You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ డిసెంబరు నాటికి అంతమైపోతుందా?.. ‘ఇండియా అవుట్‌బ్రేక్ రిపోర్ట్’ అంచనా - ప్రెస్ రివ్యూ
ప్రముఖ డేటా సంస్థ ప్రోటివిటీతో కలిసి 'టైమ్స్ నెట్‌వర్క్ అండ్ రిసెర్చ్' రూపొందించిన 'టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ రిపోర్ట్' ప్రకారం.. సెప్టెంబరు 2 నాటికి దేశంలో 7.87 లక్షల యాక్టివ్ కేసులు ఉంటాయి. అప్పట్నుంచీ సెప్టెంబరు 16 దాకా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చి.. డిసెంబరు 3నాటికి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఆగస్టు 15 నాటికే కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరిందని.. అక్టోబరు 17 నాటికి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఐవోఆర్ అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23 నాటికి కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరి.. అక్టోబరు 28 నాటికి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
ఆగస్టు 20 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28.37 లక్షలు కాగా.. అందులో యాక్టివ్ కేసుల సంఖ్య 6.86 లక్షలు. దాదాపు 21 లక్షల మంది ఇప్పటికే ఆ వైరస్ బారిన పడి క్షేమంగా కోలుకున్నారు. అంటే 74 శాతం రికవరీ రేటు.
ఢిల్లీ, ముంబై, పుణెల్లో నిర్వహించిన సీరో సర్వేల ప్రకారమైతే దేశవ్యాప్తంగా పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లు కనిపిస్తోందనే వాదన వస్తోంది.
శాస్త్రీయ ఏకాభిప్రాయం లేనప్పటికీ సర్వే వివరాల ప్రకారమైతే.. కొన్నిచోట్ల కేసుల సంఖ్య తగ్గడానికి పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీనే కారణమని కొందరు వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.
విజయవాడలో 43.81 శాతం మందిలో యాంటీబాడీస్ కనపడినట్టు సీరో సర్వేలో తేలింది. వీరిలో 40.51 శాతం మందికైతే అసలు తమకు వైరస్ సోకినట్టుగానీ, తగ్గినట్టుగానీ తెలియదు.
ఐఆర్‌సీటీసీలో వాటా విక్రయిస్తున్న ప్రభుత్వం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. వాటా విక్రయ ప్రక్రియను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్‌లను ప్రభుత్వం ఆహ్వానించింది. సెప్టెంబర్ 10 లోగా మర్చంట్ బ్యాంకర్లు బిలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 87.40 వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం.. కంపెనీలో వాటాను ప్రభుత్వం 75 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది.
నూతన భారతావనికి నీవొక రోల్ మోడల్ - ధోనీకి ప్రధాని మోదీ ప్రశంస
క్రికెటర్ ఎంఎస్ ధోనీ 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారతావని మురిసిన క్షణాల్ని ఉదహరిస్తూ యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచావంటూ కితాబిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. క్రికెట్ కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ధోనికి ఇకపై కుటుంబ జీవితం సాఫీగా సాగాలని మనసారా దీవించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. లేఖ పూర్తి పాఠం..
'ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు... ఏం సాధించాం, ఎలా సఫలీకృతం అయ్యామన్నదే ముఖ్యం. ఈ నీ ప్రేరణే యువతకు మార్గనిర్దేశం. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన నీవు యావత్ దేశమే గర్వించేస్థాయికి ఎదిగావు. జాతిని గర్వపడేలా చేశావు. భారత్‌లో, క్రికెట్‌లో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చావ్. నీ ఆటతీరుతో కోట్లాది అభిమానుల్ని అలరించావు. నీ పట్టుదలతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచావు. నూతన భారతావనికి నీవొక రోల్ మోడల్. ఇంటిపేరు లేకుండా వచ్చిన నీవు గొప్ప పేరు, ప్రఖ్యాతలతో నిష్క్రమిస్తున్నావు. నా దృష్టిలో టీమిండియాకు అత్యుత్తమ సారథివి నీవే! నీ సమర్థ నాయకత్వంతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లావు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా బహుముఖ ప్రజ్ఞాపాటవాలున్న అరుదైన క్రికెటర్‌గా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో.... నీవున్నావనే భరోసా టీమిండియాను ఒడ్డున పడేస్తావన్న ధీమా ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో చెక్కు చెదరదు. ఇక నీ పేరు క్రికెట్ లెక్కా పద్దులకు, రికార్డులకే పరిమితం చేయడం ఏమాత్రం సరైంది కాదు. చరిత్రలో నిలిచిన 'మహేంద్రసింగ్ ధోని'ని అంచనా వేసేందుదుకు ఏ కితాబులు సరితూగవు. తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ యంగ్ టీమిండియా సాధించిన 2007 టి20 ప్రపంచకప్ నీ సారథ్యానికి సాటిలేని ఉదాహరణ
నీ హెయిర్ స్టయిల్ ఎప్పుడెలా ఉన్నా... గెలుపోటములను మాత్రం సమానంగా స్వీకరించే లక్షణం చాలా మంది నేర్చుకోవాల్సిన పాఠం. క్రికెట్ బాధ్యతలతో పాటు ఆర్మీకి చేసిన సేవలు అమూల్యం. ఇంతటి ఘనమైన... సాఫల్యమైన కెరీర్‌కు కుటుంబసభ్యుల (సతీమణి సాక్షి, కుమార్తె జీవా) మద్దతు ఎంతో అవసరం. ఇకపై నీవు జట్టు సభ్యులతో కాకుండా మీ వాళ్లతో కావాల్సినంత సమయం గడపొచ్చు. నీకంతా మంచే జరగాలి'' అని మోదీ లేఖలో శుభాశీస్సులు తెలిపారు. ఈ లేఖను ట్వీట్ చేసిన ధోని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. 'కళాకారులు, సైనికులు, క్రీడాకారులు అభినందనల్నే ఆశిస్తారు. వాళ్ల కృషి, త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలనే భావిస్తారు' అని ధోని తెలిపారు.
ప్రైమ్‌లో రిలీజ్ కానున్న నాని, సుధీర్‌ల 'వీ'
నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన 'వీ' సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుందని వీ6 వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. తన 25వ సినిమా అయిన వీ విడుదలపై ట్విట్టర్‌లో నాని క్లారిటీ ఇచ్చాడు. 'వేట కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న ప్రైమ్‌లో వీ రాబోతోంది. ఇప్పుడు వేట, థియేటర్స్ ఓపెన్ అవగానే టక్ జగదీష్ ఆట' అంటూ నాని ఓ లెటర్‌ను పోస్ట్ చేశాడు.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- బ్రెస్ట్ కేన్సర్: ఒక్క డోస్ రేడియో థెరపీ పూర్తి కోర్సుతో సమానం
- తెలంగాణ: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్.. మంటల్లో చిక్కుకున్న ఇంజినీర్లు, సిబ్బంది
- రష్యా: పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం... విమానంలోనే కుప్పకూలిన ప్రతిపక్ష నేత
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)