You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తండ్రిని చంపి తల్లి సాయంతో పాతిపెట్టిన యువకుడు -ప్రెస్‌రివ్యూ
మద్యం తాగి విసిగిస్తున్నాడన్న కారణంగా తల్లితో కలిసి ఓ యువకుడు తన తండ్రిని హతామార్చాడని 'ఈనాడు' కథనం తెలిపింది.
''తల్లీకొడుకులు కలిసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా తమ పొలంలోనే పాతిపెట్టారు. అల్లుడు ఆరా తీయడంతో దాదాపు రెండు నెలల తరువాత ఈ ఘోరం బయటపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఠాణా పరిధి గుండాల గ్రామానికి చెందిన సాలె కిష్టయ్య(45), లలిత దంపతులు వ్యవసాయ కూలీలు.
కొడుకు రమేశ్(20) చేవెళ్లలోని ఓ ఆసుపత్రి వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కిష్టయ్యకు మద్యం తాగే అలవాటు ఉండడంతో భార్యతో నిత్యం గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో 55 రోజుల కిందట ఇలాగే గొడవపడగా కొడుకు రమేశ్ క్షణికావేశంలో తండ్రి గొంతు నులిమాడు.
దాంతో కిష్టయ్య మృతిచెందగా భయపడిన తల్లి, కొడుకు కలిసి శవాన్ని పొలంలో పాతిపెట్టారు.
కొన్ని రోజులుగా కిష్టయ్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అల్లుడు నిలదీయడంతో గురువారం ఈ విషయం బయటపడింది.
తల్లీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల కేసులో రకుల్‌ప్రీత్ సింగ్ విచారణ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద ఆత్మహత్య కేసులో మాదకద్రవ్యాల కోణం దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సీబీ)ముందు శుక్రవారం నటీమణి రకుల్‌ప్రీత్ సింగ్ హాజరు కాబోతున్నట్లు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో రాసింది.
మరోవైపు బాలీవుడ్ నటీమణులు దీపిక పదుకోణ్, సారా అలీఖాన్, శ్రద్ధాదాస్ శనివారం హాజరుకానున్నారు. ఈ మేరకు ఎన్‌సీబీ వర్గాలు ధ్రువీకరించాయని ఆ కథనంలో పేర్కొన్నారు.
‘‘రకుల్‌కు సమన్లు జారీ చేశామని.. ఆమె వాటిని అందుకున్నారని, విచారణకు సహకరిస్తానని తెలిపారని అధికారులు చెప్పారు. శుక్రవారం రకుల్‌తో పాటు.. దీపిక మేనేజర్ కరిష్మ ప్రకాశ్‌ను కూడా అధికారులు ప్రశ్నించనున్నారు.
ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న దీపిక.. విచారణ కోసం భర్త రణ్‌వీర్‌తో కలిసి ముంబయి చేరుకున్నారు. ఆమె ఇంటి దగ్గర ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
సారా అలీఖాన్ కూడా గురువారం ముంబయి చేరున్నారు. రకుల్, దీపికతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లకు కూడా ఎన్‌సీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చాలా మంది అగ్రనటుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు ధ్రువీకరించడం లేదు’’ అని ఆ కథనంలో రాశారు.
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు? హైకోర్టు ప్రశ్న
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిందని ‘సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.
‘‘మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని చెబుతూ.. రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని మరో మారు ప్రశ్నించింది.
దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది.
వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేక పోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింద’’ని ఆ కథనంలో రాశారు.
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కరోనావైరస్ సోకిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
‘‘జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం విష్ణువర్ధన్ హోంఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తిరుమల డిక్లరేషన్ వివాదంపై బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తనతో పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించార’’ని ఆ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)