తెలంగాణ రైతు పొలంలో భారీ వజ్రం... ధ్రువీకరించిన నిపుణులు: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణలోని ఒక రైతుకు తన పొలంలో భారీ వజ్రం దొరికిన విషయం ఆలస్యంగా వెలుగు చూసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ జియలాజికల్‌ సర్వే ఇండియా (జీఎస్‌ఐ) గతంలో చేసిన ప్రకటనకు దీంతో బలం చేకూరింది.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ పరిమాణంలో వజ్రం దొరికింది.

సదరు రైతు బాగా చదువుకున్నవాడు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ రాయిని హైదరాబాద్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో అది వజ్రమేనని తేలిందని కథనంలో రాశారు.

అంతటితో సంతృప్తి చెందని సదరు రైతు.. ల్యాబ్‌ నివేదికను వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌కు చూపించాడు. ప్రొఫెసర్‌ కూడా అది వజ్రమేనని నిర్థరించారు.

ఈ విషయం బయటికి వస్తే తన భూమిని ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళన చెందిన రైతు.. దాన్ని బయట పెట్టొద్దంటూ ఆ ప్రొఫెసర్‌ను వేడుకున్నాడని పత్రిక చెప్పింది.

ఈనెల మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు శతాబ్దాల కిందటే మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరకడంతో జీఎస్‌ఐ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు పాటు సర్వే చేశారు.

ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది.

ఆయా జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో మ్యాపులు సైతం ఖరారు చేశారు. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియో ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు.

నల్లగొండ జిల్లాలోని రామడుగు, చండూరు, గుర్రంపోడులో వజ్ర నిక్షేపాలు ఉన్నాయని, మిర్యాలగూడ సమీపంలోని ఉట్లపల్లి తదితర ప్రాంతాల్లోనూ రాంప్రెంట్స్‌ (ద్వితీయ శ్రేణి నాణ్యత కలిగిన) వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ప్రొఫెసర్లు నిర్దారించారు.

ఇక్కడ జీఎస్ఐ సర్వే చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

దీనిపై స్పందించిన కేంద్రం సర్వే జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఏడాది క్రితం నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎండీసీ)ని ఆదేశించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

మాస్క్‌ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు

బయట మాస్క్ ధరించని వారికి సరుకులు, మందులు, ఎరువులకు వస్తే నిరాకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఏడాదికిపైగా కరోనా వైరస్‌ వెంటాడే పరిస్థితులు ఉన్నందున ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మాస్కు ధరించని వారికి విద్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, దుకాణ సముదాయాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలోకి అనుమతి నిరాకరించాలని సూచించిందని పత్రికలో రాశారు.

ఒకవేళ మాస్కులు లేకుండా ఎవరైనా వస్తే సంబంధిత ప్రదేశాల్లోనే వాటిని కొనుక్కునేలా అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఔషధాలు, చౌక దుకాణాలు, ఎరువుల దుకాణాలకు వచ్చినవారు మాస్కులు ధరించకుంటే సేవలను నిరాకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారని ఈనాడు చెప్పింది..

మాస్కులు ధరించడంతోపాటు ఎడం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరని పేర్కొన్నారు.

ఈ 3 ప్రమాణాలను పాటించడంపై 3 నిమిషాల్లో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘మాస్కే కవచం’ కింద చేపట్టిన ప్రచార కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజలు స్వీయరక్షణ చర్యలు పాటిస్తున్నది లేనిది పోలీసులు గుర్తించి ప్రభుత్వానికి వారాంతపు నివేదికలివ్వాలని ఆదేశించారని ఈనాడు కథనంలో వివరించారు.

ప్రభాస్ చిత్రంలో అమితాబ్

ప్రభాస్ తాజా సినిమాలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

ప్యాన్‌ ఇండియా సరికొత్త సూపర్‌స్టార్‌ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ 50 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.

ఇందులో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించిందని పత్రిక రాసింది.

ఈ సందర్భంగా అశ్వినీదత్‌ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో భారతీయ సినిమా గర్వించదగ్గ ఆర్టిస్ట్‌ అమితాబ్‌గారు భాగమవ్వడం చాలా సంతోషం. ఆయనకు స్వాగతం పలకడం నాకు లభించిన అద్భుతమైన, అత్యంత సంతృప్తికర క్షణం’’ అన్నారు.

ప్రభాస్ ‘‘అమితాబ్‌ బచ్చన్‌తో నటించాలనే నా కల ఎట్టకేలకు నిజమౌతోంది. నమస్కారం బిగ్‌ బీ’’ అన్నారని చెప్పింది.

‘‘అమితాబ్‌గారికి ఎన్నో ఆఫర్లు వస్తాయి. వాటిలో మా సినిమా అంగీకరించడం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయనది కేవలం అతిథి పాత్రో, ప్రత్యేక పాత్రో కాదు. కథకు చాలా ముఖ్యమైన పాత్ర. బిగ్‌ బీ మాకు కేటాయించిన సమయానికి న్యాయం చేస్తాం’’ అన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

2021లో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2022లో విడుదలవుతుందని సాక్షి రాసింది.

రుద్రం క్షిపణి ప్రయోగం విజయవంతం

డీఆర్డీవో తయారు చేసిన రుద్రం క్షిపణి విజయవంతం అయ్యిందని నమస్తే తెలంగాణ ఒక వార్తను ప్రచురించింది.

తూర్పు లఢక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి భారత్‌ అన్ని విధాలుగా సమాయత్తమవుతున్నది.

శత్రువులకు దీటుగా సమాధానం చెప్పేందుకు అమ్ముల పొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. దీంట్లో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారుచేసిన న్యూ జనరేషన్‌ యాంటీ-రేడియేషన్‌ క్షిపణి ‘రుద్రం-1’ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించిందని పత్రిక రాసింది.

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సుఖోయ్‌-30 నుంచి డీఆర్డీవో ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించింది.

శత్రువుల రాడార్లు, ట్రాకింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను నాశనం చేయగల సామర్థ్యమున్న ఈ క్షిపణి భారత వాయుసేనను మరింత బలోపేతం చేయనున్నదని అధికారులు తెలిపారని కథనంలో చెప్పారు.

అధికారులు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి యాంటీ-రేడియేషన్‌ క్షిపణి ఇదేనన్నారు. మాక్‌ 2 వేగంతో (ధ్వని వేగానికి రెండు రెట్లు) ఇది ప్రయాణిస్తుందని వెల్లడించారు. సుఖోయ్‌ యుద్ధ విమానాల నుంచి వీటిని ప్రయోగించనున్నట్టు వివరించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)