దిల్లీ: మరో ప్రేమికుడి హత్య... కులం తక్కువని కొట్టి చంపారు - ప్రెస్ రివ్యూ

రాహుల్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, FB/Sabyasachi Biswas

ప్రచురణ

అమ్మాయితో స్నేహం చేయడం నచ్చక దిల్లీలో ఒక యువకుడిని కొట్టి చంపారని సాక్షి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఒక యువతితో స్నేహం చేసినందుకు దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ దిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్‌ రాజ్‌పుత్‌ ఢిల్లీ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని కథనంలో చెప్పారు.

కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది.

ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు ఆర్య చెప్పారని సాక్షి రాసింది.

అయిదుగురు వ్యక్తులు రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలిపింది.

ఈ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి దిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది.

పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్‌ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారని సాక్షి వివరించింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

కలర్ ప్రిడిక్షన్ గేమ్, హవాలా ద్వారా కోట్లు కొట్టేసిన చైనా కంపెనీలు

చైనా సంస్థలు హవాలా ద్వారా 10 నెలల్లో 1500 కోట్లు తరలించాయని హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఈనాడు కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో అభియోగ పత్రాలను సమర్పించారు.

కేవలం 10 నెలల వ్యవధిలో రూ.1500 కోట్లను హవాలా మార్గంలో హాంకాంగ్‌, బీజింగ్‌లకు తరలించారని అందులో పేర్కొన్నారని పత్రిక రాసింది.

ఏడాదిన్నర క్రితం చైనాకు చెందిన నిందితులు దిల్లీకి వచ్చారు. డోకీపే, లింక్‌యున్‌ సంస్థలతో పాటు అనుబంధంగా 30 ఈ-కామర్స్‌ కంపెనీలను ప్రారంభించి టెలిగ్రామ్‌ మెసెంజర్‌ ద్వారా బృందాలు ఏర్పాటు చేశారు.

రంగు గుర్తింపు (కలర్‌ ప్రిడిక్షన్‌) పేరుతో ఆటలాడించి వీరు రూ.కోట్లు పట్టుకెళ్లారని కథనంలో చెప్పారు.

కలర్‌ ప్రిడిక్షన్‌ పేరుతో మోసగించారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఇద్దరు బాధితులు మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో చైనా సంస్థల వ్యవహారం బయటపడింది.

సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం ఆగస్టులో దిల్లీలో చైనీయుడు యాన్‌హువోతో పాటు అంకిత్‌, ధీరజ్‌, నీరజ్‌లను అరెస్టు చేశారని, నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టు అనుమతితో విచారించారని పత్రిక చెప్పింది.

మొత్తం రూ.1500 కోట్లు అక్రమంగా తరలించారని.. యాన్‌హువో సహా ఆరుగురు చైనీయులు, 18 మంది భారతీయులు నిందితులని కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు.

చైనా సంస్థలు నల్లధనంతో పాటు దేశభద్రతకు భంగం కలిగించే చర్యలేమైనా చేస్తున్నాయా అనే కోణంలో పరిశోధిస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహిస్తున్న 32 చైనా సంస్థలు లావాదేవీల కోసం 30 లక్షల ఖాతాలు నిర్వహిస్తున్నాయని, ఇందులో 25 లక్షల మంది ఫొటోలు, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలను సేకరించాయని పోలీసులు చెప్పారు.

చైనా సంస్థల అక్రమాలపై ఐటీ, ఈడీలకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ రెండు సంస్థలూ దీనిపై సమాంతరంగా దర్యాప్తు చేపట్టాయని ఈనాడు వివరించింది.

ఆర్థిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్: ఎన్‌సీఆర్‌బీ-2019 నివేదిక

ఆర్థిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ఎన్‌సీఆర్‌బీ-2019 నివేదిక వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఆర్థిక నేరాల్లో, ఆ తరహా కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ గతేడాది దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మహిళలను అంగడి సరుకులుగా విక్రయించడంలో మహారాష్ట్రతో పోటీపడి రెండోస్థానం కైవసం చేసుకుంది. అత్యంత ఆందోళనకరమైన ఈ వాస్తవాలను జాతీయ నేర గణాంకాల నివేదిక(ఎన్‌సీఆర్‌బీ)- 2019 వెల్లడించిందని చెప్పింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ స్కాం మొదలుకొని తాజాగా నెల్లూరులో రూ.వంద కోట్ల మోసం వరకూ రాష్ట్రంలో వేల సంఖ్యలో కేసులున్నాయని పత్రిక రాసింది.

దేశంలోనే ఎక్కువ డబ్బున్న రాష్ట్రం మహారాష్ట్ర కన్నా భారీ మోసాల్లో మనమే ముందున్నాం. ఎక్కువ ఆర్థిక మోసాల కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా అందులో సగం జనాభా కూడా లేని ఏపీలో రూ.50 కోట్ల నుంచి 100కోట్లు మోసం చేసిన కేసులు 2019లో ఏకంగా 30 నమోదయ్యాయని కథనంలో చెప్పారు.

దేశంలోనే ఇది అత్యధికం కాగా, రెండోస్థానంలో ఉన్న మహారాష్ట్రలో కేవలం 5 కేసులే ఈ మొత్తంలో ఉన్నాయి. నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌ తదితర మోసాలకు సంబంధించి నిందితులు, బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని పత్రిక చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు 2017లో 6,299 నమోదుకాగా 2018లో 6,473కు పెరిగాయి. గతేడాది ఏకంగా 8,806కు చేరాయి. 2019 డిసెంబరు 31నాటికి 16,652 కేసులు దర్యాప్తులో ఉండగా 63శాతం కోర్టుల విచారణలో ఉన్నాయిని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)