ప్రభాస్: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

సినీ హీరో ప్రభాస్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా అర్బన్‌ ఫారెస్టును దత్తత తీసుకున్నట్లు సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘హైదరాబాద్‌ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.

ఈ నిర్ణయం వల్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంట దుండిగల్‌ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు, ఎకోటూరిజం సెంటర్‌ అందుబాటులోకి రానుంది.

సోమవారం సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్‌ పార్క్‌ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్‌ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు.

ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

భారత్‌లో అతిపెద్ద కోవిడ్‌-19 కేర్ సెంటర్‌ మూసివేతకు సిద్ధం

దేశంలోనే అతిపెద్ద కోవిడ్‌-19 కేర్ సెంటర్‌గా భావిస్తున్న బెంగళూరులోని కేంద్రాన్ని సెప్టెంబరు 15న మూసివేయనున్నాట్లు ఈనాడు తెలిపింది.

‘‘లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనావైరస్‌ బాధితులకు చికిత్స అందించడం కోసం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) దీన్ని ఏర్పాటు చేసింది.

కాగా, 10 వేల పడకల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రాన్ని మూసివేయనున్నట్లు సెప్టెంబరు 4 నాటి ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోవిడ్ కేర్ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీఎంపీ వెల్లడించింది.

పూర్తిగా లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. కోవిడ్ కేంద్రాల్లో చేరే వారి సంఖ్య పడిపోవడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కాగా, కోవిడ్ కేంద్రాల్లోని పడకలు, ఫ్యాన్లు, డస్ట్‌బిన్లు, తదితరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలు, ఆసుపత్రులకు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. అయితే, గతంలో ఈ కోవిడ్ సెంటర్‌పై విమర్శలు వచ్చాయి.

అక్కడ వినియోగించే పడకలు, ఇతర వస్తువులను ఎక్కువ ధరకు అద్దెకు తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అవసరమైన సామాగ్రిని ప్రభుత్వమే కొనుగోలు చేసింద’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళన ప్రారంభమైందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది. అవినీతికి ఆస్కారంలేని నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నవేళ ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలు తీసుకుందని తెలిపింది.

రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితోపాటు భూ లావాదేవీల్లో కోర్‌ బ్యాంకింగ్‌ తరహా వ్యవస్థను అమలుచేసేలా 'ది తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ బిల్‌- 2020'ని ఆమోదించింది.

ప్రగతిభవన్‌లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

''భూరికార్డుల నిర్వహణ చేతిలో ఉన్న వీఆర్వోలు కొంతమంది తమ చేతివాటం చూపించడంతో రెవెన్యూశాఖకు అవినీతి మరకలు అంటాయి. వీఆర్వో వ్యవస్థ అంటేనే అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. దీంతో భూ రికార్డుల నిర్వహణతోపాటు, భూ లావాదేవీల వ్యవహారాన్నంతా కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తోంది''.

ఈ క్రమంలోనే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ బిల్లును క్యాబినెట్‌ ఆమోదించింది.

కరోనాకు మనిషిని చంపేంత శక్తి లేదు: ఈటల రాజేందర్

''కరోనాకు మనిషిని చంపేంత శక్తి లేదు. ఇది ఆరు నెలల అనుభవంలో తెలిసిపోయింది''అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''99 శాతం మంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది. భయాన్ని పక్కనపెడితే కరోనాను ఈజీగా జయించొచ్చు''

ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు ట్రీట్మెంట్ఒక్కటేనని, అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన సూచించారు. సర్కారు హాస్పిటల్స్లో ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నామని చెప్పారు.

ఊళ్లలో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్లో 22 వేల మంది ఆశావర్కర్స్, 500 మంది ఏఎన్ఎంలతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.

సీజనల్ డిసీజెస్, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉన్నాయని, సాధ్యమైనంత తొందరగా టెస్టులు చేసి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలుంటే, తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలన్నారు.

ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని, జీతం పెంచే విషయాన్ని సీఎంతో చర్చిస్తామని మంత్రి అన్నారని ఆ కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)