కరోనావైరస్: తెలంగాణలో 94 శాతం మంది ‘ఇంట్లోనే కోలుకుంటున్నారు’ - ప్రెస్‌రివ్యూ

కోవిడ్-19 రోగులకు చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తెలంగాణలో కోవిడ్‌-19 బారినపడుతున్నవారిలో దాదాపు 94 శాతంమంది ఇంట్లోనే ఉంటూ మందులు తీసుకొని కోలుకుంటున్నారని, 6 శాతం మందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతోందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఎఫ్‌) సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో 400 మంది, గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,520 మంది కోవిడ్‌ రోగులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

పాజిటివ్‌గా తేలిన తర్వాత బాధితులకు ప్రభుత్వం తరఫున ఔషధాల కిట్‌ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఔషధాలనే తీసుకుంటూ వ్యాధి నుంచి ఉపశమనం పొందుతున్నామని రోగులు తెలిపారు.

తాము సంప్రదించిన 1,920 మంది రోగుల్లో నలుగురే పరిస్థితి విషమించడంతో మృతి చెందారని హెచ్‌హెచ్‌ఎఫ్‌ అధ్యక్షులు ముజ్‌తాబ్ హసన్‌ అక్సారీ వెల్లడించారు.

గతంలో చాలామందికి ఆక్సిజన్‌ అవసరమయ్యేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి బాగా తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్‌-19 లక్షణాలను ముందే గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం లేకుండా దాన్నుంచి బయటపడవచ్చని తెలిపారు.

ఆరూరి రమేశ్‍

ఫొటో సోర్స్, Facebook/Aroori Ramesh

నాలా మీద కట్టిన ఎమ్మెల్యే కార్యాలయం కూల్చేశారు

నాలాకు అడ్డుగా ఉండి, వరంగల్ సిటీలోని పలు కాలనీల ముంపునకు కారణమవుతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు ఆరూరి రమేశ్‍ క్యాంప్ ఆఫీస్ను గ్రేటర్‍ వరంగల్ మున్సిపల్‍ సిబ్బంది కూల్చేశారని వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

గత నెలలో సిటీలో వానలు విపరీతంగా కురవడంతో వరదనీరు ఇక్కడ 120 కాలనీలను ముంచెత్తింది. ఆ టైంలో సిటీలో పర్యటించిన మంత్రి కేటీఆర్‍.. నాలాలపై ఆక్రమణలను 15 రోజుల్లో తొలగించాలని, కలెక్టర్‍ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్కు ఫుల్‍ పవర్స్ఇస్తున్నామని చెప్పారు. అనంతరం రమేశ్ కార్యాలయాన్ని కూల్చేశారు.

క్యాంప్‍ ఆఫీస్‍ స్థలాన్ని తాను ఆక్రమించలేదని, పట్టా కాగితాలు ఉన్నాయని రమేశ్ చెప్పారు. ఒకవేళ నాలా ప్రవాహానికి తన ఇల్లు అడ్డుగా ఉంటే కూల్చివేతకు రెడీ అన్నారు.

కూల్చివేత సమయంలో మొదట ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. టాస్క్ఫోర్స్ ఆదేశాలతోనే కూల్చివేస్తున్నామని, అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.

సింబాలిక్ ఇమేజ్

12 ఏళ్ల క్రితం హ‌త్య‌.. కానీ బ‌తికే ఉంది

''ఓ 14 ఏళ్ల బాలిక 12 ఏళ్ల క్రితం హ‌త్య‌కు గురైంది. ఈ హ‌త్య కేసులో ఆరుగురు వ్య‌క్తులు జైలు శిక్ష కూడా అనుభ‌వించారు. కానీ నాడు హ‌త్య‌కు గురైన అమ్మాయి బ‌తికే ఉంది. పెళ్లి కూడా చేసుకుని హాయిగా జీవిస్తోంది''అంటూ నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌లౌన్ జిల్లాలోని క‌ల్పి ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల యువ‌తి 2008లో అదృశ్య‌మైంది. ఆ అమ్మాయి త‌ల్లి కొత్వాలి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కొద్ది రోజుల త‌ర్వాత కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ఏరియాలో ఓ యువ‌తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. దీంతో పోలీసులు.. ఆ మృత‌దేహాన్ని అదృశ్య‌మైన అమ్మాయి త‌ల్లికి చూపించారు. ఆమె త‌న కూతురే అని నిర్దారించింది.

త‌న బిడ్డ‌ను ఆరుగురు వ్య‌క్తులు క‌లిసి కిడ్నాప్ చేసి హ‌త్య చేశార‌ని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. వీరంతా బెయిల్‌పై విడుద‌ల అయ్యారు. వీరిలో ఒక నిందితుడు 2012లో చ‌నిపోయాడు.

అయితే ఓ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి ఫిర్యాదుతో నాడు త‌ప్పిపోయిన అమ్మాయిని జ‌లౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడామె వ‌య‌సు 26 ఏండ్లు. పెళ్లి కూడా అయింది. మ‌రి నాడు ల‌భించిన మృత‌దేహం ఎవ‌రిది? అనే విష‌యంలో పోలీసుల‌కు అంతు చిక్క‌డం లేదు.

అక్రమ లే-అవుట్లు

ఫొటో సోర్స్, Getty Images

అక్రమ లే-అవుట్ల క్రమబద్ధీకరణ చార్జీల తగ్గింపు

తెలంగాణలో అక్రమ లే-అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నట్లు సాక్షి ఓ కథనం ప్రచురించింది.

లే-అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు(ఎల్‌ఆర్‌ఎస్‌)-2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు.

రిజిస్ట్రేషన్‌ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్‌ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్‌ తేదీ నాటికి ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది.

2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్‌ విలువ ఆధారంగా ప్లాట్‌ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది.

ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే, రిజిస్ట్రేషన్‌ తేదీ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ప్లాట్‌ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)