తిరుమల బ్రహ్మోత్సవాలు: ‘వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు.. అన్యమతస్తులకు డిక్లరేషన్‌ అక్కర్లేదు’ - టీటీడీ ఛైర్మన్ : ప్రెస్ రివ్యూ

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఫొటో సోర్స్, facebook/IamYVSubbaReddy

ప్రచురణ

కోవిడ్‌ -19 కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరగబోతున్నాయని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించినట్లు సాక్షి పత్రిక రాసింది.

శుక్రవారంనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఏకాంతంలోనే నిర్వహించినట్లు పేర్కొంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ ‌రెడ్డి గరుఢ సేవలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

24న కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కర్ణాటకకు చెందిన సత్రాల భూమి పూజలో వీరిద్దరు పాల్గొంటారు.

అయితే అన్యమతస్థులు ఆలయంలో ప్రవేశించడానికి డిక్లరేషన్‌ అక్కర్లేదని టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రకటించినట్లు ఈనాడు పేర్కొంది. భక్తితో స్వామిని దర్శించుకోవడానికి వచ్చే ఏ మతస్థులైనా ఆలయంలోకి రావచ్చని సుబ్బారెడ్డి ప్రకటించిననట్లు ఈ కథనం వెల్లడించింది.

విమానంలో వచ్చి దొంగతనాలు- హైదరాబాదులో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగ

దర్జాగా విమానంలో వచ్చి హైదరాబాద్‌లో దొంగతనాలు చేసి, మళ్లీ విమానంలో దిల్లీకి చెక్కేసే ఓ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ఇచ్చింది.

కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగ అల్వాల్‌ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతుండేవాడు. చత్తీస్‌గఢ్‌కు చెందిన గిరి గంగాధర్‌ దిల్లీ సమీపంలోని నోయిడాలో నివసిస్తున్నాడు.

గతంలో అల్వాల్‌ ప్రాంతంలో కొన్నాళ్లు నివాసం ఉన్న గంగాధర్‌ ఆ ప్రాంతంపై అవగాహన పెంచుకున్నాడు. ప్రస్తుతం నోయిడాలో ఉంటున్న గంగాధర్‌ తరచూ హైదరాబాద్‌కు విమానంలో వస్తుండేవాడు. నేరుగా అల్వాల్‌, బొల్లారం ప్రాంతాలకు వెళ్లి అక్కడ జన సంచారం తక్కువగా ఉన్నచోట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకునే వాడు.

పట్టపగలే తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకునేవాడు. ఆ పై తాపీగా విమానం ఎక్కి దిల్లీ వెళ్లిపోయేవాడు. ఈ ప్రాంతంలో ఇప్పటికి ఇలా నాలుగు దొంగతనాలు చేశాడు.

అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత దొంగ గంగాధరేనని నిర్ధారించుకున్న పోలీసులు మరోసారి అతను హైదరాబాద్‌ వచ్చినట్లు గుర్తించి కాపుగాసి పట్టుకున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో వెల్లడించింది.

ఉసురు తీసిన ఓపెన్‌ నాలా

సైకిల్‌పై ఆడుకుంటూ ఓ చినారి ఓపెన్‌ నాలాలో పడి మరణించిన ఘటన హైదరాబాద్‌లో విషాదం నింపిందని సాక్షి పత్రిక వెల్లడించింది.

నగరంలోని ఈస్ట్‌ దీనదయాళ్‌ నగర్‌లో నివాసముండే 12 ఏళ్ల చిన్నారి సుమేధ గురువారం సాయంత్రం సైకిల్‌ తొక్కుతూ వీధిలోకి వెళ్లింది. ఆ తర్వాత అదృశ్యమైంది.

చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. వర్షాలకు నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో అందులో పడి ఉంటుందన్న అనుమానంతో శుక్రవారం నుంచి ఉదయం నుంచి నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు.

చివరకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. నాలా వల్లే తన కూతురు చనిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే తన కూతురును చంపేసిందని సుమేధ తండ్రి ఆరోపించగా, ఈ మరణానికి మరేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులపై కేసు నమోదు చేసినట్లు సాక్షి కథనం తెలిపింది.

అమ్మాయిలు

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN

ఫొటో క్యాప్షన్, (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీలో భార్లపై 20% శాతం కోవిడ్‌ ట్యాక్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి బార్లు తెరుచుకోనున్నాయని, అయితే కోవిడ్‌-19 కారణంగా పడిన ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి బార్ల మీద 20% అదనపు పన్నును విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఈనాడు పత్రిక రాసింది.

ఏపీలోని వివిధ బార్లు గతంలో చెల్లించిన లైసెన్స్‌ ఫీజు, నాన్‌ రీఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై 20% పన్నును అదనంగా చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఈ కథనం పేర్కొంది.

కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు మందగించి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అదే సమయంలో ఆరోగ్య సేవలలో ఖర్చులు విపరీతంగా పెరిగాయని, సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నందున ఈ అదనపు పన్నును విధిస్తున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను 2021 జూన్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం, ఈ అంశంలో హైకోర్టులో జరుగుతున్న విచారణ తుది తీర్పుకు లోబడి ఈ నిర్ణయం కొనసాగింపు ఉంటుందని వెల్లడించింది.

101 రోజులు మూతపడి ఉన్న సాధారణ బార్లు, స్టార్ ‌హోటళ్లలోని బార్లు, మైక్రోబ్రూవరీలు శనివారం నుంచి తెరుచుకుంటాయని ఈనాడు కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)