వైఎస్ జగన్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు: ‘‘పిలిచి అన్నం పెడితే కెలికి కయ్యం పెట్టుకుంటున్నారు’’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, TRS
‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. అయినా.. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారంటూ 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం ప్రచురించింది.
''ఆంధ్రప్రదేశ్‌కు స్నేహ హస్తం అందిస్తే కెలికి కయ్యాలు పెట్టుకుంటున్నదని, కేంద్రం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై అర్థంపర్థంలేని ఫిర్యాదులు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నదని మండిపడ్డారు.
త్వరలో జరుగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం వెల్లడించి.. ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాల నోరు మూయిస్తామని, తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తామని సీఎం వ్యాఖ్యానించారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సోమవారం జల వనరులశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను సీఎం పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై చర్చించారు.
రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థంపర్థంలేకుండా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంబిస్తున్నదని మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు.
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై సీఎం కేసీఆర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు అయినందున స్నేహపూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా సరే.. ఏపీప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెప్తాం. తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి కల్పిస్తాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, facebook/kodalinani
ఇండియాలో పుట్టిన కరోనా బీజేపీ: ఏపీ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ''ఇండియాలో పుట్టిన కరోనా ఒకటుందని, అది బీజేపీ’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను కలిపి తినేస్తోందని, త్రిపురలో కాంగ్రెస్‌ను తినేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.
బీజేపీ అనే కరోనాకి ఇది అది అని ఏం లేదని, అది తగులుకుంటే తినేస్తోందని బీజేపీపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఆల్‌రెడీ వచ్చిందని, బాగా మాస్క్‌లు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మంత్రి కొడాలి చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ మండిపడింది. బీజేపీని కరోనాతో పోలుస్తూ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేవైఎమ్ ప్రకటించింది.
త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో ఒక గొప్ప శక్తిగా ఎదిగిన పార్టీ బీజేపీ అని ట్వీట్ చేసింది. అవినీతి, కుటుంబ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న టీడీపీ, వైసీపీ లాంటి ప్రాంతీయ వైరస్‌లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అని ట్వీట్ చేసింద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BandiSanjya
కరోనా విషయంలో గాఢనిద్రలో తెలంగాణ సర్కారు: జేపీ నడ్డా
తెలంగాణలో కరోనా బాధితులకు ఐసీయూలో బెడ్‌కు రోజుకు రూ.లక్ష ఖర్చవుతోందంటే ప్రజలెంతగా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారని 'ఈనాడు' కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. ''తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల భాజపా కార్యాలయాల నిర్మాణానికి సోమవారం ఆన్‌లైన్ వేదికగా దిల్లీ నుంచి నడ్డా భూమి పూజ చేశారు.
అనంతరం నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గాఢనిద్రలో ఉందని, కరోనా పరీక్షలకు సరైన సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఇక్కడే అతి తక్కువ పరీక్షలు చేస్తున్నారన్నారు. ఆక్సిజన్ అందించలేకపోవడంతో ఒక విలేకరి మరణించారనే విషయం కలిచివేసిందన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిందించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేస్తే తెలంగాణలో 98 లక్షల మందికి రూ. 5 లక్షల మేర ఉచితవైద్యం లభించేదన్నారు.
చేసిన వాగ్దానాలు ఎందుకు అమలుచేయడం లేదో కేసీఆర్ తెలపాలని డిమాండ్ చేశారు. రూ. 45 వేల కోట్లతో పూర్తవుతుందనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 85 వేల కోట్లకు పెరగడానికి అవినీతే కారణమని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు, ఉపాధి కల్పన హామీలు ఆరేళ్లయినా నెరవేరలేదన్నారు.
కరోనాపై పోరులో ప్రధాని మోదీ ప్రపంచానికి మార్గం చూపుతున్నారని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రూ.20లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించారని నడ్డా గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటున్నందున.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెరాసను గద్దె దించి భాజపాను అధికారంలోకి తేవాలని కార్యకర్తలకు నడ్డా పిలుపునిచ్చారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. బెంగాల్, కేరళల మాదిరే తెరాస ప్రభుత్వం భాజపా కార్యకర్తలపై దమనకాండ కొనసాగిస్తోందన్నారు. తెరాస కార్యాలయం కల్వకుంట్ల ఆస్తిగా మిగిలితే, ఎంఐఎం, కమ్యూనిస్టు కార్యాలయాలు సంఘవిద్రోహ శక్తులకు అడ్డాలుగా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో తెరాసను ఓడించి భాజపా అధికారంలోకి వస్తుందన్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఏపీ @ 25 లక్షలు
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించిందని 'సాక్షి' కథనం ప్రచురించింది.
''సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 46,999 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 25,34,304కు చేరినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో పేర్కొంది.
ఇప్పటి వరకూ 25 లక్షలకు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉన్నాయి.
దేశంలోనే అత్యధికంగా మిలియన్ జనాభాకు 47,459 పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంద''ని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారైతే మీ వరకు ఎలా వస్తుంది... ముందుగా ఎవరికి ఇస్తారు?
- మూడేళ్లుగా మూలనపడిన క్రేన్‌ను రిపేరు చేయాలనుకుంటే 11 మంది ప్రాణాలు పోయాయి
- సరిహద్దులో సేనల ఉపసంహరణపై భారత్, చైనా ల ప్రకటనల్లో ఎందుకింత తేడా
- జమ్ముకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది.. కశ్మీరీ పండిట్ల జీవితాలలో వచ్చిన మార్పేమిటి
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- కరోనావైరస్ వ్యాప్తి ఎప్పుడు ఆగుతుందో 'సెరో సర్వేలెన్స్' సర్వేతో తెలుసుకోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























