హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి వెళ్లే పార్శిళ్లలో 30 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
శంషాబాద్ విమానాశ్రయం నుంచి పార్శిళ్లలో వెళ్తున్న బంగారంను తనిఖీల్లో గుర్తించారని నమస్తే తెలంగాణ వార్త రాసింది.
అవి సాధారణ పార్శిళ్లుగానే ఉన్నాయి. వాటిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయికి పంపిస్తున్నారు. డొమెస్టిక్ కార్గో వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు ఎప్పటిలాగే స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
పార్సిళ్లలో రూ.30 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, ఇతర ఆభరణాలు ఉండటాన్ని చూసి అధికారుల కళ్లు తిరిగిపోయాయని ఈ పత్రిక రాసింది.
గుట్టుచప్పుడుకాకుండా 21 కిలోల బంగారంతోపాటు ఇతర ఆభరణాలను కార్గోద్వారా ముంబైకి తరలించేందుకు యత్నిస్తున్నట్టు గుర్తించారని చెప్పింది.
ఈ పార్సిళ్లను ఎవరు తరలిస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వాటిపై ఉన్న బిల్లుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, @PMO India
అక్టోబర్ 6న ప్రధానితో జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారని సాక్షి కథనం ప్రచురించింది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ ఉదయం.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందందని పత్రిక తెలిపింది.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రధాని దృష్టికి కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను తీసుకెళ్లి త్వరగా పరిష్కరింపచేయాలని కోరడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
సీఎం జగన్ ఐదో తేదీ ఉదయం పులివెందుల వెళతారు. అక్కడ తన మామగారైన ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడినుంచి బయల్దేరి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై రోజువారీ విచారణ: తెలంగాణ హైకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉన్న పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టులను ఆదేశించినట్లు ఈనాడు ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు, సాంఘిక సంక్షేమశాఖ స్కాలర్‌షిప్‌ల కుంభకోణంపై ప్రత్యేక కోర్టు, సీబీఐ ప్రధాన కోర్టు, ఏసీబీ ప్రధాన న్యాయస్థానాలకు శనివారం ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది.
తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సీబీఐ కోర్టు పరిధిలోని ఇతర కోర్టులు, సిటీ సివిల్ కోర్టులు, సిటీ స్మాల్ కాజెస్ కోర్టుల్లో భౌతిక విచారణ చేపట్టడమా? లేదంటే నవంబరు 6 వరకు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే విచారించడమా? అన్నది సంబంధిత హైకోర్టు పరిపాలనా జడ్జితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లుగానే కేసులను భౌతికంగా, లేదా ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేయవచ్చని హైకోర్టు తెలిపింది.
విచారణ ప్రక్రియపై రోజువారీ నివేదికలను సంబంధిత హైకోర్టు పరిపాలన జడ్జితోపాటు రిజిస్ట్రీకి పంపాలని హైకోర్టు తమ ఆదేశాలలో వెల్లడించిందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
వడ్డీ మీద వడ్డీ మాఫీ
మారటోరియం కాలంలో రూ.2 కోట్ల వరకూ ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.
మధ్యతరహా వ్యాపారులకు కొంతమేర ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది.
మారటోరియం కాలానికి (అంటే మార్చి1 నుంచి ఆగస్టు 31దాకా) రుణాలపై వారు చెల్లించాల్సిన వడ్డీపై వడ్డీని(చక్రవడ్డీని) మాఫీ చేయడానికి అంగీకరించింది.
రూ.2 కోట్ల దాకా ఉన్న రుణాలకు ఇది వర్తిస్తుందని, అంతకు పైబడ్డ వాటికి అంగీకరించే ప్రశ్న లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఓ అఫిడవిట్‌లో తెలిపింది.
గృహ, విద్యా, వినియోగ వస్తువుల కోసం చేసిన రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఎంఎస్ఎంఈలు తీసుకున్నవి, వినియోగ రుణాలు.. మొదలైనవి రూ.2 కోట్ల లోపు ఉంటే వాటిపై వసూలు చేయదలిచిన వడ్డీపై వడ్డీని రద్దు చేస్తా రు.
దీని వల్ల కోట్లాది రుణగ్రహీతలు కొంతవరకూ లాభపడతారని కేంద్రం పేర్కొందని ఆంధ్రజ్యోతి వివరించింది
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























