ఒకే రోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఒకే రోజు కరోనా కేసులు రికార్డు సంఖ్యలో నమోదైనట్లు ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా దేశంలో ఒకేరోజు 75,760 కేసులొచ్చాయి.
సంఖ్యాపరంగా అగ్రభాగంలో ఉన్న అమెరికా, బ్రెజిల్‌తో సహా ప్రపంచంలోని మరే దేశంలోనూ 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదుకాలేదు. ఈ నెలలో ఇప్పటివరకు 9 సార్లు 50 వేలకుపైగా, 17 సార్లు 60 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 75 వేలను మించింది.
ఈ నెలలో ఇప్పటివరకు రోజుకు సగటున 61,902 చొప్పున 16 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 56,013 మంది కోలుకున్నారు. 1,023 మంది మరణించారు. ఇలా వరుసగా వెయ్యికిపైగా మరణాలు నమోదుకావడం ఇది రెండోరోజు.
ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంతగా యాక్టివ్ కేసులు 18,724మేర పెరిగాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, కేరళ, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ సంఖ్యలో కేసులు వృద్ధిచెందడంతో 70 వేల మార్క్ దాటిందని ఈనాడు రాసింది.
రోజువారీ కేసుల వృద్ధిలో బెంగుళూరు, పుణే, ముంబయి, ఠాణే, దిల్లీ, తూర్పుగోదావరి, చెన్నై, నాగ్‌పూర్, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి.
టాప్-5 రాష్ట్రాల్లో 24 గంటల్లో 45,896 కొత్త కేసులొచ్చాయి. మొత్తం కేసుల్లో 61%, మరణాల్లో 68% ఈ అయిదురాష్ట్రాల వాటానే ఉంది.
అమెరికాలో జులైలో నాలుగుసార్లు గరిష్ఠసంఖ్యలో 74వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును భారత్ బద్దలు కొట్టిందని కథనంలో చెప్పారు.
మరణాల పరంగా భారత్ బ్రెజిల్‌కంటే చాలా దూరంలో ఉన్నప్పటికీ కేసుల పరంగా మరో వారం రోజుల్లో ఆ దేశాన్ని దాటే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ రెండింటి మధ్య 4,14,255 కేసుల తేడా ఉంది. ప్రతిరోజూ బ్రెజిల్‌కంటే భారత్‌లో 50% కేసులు అధికంగా నమోదవుతున్నందున త్వరలోనే రెండోస్థానానికి చేరడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం మరణాల రేటు 1.82%, రికవరీ రేటు 76.24%కి చేరిందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Facebook
మెగాస్టార్ ఆచార్య కథపై ఆరోపణలు నిరాధారం-చిత్ర యూనిట్
చిరంజీవి ‘ఆచార్య’ కథపై వస్తున్న కాపీ ఆరోపణలు నిరాధారమైనవి అని చిత్రయూనిట్ అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం చెప్పింది.
‘‘మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఒరిజినల్ కథ, కాన్సెప్ట్ దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నామని అందులో రాశారు.
ఈ కథపై వస్తున్న కాపీ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ టైటిల్ పోస్టర్‌కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి కొందరు రైటర్స్ ‘ఆచార్య’ సినిమా కథ తమదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని కథనంలో చెప్పారు.
సినిమా చిత్రీకరణ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచాం. చాలా తక్కువ మందికి మాత్రమే కథ గురించిన అవగాహన ఉంది. కేవలం మోషన్ పోస్టర్‌ను చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం.
అందరికీ చెప్పాలనుకున్న విషయమొకటే.. ‘ఆచార్య’ కథ ఒరిజినల్. కొరటాల శివలాంటి పేరున్న దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి వస్తోన్న రూమర్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఈ కథపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి, తప్పుడు కథనాలు. ఎవరికి వారు ఉహించుకున్నవి. ఈ కథ కోసం మెగాస్టార్‌తో కొరటాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కు తగినట్లు పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ‘ఆచార్య’ సినిమా కథను సిద్ధం చేశారు.
శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం..’’ అని చిత్రయూనిట్ తెలియజేసినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, TSMSIDC
ఆస్పత్రి నుంచి కరోనా ఖైదీల పరారీ
గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారని సాక్షి కథనం ప్రచురించింది.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డు బాత్‌రూం కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్‌షీట్‌ను తాడుగా ఉపయోగించి.. ఆస్పత్రి వెనుక వైపు గల గేటు దూకి వీరు పరారైనట్లు సమాచారం అందినట్లు ఇందులో చెప్పారు.
గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో కరోనా సోకిన 19 మందికి వైద్యం అందిస్తున్నారు.
వారిలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు చెందిన ఖైదీలు అబ్దుల్ అర్బాజ్ (21), సోమసుందర్ (20), మహ్మద్ జావీద్ (35), పార్వతీపురం నర్సయ్య (32)లను బుధవారం పోలీసులు చేర్చారు.
గురువారం చేపట్టిన తనిఖీల్లో నలుగురు ఖైదీలు తక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో గాలించారు.
ప్రిజనర్స్ వార్డు బాత్‌రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడంతో ఈ నలుగురు ఖైదీలు పరారైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నతాధికారులకు తెలిపారని సాక్షి రాసింది.
ఆస్పత్రి ప్రాంగణంలోని చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు తెలిస్తోందని వివరించింది.

ఫొటో సోర్స్, facebook/ysjagan
3 రాజధానుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసిందని వెలుగు పత్రిక కథనం ప్రచురించింది.
జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిందని చెప్పింది.
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరోలా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు తెలిపారు, ఈ విషయంలో సీఎంతో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారని కథనంలో పేర్కొన్నారు.
ఇదే విషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు విచారించింది.
అన్ని పిటిషన్లకు కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిందని వెలుగు పత్రిక వివరించింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























