తెలంగాణ: ఫుల్ బాటిల్ తాగాలనే పందెం... ప్రాణాలు తీసింది - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో స్నేహితుల మధ్య సరదా పందెం ఒక వ్యక్తి ప్రాణాలు తీసిందంటూ సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
మద్యం బాటిల్‌లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పెందెంలో ఒకరు మృతి చెందారు.
బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కాలనీకి చెందిన ఎస్ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు.
చేనులో అందరు కలిసి మద్యం తాగుతుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడికి మధ్య వాదన పెరిగి బెట్టింగ్‌కు దిగారని పత్రిక రాసింది.
ఇద్దరు సోడా, నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ సేవించారు. వాళ్లు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు ఇద్దరినీ ఇళ్లకు పంపించారు.
అయితే, సాయిలుకు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయని కథనంలో చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేష్‌గౌడ్ తెలిపారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, I&PR Telangana
తెలంగాణలో ప్రతి ఏటా దసరా తర్వాత రోజు సెలవు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ప్రతి సీఎం కేసీఆర్ కరువు భత్యం పెంచినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు దసరా ధమాకా ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం (డీఏ)ను 5.24% పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
సీఎం ఆదేశాల మేరకు.. ప్రస్తుతం 33.53% ఉన్న డీఏను 38.77 శాతానికి పెంచుతూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిందని పత్రిక చెప్పింది.
పెంచిన డీఏ 2019 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పెరిగిన మొత్తాన్ని డిసెంబర్ 1న ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. వీఆర్‌ఏలు, పార్ట్‌టైమ్ అసిస్టెంట్లకు గౌరవవేతనం రూ.100 పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇకమీదట ప్రతిఏటా దసరా పర్వదినం తర్వాతి రోజును సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు.
దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలన్న ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 26వ తేదీతోపాటు, ఇకనుంచి ప్రతి ఏడాది దసరా మరుసటి రోజును సెలవుదినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు దసరా తెల్లారి రోజు సెలవుగా దినంగా నిర్ణయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారమే ఉత్తర్వులు జారీచేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కపిల్ దేవ్‌కు గుండెపోటు, నిలకడగా ఆరోగ్యం
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
టీమ్‌ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్‌దేవ్ గుండెపోటుతో స్థానిక ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో చేరడంతో క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
అయితే శుక్రవారం అతనికి యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు కపిల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వచ్చే రెండు రోజులో డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు.
‘‘గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కపిల్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు అత్యవసర పరిస్థితుల్లో యాంజియోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లో ఇంటికి పంపే వీలుంది’’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయని పత్రికలో రాశారు.
మరోవైపు.. ‘‘నాపై ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రార్థనలు చూసి ఉప్పొంగిపోయా. ప్రస్తుతం కోలుకుంటున్నా’’ అని కపిల్ పేర్కొంటున్నట్లు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారని కథనంలో చెప్పారు.
కపిల్ త్వరగా కోలుకోవాలని తాజా, మాజీ ఆటగాళ్లు ఆకాంక్షించారు. ‘‘కపిల్ జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
‘‘మీరు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని కోహ్లి పోస్టు చేశాడు. బీసీసీఐతో పాటు క్రికెటర్లు ధావన్, రైనా, మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తదితరులు కపిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారని ఈనాడు వివరించింది.

ఏపీలో 8 లక్షలకు చేరుకున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా జోరు తగ్గినా, కేసుల సంఖ్య 8 లక్షలకు చేరుకుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ చాలా వరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అదే విధంగా మరణాల సంఖ్య కూడా తగ్గింది.
మరోవైపు పాజిటివ్ కేసులకు రెట్టింపుగా కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఉంది. అయితే నాలుగైదు జిల్లాల్లో మాత్రం రోజులో ఇంకా ఐదు వందలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కథనంలో చెప్పారు.
గత 24 గంటలుగా రాష్ట్రంలో 80,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,765 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.
తాజాగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,281 మంది కరోనా నుంచి కోలుకున్నారని పత్రిక రాసింది.
గత 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,544 మరణాలు సంభవించాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఏపీలో ప్రస్తుతం 31,721 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,62,419 మంది కరోనా మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ‘ఈ మందు వాడిన కరోనా రోగులు 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు’.. రెమెడెసివీర్‌కు పూర్తి అనుమతులు ఇచ్చిన అమెరికా
- దసరా ఆఫర్లు: భారీ డిస్కౌంట్ల వెనుక మతలబు ఏమిటి? వీటిని మనం నమ్మవచ్చా?
- కరోనావైరస్ - ఏపీ, తెలంగాణ రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- కరోనావైరస్: మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కరోనావైరస్: భారత్‌లో కోవిడ్ సామాజిక వ్యాప్తి లేదా? అధికారులు ఎందుకలా చెబుతున్నారు?
- గ్రామాల్లో కరోనా వైరస్ విజృంభణ.. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తికి ఇది సంకేతమా
- భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కరోనావైరస్.. దీన్ని తొలగించడం ఎలా?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























