లద్ధాఖ్‌ వద్ద చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం - Newsreel

ప్రచురణ

ఇండో - చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఓ చైనా సైనికుడిని ఇండియన్‌ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.

ఎత్తయిన ప్రాంతంలో తీవ్రంగా ఉన్న చలిని తట్టుకోడానికి ఆ సైనికుడికి అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, ఆక్సిజన్‌, ఆహారం, దుస్తులు అందించామని సైన్యం తెలిపింది.

తమ సైనికుడికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆఫ్‌ చైనా అధికారికంగా భారత్‌ను కోరినట్లు సైన్యం తెలిపింది.

నిబంధనల ప్రకారం ఈ సైనికుడిని చైనాకు అప్పగిస్తామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

బిహార్‌ ఎన్నికలు: గేదె మీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్‌ వేసిన అభ్యర్థి

ప్రజలను ఆకర్షించడానికి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధులు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

దర్భాంగా జిల్లా బహదూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న నచారి మండల్‌ అనే అభ్యర్ధి నామినేషన్‌ వేయడానికి గేదె మీద వచ్చారు.

తానొక సామాన్య రైతునని, తన దగ్గర మోటార్‌ సైకిల్‌, కారులాంటివేవీ లేవని అందుకే గేదెపై వచ్చానని మండల్‌ తెలిపారు.

ఆవు, గేదె, ఎద్దు శ్రమజీవులకు ప్రతీకలని ఆయన అన్నారు. తాను బలహీనవర్గాల నుంచి వచ్చానని, వారి కోసం కృషి చేస్తానని నచారి మండల్‌ వెల్లడించారు.

గత ఎమ్మెల్యేలు ఇక్కడ అభివృద్ధి పనులు చేయలేదని, తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో బహదూర్‌పూర్‌ వాణిని వినిపిస్తానని అంటున్నారు మండల్‌.

పెరూలో వెలుగుచూసిన 2,000 ఏళ్ల కిందటి భారీ పిల్లి రేఖాచిత్రం

పెరూలోని ప్రపంచ వారసత్వ ప్రాంతం ది నజ్కా లైన్స్‌ వద్ద సుమారు 2000 ఏళ్ల కిందట గీసినట్లుగా భావిస్తున్న ఒక పిల్లి రేఖాచిత్రాన్ని పురాతత్వవేత్తలు గుర్తించారు. మట్టి మీద భారీ బొమ్మలు గీసే జియోగ్లిఫ్‌ అనే కళకు నజ్కా ప్రసిద్ధం.

వేల సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న ఈ పిల్లి బొమ్మను ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. ఈ ప్రాంతంలో దొరికిన అనేక జియోగ్లిఫ్ కళాఖండాలను సందర్శకులు చూడటానికి వీలుగా ఒక అబ్జర్వేటరీ నిర్మించేందుకు అధికారులు రోడ్డు మార్గం వేస్తున్న సమయంలో ఈ బొమ్మ బయటపడింది.

ఒక కొండవాలు మీద గీసి ఉన్న ఈ భారీ పిల్లి ఆకారం చెరిగిపోయే దశలో ఉందని పెరూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు 37 మీటర్ల పొడవున్న ఈ బొమ్మను సంరక్షించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

నజ్కా ప్రాచీన సంస్కృతికి చెందిన ఈ బొమ్మను క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తుశకం 200 మధ్య కాలంలో చిత్రించి ఉండొచ్చని పెరూ చీఫ్‌ ఆర్కియాలజిస్టు జానీ ఇస్లా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)