భారత్‌కు తొలి ఆస్కార్ తీసుకొచ్చిన బాలీవుడ్ కాస్టూమ్ డిజైనర్ భాను అథైయా మృతి - BBC NewsReel

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన అలనాటి బాలీవుడ్ కాస్టూమ్ డిజైనర్ భాను అథైయా మరణించారు. 91 ఏళ్ల ఆమె ముంబయిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2012 నుంచి ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు.
రిచర్డ్ అటెన్‌బరో గాంధీ జీవిత చరిత్రపై తీసిన మహాత్మా గాంధీ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా 1983లో అకాడెమీ అవార్డు అందుకున్నారు భాను అథైయా.
1950లలో కెరియర్ ప్రారంభించిన ఆమె 100కు పైగా చిత్రాలకు కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు.
గురుదత్, యశ్ చోప్రా, రాజ్ కపూర్ వంటి ప్రముఖల సినిమాలకు సేవలు అందించారు.
2001లో ఆస్కార్‌కు నామినేట్ అయిన భారతీయ సినిమా లగాన్‌కు కూడా ఆమె కాస్టూమ్స్ డిజైన్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
'కరోనావైరస్ నియంత్రణలో విఫలం'.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రిపై విచారణ
కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్, ఆరోగ్య శాఖ మంత్రి ఒలివీర్ వెరన్, ఇతర ప్రభుత్వ అధికారులు.
వీరిపై విచారణ జరపాలని డాక్టర్లు, బాధితులు, ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వైద్య పరికరాలు, సదుపాయాలను అందించలేకపోయిందని, ప్రభుత్వ స్పందన చాలా నెమ్మదిగా ఉందంటూ ఆరోపణలు చేశారు.
దీంతో ఆ దేశ న్యాయస్థానం ప్రస్తుత ప్రధానమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మాజీ ప్రధాన మంత్రి, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి మంత్రి, ఇతర ప్రభుత్వాధికారులపై విచారణకు ఆదేశించింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఒలివీర్ వెరన్ సహా పలువురు అధికారుల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి, సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో ప్రధాన మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు తప్పు చేశారు అనడానికి తగిన ఆధారాలు లభిస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. వీరంతా కరోనావైరస్ బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను కావాలనే తీసుకోలేదు అని రుజువు చేసేలా ఆ ఆధారాలు ఉండాలి.

ఫొటో సోర్స్, PASCAL GUYOT
కరోనావైరస్: ఫ్రాన్స్‌లో మళ్లీ పెరుగుతున్న కేసులు, తొమ్మిది నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ
కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్యారిస్ సహా తొమ్మిది నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మైక్రాన్ తెలిపారు.
రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, శనివారం నుంచే ఈ ఆంక్షలు మొదలవుతాయని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. నాలుగు వారాలకుపైనే ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితి కూడా ప్రకటించారు.
బుధవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 22.951 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కేసులు ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాల్లో బార్లు, రెస్టారెంట్లను త్వరగా మూసివేయాలని జర్మనీ ప్రకటించింది.
ఏప్రిల్ తర్వాత ఇక్కడ తొలిసారిగా రోజుకు 5,000కుపైగా కేసులు నమోదయ్యాయి.
నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్‌తోపాటు స్పెయిన్‌లోని కెటలోనియా తదితర ఐరోపా ప్రాంతాల్లో రెండోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను మళ్లీ విధిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
డోనల్డ్ ట్రంప్ కుమారుడు 14 ఏళ్ల బ్యారన్‌కు కరోనావైరస్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుమారుడైన 14 ఏళ్ల బ్యారన్‌కు కరోనావైరస్ సోకిందని ఆ దేశ ప్రథమ మహిళ లేడీ మెలానియా వెల్లడించారు.
బ్యారన్‌కు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసినప్పుడు ఆమె, "భయపడినట్లే జరిగింది" అని వ్యాఖ్యానించారు. "అతడు ధృఢమైన టీనేజర్ కావడంతో అదృష్టవశాత్తు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు" అని అన్నారు.
ట్రంప్, ఆయన భార్యతో పాటు వైట్ హౌజ్‌లోని సిబ్బంది కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రంప్, మెలానియా ఆ తరువాత కోవిడ్ నుంచి కోలుకున్నారు.
బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, "నా చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
డెస్ మోయిన్స్‌లో ఎన్నికల ప్రచార సభలో కూడా ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. "నా కుమారుడికి పాజిటివ్ వచ్చింది. కానీ, అది చాలా స్వల్ప కాలం కనిపించింది. బహుశా అతడికి ఈ వైరస్ సోకిందని కూడా తెలిసి ఉండదు. రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల ఆ లక్షణాలేవీ కనిపించలేదు. ఇప్పుడు బ్యారన్ ముద్దుగా, హాయిగా ఉన్నాడు" అని అన్నారు.
మళ్లీ టెస్ట్ చేసినప్పుడు బ్యారన్‌కు నెగెటివ్ వచ్చిందని మెలానియా తెలిపారు.
ట్రంప్ సుప్రీంకోర్టు నామినీగా ఆమీ కోనీ బ్యారెట్ పేరు ప్రకటించేందుకు వైట్ హౌజ్‌లో ఏర్పాటైన కార్యక్రమం వల్లనే అక్కడి వారికి వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు.
జాన్ హాప్కిన్స్ సమకూర్చిన సమాచారం ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 78 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2,16,000 మరణాలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం
- తెలంగాణ: ధరణి వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్డేట్ చేసేటప్పుడు వస్తున్న సమస్యలివీ...
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- మగవాళ్ల ‘శీలం కాపాడే’ పరికరాన్నిసైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లాక్ చేసే ప్రమాదం
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























