‘రాష్ట్రపతి భవన్ మనదే, వేల కోట్లు వస్తాయి’ అంటూ క్రైస్తవులను నమ్మించి మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
మతం ముసుగులో మల్టీలెవెల్ మార్కెటింగ్‌కు దిగిన ఓ వ్యక్తి కోట్ల రూపాయలు సేకరించి, చివరకు కోవిడ్‌తో మరణించడంతో డబ్బులు కట్టిన వారు అయోమయంలో పడ్డారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.
కాకినాడకు చెందిన ఓ వ్యక్తి క్రైస్తవ మతం కష్టాలలో ఉందని, దానిని రక్షించాలంటే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ ప్రచారం ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వం క్రైస్తవుల నిధులను అడ్డుకుంటోందని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని అతను క్రైస్తవులకు, ముఖ్యంగా పాస్టర్లకు నమ్మకం కలిగేలా చెప్పాడు.
రాష్ట్రపతి భవన్‌ను కట్టించింది క్రైస్తవులేనని, త్వరలోనే అది మన సొంతమవుతుందని, దాని ద్వారా వేలకోట్ల రూపాయలు వస్తాయని, క్రైస్తవ సమాజ ఉద్ధరణకు అవకాశం ఏర్పడుతుందని చెప్పి నమ్మించాడు. క్రైస్తవ కౌన్సిల్ నుంచి నిధులు రావాలంటే ముందుగా కమీషన్ చెల్లించాలంటూ మొదలుపెట్టేవాడు. రూ.37500 కడితే రూ.కోటి ఇప్పిస్తానంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపించాడు.
అతన్ని నమ్మి తాము కట్టడమే కాకుండా, చాలామంది ఇతరుల చేత కూడా పెద్ద ఎత్తున ఆ సంస్థకు డబ్బులు కట్టించారు. ఇలా కొన్నాళ్లు సాగిన తర్వాత ఈ నిధులు వసూలు చేసిన వ్యక్తి కోవిడ్‌తో చనిపోయాడని తెలియడంతో బాధితులంతా కాకినాడలో అతని ఇంటికి వెళ్లారు. అయితే ఈ విషయం తమకు తెలియదని, తమతో ఎప్పుడూ ఈ పథకం గురించి చెప్పలేని కుటుంబ సభ్యులు స్పష్టం చేయడంతో బాధితులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇలా మోసం ద్వారా తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేసినట్లు, వాటి విలువ వంద కోట్లు వరకు ఉండవచ్చని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, @KarrotuRaju
మూడు రాజధానులు నమ్మక ద్రోహం-పవన్ కల్యాణ్
కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఎన్నికలకు ముందే చెప్పినట్లుగా, మూడు రాజధానులపై కూడా ముందే ప్రకటన ఎందుకు చేయలేదని ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను ప్రశ్నించినట్లు ఈనాడు కథనం ఇచ్చింది.
మూడు రాజధానుల విషయం ముందు చెప్పినట్లయితే ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయం ఏంటో చెప్పేవారని పవన్ కల్యాణ్ అన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్యని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగపరంగా అందులో జోక్యం చేసుకోలేమని చెబుతోంది తప్ప, అమరావతి రాజధానిగా కొనసాగించడానికే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు.
రాజధాని విషయంలో గత ప్రభుత్వాలు తప్పు చేస్తే సరిదిద్దాలి తప్ప, మార్చాలనుకోవడం సరికాదని, ఇలా మార్చుకుంటూ పోతే దానికి అంతే ఉండదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే బెయిల్ రాదు-ఏడేళ్ల జైలు కూడా
వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష వేసే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
అంటువ్యాధుల చట్టసవరణ బిల్లు-2020కి రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ చట్టం అమల్లోకి రానుందని ఈ కథనం వెల్లడించింది. దీని ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేయడాన్ని బెయిల్ వీలులేని నేరంగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే ఏడేళ్ల జైలుతోపాటు రూ.5 లక్షలు జరిమానా కూడా విధిస్తారు.
కరోనా విస్తరణ సమయంలో మెడికల్ సిబ్బందిపై దేశవ్యాప్తంగా దాడులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏప్రిల్‌లో ఆర్డినెన్స్ తీసుకురాగా, రాజ్యసభలో వాడి వేడి చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
రికవరీలో భారత్ టాప్- తర్వాతే అమెరికా
కరోనా కేసుల్లో భారత్ అగ్రస్థానంలోకి వెళుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నా, రికవరీలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశమే టాప్‌గా నిలుస్తోందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారిలో ఇప్పటికే 42,08,431 మంది కోలుకున్నారని ఈ కథనం పేర్కొంది. దీంతో రికవరీలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుందని సాక్షి తెలిపింది. 41లక్షలమంది రికవరీతో అమెరికా రెండోస్థానంలో ఉంది.
ఒకే రోజు 93వేలకు పైగా కేసుల నమోదు కాగా, అదే రోజు కోలుకున్న వారి సంఖ్య 95వేలకు పైగా నమోదైందని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో 26శాతంగా ఉన్న రికవరీ రేటు సెప్టెంబర్‌నాటికి 79శాతానికి చేరుకున్నట్లు ఇవి సూచిస్తున్నాయి. యాక్టివ్ కేసులకంటే రికవరీ కేసులు 4 రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది.
భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 53 లక్షలు దాటినట్లు ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- భారత్-చైనా వివాదం: హాట్‌లైన్ అంటే ఏంటి? దీనిని ఉపయోగించే అధికారం ఎవరిది?
- వెయ్యి మంది చైనా సైనికులతో 124 మంది భారత జవాన్ల పోరాటం
- భారత్‌కు కరోనావైరస్ వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? క్లినికల్ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయి?
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ కోలుకోని మహిళ కథ
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- హైదరాబాద్‌లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























