఐదేళ్ల వయసులోనూ ఐదేళ్ల పిల్లాడిగా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు.

అంకితా కోన్‌వార్‌ కూడా తన సోషల్‌ మీడియాలో మిలింద్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్: ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను

ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి విలువ ఆధారంగా పురపాలక, నగరపాలక సంస్థల్లో ఇక పన్ను విధించనున్నారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

సంస్కరణల్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

దీనిపై అధ్యయనం కోసం అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీలు ఇటీవలే ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి.

గురువారం నాటి మంత్రివర్గ సమావేశ అజెండాలో దీన్ని ఒక ప్రధానాంశంగా చేర్చారని సమాచారం.

రాష్ట్రంలోని 120 పురపాలక, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో ఇంటి అద్దె ప్రాతిపదికగా నిర్ణయించిన జోనల్‌ రేట్ల ప్రకారం ప్రస్తుతం ఆస్తి పన్ను విధిస్తున్నారు. ఇంటి పొడవు, వెడల్పు కొలతలు (మీటర్లలో) తీసుకొని మొత్తం విస్తీర్ణం ఎంతో మొదట లెక్కిస్తున్నారు.

వీటికి అప్పటికే ఆ ప్రాంతంలో అద్దె ప్రాతిపదికగా ఖరారు చేసిన జోనల్‌ రేట్లు జోడించగా వచ్చిన మొత్తాన్ని 12 నెలలకు లెక్కిస్తారు. ఈ విధంగా వచ్చిన వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ)పై కొన్ని మినహాయింపులు పోగా మిగతా మొత్తంపై 15 నుంచి 20 శాతం వరకు ఆస్తి పన్నుగా నిర్ణయిస్తున్నారు.

రాష్ట్రంలో 33 లక్షలకుపైగా ఉన్న వివిధ రకాలైన నిర్మాణాల నుంచి పురపాలక, నగరపాలక సంస్థలకు ఆస్తి పన్ను కింద ప్రస్తుతం ఏటా రూ.1,200 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కొత్తగా అమలులోకి వచ్చే పన్ను విధానంతో ఇప్పుడొస్తున్న ఆదాయం 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ట్రాఫిక్

ఫొటో సోర్స్, UGC

అంబులెన్స్‌కు ముందు పరిగెత్తి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన కానిస్టేబుల్

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి కల్పించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఓ కానిస్టేబుల్ అంబులెన్స్ ముందు పరిగెత్తారని వెలుగు ఓ కథనం ప్రచురించింది.

పరిస్థితి విషమంగా ఉన్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్ మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది. ఎటూ వెళ్లలేని పరిస్థితి.

హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించాడు.

ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ..అంబులెన్స్‌కు ముందు పరిగెత్తుతూ..ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి కల్పించాడు. దీంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకున్న ఆ వ్యక్తి ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు.

చార్మినార్

ఫొటో సోర్స్, Getty Images

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సంక్రాంతి తర్వాతే!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు ఎన్నికలు.. షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశాలున్నాయని ఓ కథనం ప్రచురించింది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి 10 వ తేదీ వరకు ఉన్నది. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న కొన్ని వర్గాల వాదనను అధికారవర్గాలు కొట్టిపారేశాయి.

పాలకవర్గం గడువు ముగియడానికి దాదాపు మూడు నెలల సమయం ఉన్నందున అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి.

హైదరాబాద్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు, బాధితులకు సహాయ చర్యలు ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి మొత్తం వాటి మీదనే ఉన్నదని తెలిపాయి.

జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా ఈ పనుల్లోనే తలమునకలై ఉన్నారని గుర్తుచేశాయి.

ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టంచేశాయి.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యవహారం ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వెళ్లలేదని, ఆయన ఇప్పటికి ఈ అంశంపై దృష్టి సారించడమే జరుగలేదని అధికారవర్గాలు ఉటంకించాయి. అందువల్ల షెడ్యూలుకన్నా ముందు ఎన్నికలు జరిగే అవకాశం లేదని పునరుద్ఘాటించాయి.

సంక్రాంతి తరువాత జనవరి చివరివారంలో షెడ్యూలు విడుదలై, ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)